త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pralhad Joshi | నూత‌న విద్యాశాఖ మంత్రి ఏం చ‌దువుకున్నారంటే?

Pralhad Joshi | నీట్ (NEET) పేపర్ లీక్ వ్య‌వ‌హారం కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేలా చేసింది. రెండు నెల‌ల‌పాటు సాగిన‌ విద్యార్థుల నిరసనలతో ప్రధాన్ (Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా చేశారు. ఆయ‌న స్థానంలో విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) నియమితులయ్యారు.

G

National | Published On Jul 26, 2026, 8.40 am IST

Pralhad Joshi | నూత‌న విద్యాశాఖ మంత్రి ఏం చ‌దువుకున్నారంటే?
Advertisement

Pralhad Joshi | త్రినేత్ర.న్యూస్: నీట్ (NEET) పేపర్ లీక్ వ్య‌వ‌హారం కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేలా చేసింది. రెండు నెల‌ల‌పాటు సాగిన‌ విద్యార్థుల నిరసనలతో ప్రధాన్ (Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా చేశారు. ఆయ‌న స్థానంలో విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) నియమితులయ్యారు. ప్ర‌ధాని మోదీ క్యాబిటెన్‌లో ఇప్ప‌టికే వినియోగదారుల వ్యవహారాలు (Consumer Affairs), పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, ఆహార, ప్ర‌జా పంపిణీ శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌కు విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. గ‌తంలో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలు, బొగ్గు, గ‌నుల వంటి శాఖ‌ల‌ను విజ‌యవంతంగా న‌డిపిన జోషి.. ప్ర‌స్తుతం కోట్లాది మంది విద్యార్థుల భ‌విష్య‌త్‌తో ముడిప‌డి ఉన్న విద్యాశాఖ ప‌గ్గాలు చేప‌ట్టారు.

పేప‌ర్ లీకేజీలతో జాతీయ స్థాయి ప్ర‌వేశ‌, పోటీ ప‌రీక్ష‌ల‌పై విద్యార్థులు, ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతున్న వేళ ఆయ‌న ఈ బాధ్య‌త‌లు చేపడుతున్నారు. జాతీయ స్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేసిన‌ నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీని (NTA) ప్ర‌క్షాళ‌న చేయ‌డం, జాతీయ విద్యా విధానం (NEP) అమ‌లును ముందుకు తీసుకెళ్ల‌డం, ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌పై ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం వంటివి ప్ర‌స్తుతం ఆయ‌న‌ముందున్న ప్ర‌ధాన స‌వాళ్లు. ఈ క్ర‌మంలో దేశానికి నూత‌న విద్యామంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డుతున్న ప్రహ్లాద్ జోషి అస‌లు ఏం చ‌దువుకున్నారు, ఎక్క‌డ ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించార‌నే విష‌యాలు తెలుసుకుందాం..

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ప్రహ్లాద్ జోషి 1962, న‌వంబ‌ర్ 27న క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర‌లో జ‌న్మించారు. పాఠ‌శాల విద్య‌ను హ‌బ్బ‌ళ్లిలో పూర్తిచేశారు. ధ‌ర్వాడ్‌లోని క‌ర్ణాట‌క విశ్వ‌విద్యాల‌యానికి అనుబంధంగా ఉన్న క‌డ‌సిద్ధేశ్వ‌ర ఆర్ట్స్ కాలేజీ 1983లో బీఏ ప‌ట్టా పొందారు. 1990ల ప్రారంభంలో హుబ్లీలోని ఈద్గా మైదానంలో జాతీయ జెండా ఎగుర‌వేత‌కు సంబంధించిన వివాదం నేప‌థ్యంలో జ‌రిగిన ప్ర‌జా ఉద్య‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో బీజేపీలో అడుగుపెట్టి కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. 2004లో తొలిసారి ధార్వాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంత‌రం 2009, 2014, 2019, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యం సాధించారు. 2012 నుంచి 2016 వ‌ర‌కు క‌ర్ణాట‌క బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.

జోషి ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే..

ప్ర‌హ్ల‌ద్ జోషి ముందు ప్రస్తుతం ప్రధానంగా మూడు సవాళ్లు ఉన్నాయి.

  • విద్యార్థుల్లో విశ్వాసం నింపడం: నీట్ వివాదంతో తీవ్ర ఆందోళనలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించడం జోషికి అత్యంత ప్రాధాన్యమైన అంశం.
  • పరీక్షల నిర్వహణలో పారదర్శకత: జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల విధానంలో లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీక్‌లు లేదా అక్రమాలు జరగకుండా నిరోధించేలా కఠిన సంస్కరణలు తేవాల్సి ఉంది.
  • ఆందోళనలకు స్వస్తి పలకడం: రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న యువతతో చర్చించి, వారికి సరైన భరోసా ఇవ్వడం ఆయన ముందున్న సున్నితమైన బాధ్యత.

మంచి అడ్మినిస్ట్రేటర్‌!

విధాన రూపకల్పన, రాజకీయ సమన్వయం అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నమ్మే విశ్వసనీయమైన అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌హ్లాద్ జోషీ విద్యాశాఖకు నేతృత్వం వ‌హించ‌డం ఇదే తొలిసారి. బీజేపీలో అత్యంత అనుభ‌వ‌జ్ఞుడైన ఎంపీల‌లో ఒక‌రిగా నిలిచిన ఆయ‌న దేశ ప్ర‌జ‌ల అభిమానాన్ని గెలుచుకుంటారో.. లేదో చూడాలి!

Advertisement
Advertisement