త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర‌.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ ర‌మేష్ మండిపాటు

Jairam Ramesh | గ‌త సెష‌న్‌లో లోక్‌స‌భ‌లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెర‌వెనుక కుట్ర‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు.

D

National | Published On Sep 11, 2026, 1.18 pm IST

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర‌.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ ర‌మేష్ మండిపాటు
Advertisement
  • పార్ల‌మెంటును ప్రోరోగ్ చేయ‌డంలో మోదీ స‌ర్కార్ స‌రికొత్త రికార్డు
  • ఆ వివ‌రాల‌ను ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు..?
  • మూడు పార్టీల్లో షా చిచ్చుపెట్టారు

Jairam Ramesh | త్రినేత్ర‌.న్యూస్ : పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు నిరవధిక వాయిదా తర్వాత దానిని అధికారికంగా ముగించడానికి జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. దీని వెనుక‌ ఏదో కుట్ర దాగి ఉంద‌ని ఆరోపించింది. గ‌త సెష‌న్‌లో లోక్‌స‌భ‌లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెర‌వెనుక కుట్ర‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

సొంత రికార్డే బ‌ద్ద‌లు

పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన తర్వాత కూడా ప్రోరోగ్‌ చేయకుండా 29 రోజుల పాటు ఆలస్యం చేసి మోదీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అంతకుముందు 2015 వర్షాకాల సమావేశాల సమయంలో 28 రోజుల జాప్యం జరిగిందని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. తాజాగా త‌న సొంత రికార్డునే మోదీ స‌ర్కార్ అధిగ‌మించింద‌ని ఎద్దేవా చేశారు. "పార్లమెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డి 29 రోజుల‌కు చేరింది. అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారికంగా ముగించ‌లేదు (ప్రోరోగ్ కాలేదని).

2015లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అప్పుడు స‌మావేశాల‌ను ప్రోరోగ్ చేయ‌డానికి 28 రోజుల జాప్యం జరిగింది. ఇప్పుడు మోదీ స‌ర్కార్ త‌న సొంత‌ రికార్డును అధిగ‌మించి స‌రికొత్త రికార్డు సృష్టించింది. సాధారణంగా స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన త‌ర్వాత మూడు లేదా నాలుగు రోజుల్లో ముగింపుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంది. అయితే, ఈ స‌మావేశాల‌ను ఇప్ప‌ట్లో ముగించే సూచ‌న‌లేవ‌వీ క‌నిపించ‌డంలేదు" అని జైరామ్ ర‌మేష్ పేర్కొన్నారు.

తెరవెనుక షా కుట్ర‌లు

ఏప్రిల్ 17న లోక్‌స‌భ‌లో త‌న ప్ర‌భుత్వానికి ఎదురైన ఘోర ప‌రాజ‌యం కేంద్ర హోం మంత్రిని తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని జైరామ్ ర‌మేష్ వ్యాఖ్యానించారు. అందుకే డీలిమిటేషన్ బిల్లును లోక్‌స‌భ‌లో ఎలాగైనా ఆమోదింప‌జేసేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు షా తెర వెనుక కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. ఏప్రిల్ 17న ఈ బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేసిన మూడు పార్టీల్లో ఇప్ప‌టికే ఆయ‌న చిచ్చు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీల్లోని స‌భ్యుల‌ను కూడా భ‌య‌పెట్టో, బెదిరించో, ప్ర‌లోభాల‌కు గురిచేసి ఈ బిల్లుకు అవ‌స‌ర‌మైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించేందుకు వ్యూహ‌ర‌చ‌ణ చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

అంత ర‌హ‌స్యం ఎందుకు..?

అదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా ఇంత‌టి ప్రాముఖ్య‌త క‌లిగిన ప్ర‌తిపాదిత‌ డీలిమిటేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు, ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు మోదీ ప్ర‌భుత్వం ఎందుకు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. 2026 మార్చి మధ్యకాలం నుంచి ప్రతిపక్ష పార్టీలు నిరంతరం అఖిలపక్ష సమావేశం కోసం డిమాండ్ చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. భారత గణతంత్ర పునాదులకు అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌కుండా ఎందుకు ర‌హ‌స్యంగా ఉంచుతోంద‌ని నిల‌దీశారు.

ఒక్క బిల్లుపైనే చ‌ర్చ‌..

కాగా, పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జులై 20న ప్రారంభ‌మై ఆగ‌స్టు 13న ముగిశాయి. రామమందిర విరాళాల చోరీ, నీట్ పేప‌ర్ లీక్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడ‌టంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయా అంశాల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విప‌క్షాల నిర‌స‌ల‌న‌తో 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలూ లేకుండా ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి.

ప్ర‌భుత్వం ఏమంటోంది..?

ఈ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన‌ప్ప‌టికీ.. అధికారికంగా ముగియలేదని (ప్రోరోగ్ కాలేదని) కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) తెలిపిన విష‌యం తెలిసిందే. ఉన్న సెష‌న్‌ను అధికారికంగా ముగించ‌కుండానే స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌ర్చొచ్చ‌ని చెప్పారు. 1952 నుంచి పార్లమెంటును ప్రోరోగ్ చేయ‌కుండానే తిరిగి స‌మావేశ‌ప‌రిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని గుర్తు చేశారు. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తితో పార్ల‌మెంటు స‌మావేశాల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించొచ్చ‌ని వివ‌రించారు. రిజుజు వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌త్యేక సమావేశాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని ప్ర‌భుత్వం డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లుల కోసం స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పార్ల‌మెంటు స‌మావేశాల‌ను ప్రోరోగ్ చేయ‌డంలో జ‌రుగుతున్న జాప్యంపై జైరామ్ ర‌మేష్ పైవిధంగా స్పందించారు.

గ‌త సెష‌న్‌లో వీగిపోయిన బిల్లు..

కాగా, చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మహిళా రిజర్వేషన్ల అమలుకు ముడిపడి ఉన్న డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ లేక వీగిపోయింది. నాడు ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది ఎంపీల్లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్య‌తిరేకంగా 230 మంది ఓటు వేశారు. అయితే ఈ బిల్లు గ‌ట్టెక్కాలంటే 352 ఓట్లు అవ‌స‌రం. దీంతో ఈ బిల్లును ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. స‌ర‌వ‌ణ‌ల త‌ర్వాత మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది.

Also Read..

గ్లోబ‌ల్ సౌత్‌కు ఇది అత్యంత కీల‌క వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

వంద డాలర్లు దాటిన క్రూడ్‌,,! వారంలోనే 12 శాతం పైగా పెరిగిన బ్రెంట్‌

కేటీఆర్ ఎన్ని కుట్ర‌లు చేసినా పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఆగ‌దు

Advertisement
Advertisement