త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పోల‌వ‌రం పూర్త‌యితే భ‌ద్రాచ‌లానికి నిత్యం జ‌ల‌గండ‌మే: హ‌రీశ్‌రావు

Harish Rao | పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం భవిష్యత్తులో 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని వాపోయారు.

S

Telangana | Published On Jun 4, 2026, 3.46 pm IST

Harish Rao | పోల‌వ‌రం పూర్త‌యితే భ‌ద్రాచ‌లానికి నిత్యం జ‌ల‌గండ‌మే: హ‌రీశ్‌రావు
Advertisement
  • ప్రాజెక్ట్ డిజైన్ ప్ర‌కారం 36 ల‌క్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద రావొచ్చు
  • అదే జ‌రిగితే తెలంగాణ‌కు ఊహించ‌ని న‌ష్టం జ‌రుగుతుంది
  • బాధితుల‌కు శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించాలి
  • పీపీఏ అథారిటీకి రాసిన లేఖ‌లో హ‌రీశ్‌రావు సూచ‌న‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి నిత్యం జలగండమేనని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. కేవలం ముంపు గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్య‌క్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం భవిష్యత్తులో 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈమేర‌కు ఆయ‌న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు లేఖ రాశారు. భద్రాచలంలో పర్యటిస్తున్న పీపీఏ అధికారులకు పినపాక, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు స్వ‌యంగా అంద‌జేశారు.

ప్రభుత్వం పట్టించుకోకున్నా బీఆర్ఎస్‌ ముంపు బాధితుల పక్షాన నిలిచింది. పదే పదే ముంపుకు గురవుతున్న బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించాలి. భద్రాచలం వద్ద తక్షణమే కరకట్టల నిర్మాణం, అక్కడే పీపీఏ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా అదే 45.72 మీటర్లు కావడం గమనార్హం. దీంతో ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ఎల్లప్పుడూ ముంపు ప్రమాదమే అని ఆ లేఖ‌లో తెలియ‌జేశారు.

40 శాతం నీటిలో చిక్కుకుంది..

భద్రాచలం వద్ద గోదావరి నది లోతైన బెడ్ లెవల్ 26 మీటర్లు కాగా, పోలవరం పూర్తయితే బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిలిచి ఉంటుంది. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత వచ్చిన బ్యాక్ వాటర్‌తో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాకల్లో భారీ నష్టంతో పాటు భద్రాచలం పట్టణం 40 శాతం జలమయమైంది. లక్ష మందికి పైగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2022లో 22 లక్షల క్యూసెక్కులకే ఇంత నష్టం జరిగితే, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

2,000 కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిహార‌మివ్వాలి..

కేవలం గ్రామాలకే కాకుండా భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పుంది. దాదాపు 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ పరిశ్రమలతో పాటు 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతోందని ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముంపు వల్ల పదే పదే నష్టపోతున్న సుమారు 2,000 కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారంతో పాటు పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలి అని హరీశ్ రావు లేఖ‌లో డిమాండ్ చేశారు.

పీపీఏ డివిజ‌న్ కార్యాల‌యం ఏర్పాటు చేయాలి..

భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్ వాటర్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందువ‌ల్ల‌ వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలి. భద్రాచలం వద్ద కొత్తగా 5 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టడంతో పాటు, బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించి పరిహారం అందించాలి. తెలంగాణలో పోలవరం ముంపు సమస్యల పరిష్కారం, పునరావాస పనుల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో వెంటనే ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ ఆఫీసును ఏర్పాటు చేయాలి అని హ‌రీశ్‌రావు ఆ లేఖ‌లో కోరారు.

Advertisement
Advertisement