Jupally Krishna Rao | అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరం.. రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు చేశాం
Jupally Krishna Rao | అటవీ రక్షణ విధుల్లో ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
- ఎక్సైజ్ శాఖకూ ఆయుధాలిచ్చే అంశం పరిశీలనలో ఉంది
- 1,516 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది
- అటవీ అమరవీరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
- జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: అటవీ రక్షణ విధుల్లో ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అటవీ ఆక్రమణలు, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, ఇతర వ్యవస్థీకృత అటవీ నేరాలను అరికట్టడంతో పాటు సిబ్బంది వ్యక్తిగత భద్రతకు ఆయుధాలు అవసరమన్నారు. ఇందుకోసం రూ.4.095 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఎక్సైజ్ శాఖకూ ఆయుధాలిచ్చే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు. శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి జూపల్లి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు కమ్యూనికేషన్, వాహనాలు, సాంకేతిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బానోత్ నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్కు..
వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మరణించిన చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును అందించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అటవీ నేరాలు, కలప అక్రమ రవాణా, అటవీ ఆక్రమణలు, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అటవీశాఖను బలోపేతం చేయడానికి 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్‌బీవోలు), 15 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్‌ఆర్‌వోలు), 18 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్‌లు), ఇతర కేటగిరీల్లో కలిపి మొత్తం 1,516 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
2014 నుంచి జూలై 2026 వరకు 1,06,685 ఓఆర్ (Offence Report) కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో రూ.55.99 కోట్ల విలువైన కలపకు సంబంధించిన కేసులు ఉన్నాయని, రూ.160.75 కోట్ల కంపౌండింగ్ ఫీజు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి 19,482 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అదనంగా 31,523 యూడీఓఆర్ (Undetected Forest Offence Report) కేసులు నమోదు చేసి, రూ.70.72 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కలప డిపోలకు తరలించినట్లు తెలిపారు. 11,824 అటవీ ఆక్రమణ కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.
అటవీ సంరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి అటవీ అధికారి, ప్రతి ఫ్రంట్‌లైన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అటవీ సంపదను మరింత బలోపేతం చేయాలని, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించాలని, ప్రజలకు-ప్రకృతికి మధ్య సమతుల్యత సాధిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ వినయకుమార్, పీసీసీఎఫ్ (డెవలప్‌మెంట్) రత్నాకర్ జోహరి, టీజీఎఫ్డీసీ- వీసీ అండ్ ఎండీ సునీతా భగవత్, ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్
- ●KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
- ●Shashi Tharoor | గ్లోబల్ సౌత్‌కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
- ●Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి
- ●Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
- ●PM Modi | మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్

KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్

Shashi Tharoor | గ్లోబల్ సౌత్‌కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్‌పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి






