త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Sanjay Raut | న‌మ్మ‌క ద్రోహులు వెళ్లిపోనీ.. నా మాట‌ల‌ను బీప్ చేయొద్దు : సంజ‌య్ రౌత్

MP Sanjay Raut | రెబ‌ల్ ఎంపీల‌పై ఎంపీ సంజ‌య్ రౌత్ (MP Sanjay Raut) అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అంతేకాదు త‌న వ్యాఖ్య‌ల‌ను బీప్ చేయొద్దంటూ మీడియాను కోరారు.

D

National | Published On Jun 17, 2026, 3.32 pm IST

MP Sanjay Raut | న‌మ్మ‌క ద్రోహులు వెళ్లిపోనీ.. నా మాట‌ల‌ను బీప్ చేయొద్దు : సంజ‌య్ రౌత్
Advertisement

MP Sanjay Raut | మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఉద్ధ‌వ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివ‌సేనలో పార్టీ ఫిరాయింపుల‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చ‌ర్చ వేళ ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ (MP Sanjay Raut) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేవ‌లం ముగ్గురు ఎంపీలు (Shiv Sena UBT MPs) మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రెబ‌ల్ ఎంపీల‌పై రౌత్ అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అంతేకాదు త‌న వ్యాఖ్య‌ల‌ను బీప్ చేయొద్దంటూ మీడియాను కోరారు.

"న‌మ్మ‌క ద్రోహులు వెళ్లిపోనీ. వెళ్లాల‌నుకునేవాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవ‌చ్చు. డ‌బ్బు ఆశ‌జూపి పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డేలా కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. ఎంపీల‌కు న‌గ‌దు ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు మా వ‌ద్ద స‌మాచారం ఉంది. ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు ఆఫ‌ర్ చేస్తున్నారు. కొంద‌రు ఎంపీలు రూ.15 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మహారాష్ట్ర‌లోని వివిధ ప్రాంతాల నుంచి చార్ట‌ర్డ్ విమానాల్లో ప్ర‌యాణించారు" అని సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అలాంటి వారిపై పూల రేకులు కురిపించాలా..?

ఇక అస‌భ్య‌క‌ర భాష‌పై విలేక‌రులు రౌత్‌ను ప్ర‌శ్నించారు. ఇలా బూతులు మాట్లాడ‌టంపై త‌న‌కు ఎలాంటి ప‌శ్చాత్తాపం లేద‌ని ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. "మరాఠీ భాషలో మేము ఇలాంటి పదాలనే ఉపయోగిస్తాము. ఇందులో తప్పేముంది..? ఏ సమయంలో ఎలాంటి భాష ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. ప్రజలకు వారు అర్థం చేసుకునే భాషలోనే సమాధానం చెప్పాలి. రూ. 15 కోట్లు తీసుకుని పార్టీని వీడే వ్యక్తి గురించి మీరేమంటారు..? అలాంటి వ్యక్తిపై పూల రేకులు కురిపిస్తారా..? " అంటూ విలేక‌రుల‌ను రౌత్ ప్ర‌శ్నించారు. ఇక ఈ మీడియా స‌మావేశానికి తొమ్మిది మంది ఎంపీల్లో కేవ‌లం ముగ్గురు అర్వింద్ సావంత్‌, అనిల్ దేశాయ్‌, రాజ‌భు వాజే మాత్ర‌మే హాజ‌రయ్యారు.

ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు

అంత‌కు ముందు పార్టీ ఫిరాయింపుల‌పై రౌత్ ఎక్స్ వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ వ‌ర్గానికి చెందిన ఎంపీల‌కు ఒక్కొక్క‌రికి రూ.50 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్లు రౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. "బీజేపీ డబ్బు ఎరచూపి ఎంపీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర ఎంపీలను కొనడానికి.. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారు" అంటూ రౌత్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అంతేకాదు, ఆ ఎంపీలు క‌నీసం రూ.50,000 కూడా విలువ చేయ‌రంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రౌత్ పోస్ట్ రాజ‌కీయ దుమారానికి దారి తీస్తోంది.

షిండే వ‌ర్గంలోకి ఆరుగురు ఎంపీలు..?

శివసేన (UBT)కి చెందిన ఆరుగురు ఎంపీలు మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. 'ఆపరేషన్ టైగర్' పేరుతో సాగుతున్న ఈ పరిణామాల్లో భాగంగా.. శివసేన (UBT) ఎంపీలు బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ అనంత‌రం.. ఠాక్రే వ‌ర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌ను స‌భ‌లో ప్ర‌త్యేక గ్రూపుగా గుర్తించాల‌ని కోరే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఆ ఎంపీలు వీళ్లేనా..?

ప్ర‌స్తుతం ఠాక్రే వ‌ర్గంలో మొత్తం తొమ్మిది మంది లోక్‌స‌భ ఎంపీలు ఉన్న విష‌యం తెలిసిందే. వారిలో ఆరుగురు షిండే వ‌ర్గంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే వారిలో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేష్ పాటిల్ అస్తికార్, ఓంరాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్‌చౌరే, సంజయ్ జాదవ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

2022లో కూడా..

కాగా, 2022లో శివసేనను చీల్చి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏకనాథ్ షిండే బీజేపీతో చేతులు క‌లిపి సీఎం కుర్చీ ఎక్కారు. ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి అధిక మెజారిటీ రావ‌డంతో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సీఎం అయ్యారు. ప్ర‌స్తుతం షిండే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు అసెంబ్లీ వేదిక‌గా పార్టీని చీల్చిన షిండే.. ఇప్పుడు లోక్‌సభ వేదికగా రెండోసారి అలాంటి వ్యూహాత్మక దెబ్బ కొట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read..

ట్రంప్‌-మోదీ భేటీ వేళ ఇండో పేరు తొల‌గించి.. భార‌త్‌కు షాకిచ్చిన అమెరికా

డిప్యూటీ సీఎంగా రాఘ‌వ లారెన్స్‌.. సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న‌ ఫొటో

వారి భ‌ద్ర‌త మ‌నంద‌రి బాధ్య‌త‌.. నావికుల మృతిపై ట్రంప్ స‌మ‌క్షంలో ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement