త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్‌!

Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మ‌రోసారి తీవ్రరూపం దాల్చాయి. ఫ‌లితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య ఘర్షణల‌తో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. కీలక ఇంధన సరఫరా మార్గాలపై ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

P

Business | Published On Sep 11, 2026, 1.16 pm IST

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్‌!
Advertisement
  • వారంలోనే 12 శాతం పైగా పెరిగిన బ్రెంట్‌
  • నాలుగు నెలల గరిష్టానికి ధ‌ర‌లు
  • దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు పెనుభారం
  • ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌పై ఒత్తిడి వృద్ధి రేపుపై ప్రభావం
  • మరో 10 డాలర్లు పెరిగితే జీడీపీ వృద్ధి 20–30 బేసిస్‌ పాయింట్లు త‌గ్గొచ్చ‌ని అంచ‌నా

Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మ‌రోసారి తీవ్రరూపం దాల్చాయి. ఫ‌లితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా–ఇరాన్‌ మధ్య ఘర్షణల‌తో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. కీలక ఇంధన సరఫరా మార్గాలపై ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌త్ఫ‌లితంగా క్రూడ్‌ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర నాలుగు నెలల గరిష్టానికి చేరి 108.77 డాలర్లను తాకింది. ఆ తర్వాత కాస్త త‌గ్గి 107.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారం రోజుల్లోనే బ్రెంట్‌ ధర 12 శాతానికిపైగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సరఫరాపైనే గొలుసుపైనే మార్కెట్‌ దృష్టి

పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందా? కీలకమైన ఇంధన రవాణా మార్గాలకు అంతరాయం కలుగుతుందా? అన్న విష‌యంపై మార్కెట్ ఆందోళ‌న చెందుతోంది. గతంలో మే నెలలోనూ క్రూడ్‌ ధరలు ఇదే త‌ర‌హాలో పెరిగాయి. ఆ తర్వాత శాంతి చర్చలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త త‌గ్గ‌డంతో ధ‌ర‌లు 80 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో ధరలు ఒక్కసారిగా పైకి ఎగ‌బాకాయి.

భారత్‌కు భారంగా..

చమురు ధరలు పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సిన ప‌రిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగినకొద్దీ చమురు దిగుమతుల బిల్లు పెరుగుతుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయాలు సైతం పెరిగే అవ‌కాశం ఉంటుంది. దాని ప్రభావం ఇతర వస్తువులు, సేవల ఖర్చులపైనా పడే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడంతో పాటు కరెంట్‌ అకౌంట్‌పై కూడా భారం పడే ప్రమాదం పొంచి ఉన్న‌ది.

వృద్ధికీ సవాల్‌

క్రూడ్‌ ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న త్రైమాసికాల్లో భారత ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరగొచ్చని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (NCAER) మాజీ సీనియర్‌ ఆర్థికవేత్త సునీల్‌ సిన్హా అంచనా వేశారు. అధిక చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాలు, కరెంట్‌ అకౌంట్‌ సంబంధిత రిస్స్‌లు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇటీవల నమోదైన భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే భారత జీడీపీ వృద్ధి రేటు సుమారు 20–30 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని సిన్హా అంచనా వేశారు.

ఎంతకాలం వంద డాలర్లపైనే?

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. క్రూడ్‌ ధరలు 100 డాలర్లకు పైగా ఎంతకాలం కొనసాగుతాయి? పశ్చిమాసియాలో ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయి? అన్నదానిపైనే త‌ర్వాతి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే వారం రోజుల్లో బ్రెంట్‌ ధర 12 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో.. ఘర్షణలు సుదీర్ఘంగా కొన‌సాగితే ఇంధన సరఫరాపై అనిశ్చితి మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్‌లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, దిగుమతి వ్యయాలపై చమురు ధరల ప్రభావం మరింత తీవ్రం కావచ్చని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement