త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sheikh Hasina | హ‌సీనా స్వ‌దేశానికి వెళ్లేందుకు భార‌త్ ఓకే.. బంగ్లా ప్ర‌భుత్వానికి కొన్ని ష‌ర‌తులు

Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భార‌త్ (India) సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. అయితే, హ‌సీనా భ‌ద్ర‌త విష‌యంలో హామీ ఇవ్వాల‌ని కోరుతూ బంగ్లా ప్ర‌భుత్వానికి కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు స‌మాచారం.

D

National | Published On Nov 14, 2026, 12.32 pm IST

Sheikh Hasina | హ‌సీనా స్వ‌దేశానికి వెళ్లేందుకు భార‌త్ ఓకే.. బంగ్లా ప్ర‌భుత్వానికి కొన్ని ష‌ర‌తులు
Advertisement

Sheikh Hasina | త్రినేత్ర న్యూస్ : దాదాపు రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధ‌మవుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల ఢాకా వెళ్లేందుకు స‌న్నాహాలు మొదలు పెట్టారు. ఆమె త‌న స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భార‌త్ (India) కూడా సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. అయితే, హ‌సీనా భ‌ద్ర‌త విష‌యంలో హామీ ఇవ్వాల‌ని కోరుతూ బంగ్లా ప్ర‌భుత్వానికి కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు స‌మాచారం.

బీబీసీ బంగ్లా (BBC Bangla) నివేదిక ప్ర‌కారం.. హ‌సీనా సుర‌క్షితంగా స్వ‌దేశానికి తిరిగివెళ్లేందుకు న్యూఢిల్లీ కొంత‌కాలంగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె భద్రతకు, న్యాయపరమైన హక్కులకు హామీ లభించిన తర్వాతే ఇందుకు అంగీకరించాలని భావిస్తున్నట్లు స‌ద‌రు నివేదిక‌ వెల్లడించింది. 2024లో సైనిక విమానంలో భారత్‌కు వచ్చిన హసీనాను తిరిగి తీసుకెళ్లే బాధ్యతను కూడా బంగ్లా సైన్యమే తీసుకోవాలని స్ప‌ష్టం చేసిన‌ట్లు పేర్కొంది. హ‌సీనాను తీసుకెళ్లేందుకు సైనిక విమానాన్ని పంప‌డం (Bangladeshi military aircraft), లేదా భార‌త్‌-బంగ్లా స‌రిహ‌ద్దుల్లో ఆ దేశ సైన్య‌మే ఆమెను ఆహ్వానించాల‌ని ష‌ర‌తు పెట్టిన‌ట్లు తెలిసింది.

అంతేకాదు, హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించాలని, 2024 జులైలో జరిగిన హింసాకాండకు సంబంధించిన ఆరోపణలపై కొత్తగా, నిష్పాక్షికంగా విచారణ జరగాలని న్యూఢిల్లీ డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది. అయితే, ఈ నివేదిక‌పై బంగ్లాదేశ్‌లోని రెహ‌మాన్‌ ప్ర‌భుత్వం (Tarique Rahman-led government) ధ్రువీక‌రించ‌లేదు. అదేవిధంగా ఈ వ్య‌వ‌హారంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సైతం స్పందించేందుకు నిరాకరించారు. "ఈ విషయంపై నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు" అని జైస్వాల్ బదులిచ్చారు.

ఆమెకు అన్నిదారులూ మూసుకుపోయాయి

ఈ నివేదిక వెలువ‌డిన త‌ర్వాత బంగ్లాదేశ్ ప్రధాని సహాయ పత్రికా కార్యదర్శి కె.ఎం. నజ్ముల్ హక్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేస్తూ షేక్ హసీనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. యూకే, యూఏఈ, సౌదీ అరేబియా, ఫిన్లాండ్‌, అమెరికా, బెలార‌స్‌, ఖ‌తార్‌, ఆఫ్రికా.. ఏ ఒక్క దేశం కూడా హ‌సీనాకు ఆశ్ర‌యం క‌ల్పించేందుకు సిద్ధంగా లేవ‌ని వ్యాఖ్యానించారు. అన్ని దారులు మూసుకుపోవ‌డంతో.. చివ‌రి ప్ర‌య‌త్నంగా ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆరోపించారు.

కొత్త పాస్‌పోర్టు కోసం ద‌ర‌ఖాస్తు

తాను స్వ‌దేశానికి తిరిగి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది జులైలో హ‌సీనా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాత పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును (NID) రద్దు చేయడంతో.. ఆమె కొత్త ట్రావెల్ డాక్యుమెంట్లు, ఐడీ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ మేర‌కు త‌న లాయ‌ర్ల ద్వారా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ఆశ్రయించారు. హసీనా బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త పత్రాలు జారీ చేయాలని వారు ఆ లేఖలో అభ్యర్థించారు. హ‌సీనా బంగ్లాదేశ్ పౌరురాల‌ని, అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ ద‌ర‌ఖాస్తును పరిశీలించాల‌ని కోరారు.

మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెకు పాస్‌పోర్టు అవసరం లేదని, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 'నేరస్థుల అప్పగింత ఒప్పందం' (Extradition Treaty) ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తోంది. హ‌సీనాకు పాస్‌పోర్ట్ జారీ చేయ‌డం కంటే త‌మ‌కు అప్ప‌గించాల‌ని బంగ్లాదేశ్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి హుమాయూన్ డిమాండ్ చేశారు. "మేము హసీనాను అప్పగించాలని కోరుతున్నాము. ఆమె ఒక ఉగ్రవాది" అని వ్యాఖ్యానించారు.

లొంగిపోయేందుకు సిద్ధం

రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన వివాదం కారణంగా.. విద్యార్థుల నిరసనలకు జడిసి 2024 ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బంగ్లానుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. తాను స్వ‌దేశానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు హ‌సీనా ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో తాను తిరిగి స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. అక్క‌డ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

"నేను వెళ్ల‌గానే వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు.. హతమార్చవచ్చు కూడా. అయినా స‌రే నేను స్వ‌దేశానికి వెళ్లి తీరుతా. నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే.. అది నా తల్లిదండ్రులను ఖ‌న‌నం చేసిన చోట‌, వారి ర‌క్తం చిందిన నా సొంత గ‌డ్డ‌పైనే చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నాను" అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ డిసెంబ‌ర్‌లో త‌న పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, తాను స్వ‌దేశానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. అక్క‌డ న్యాయ‌స్థానం ముందు లొంగిపోవాల‌ని అనుకుంటున్న‌ట్లు హ‌సీనా వెల్ల‌డించారు.

Also Read..

అజిత్ దాదా మ‌ర‌ణించిన రోజే విలీన చ‌ర్చ‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది : సుప్రియా సూలే

ఎన్విడియా షేర్లు భారీగా పతనం.. వారంలోనే రూ.47 లక్షల కోట్లు ఆవిరి..

ఊరేగింపులో బీభ‌త్సం సృష్టించిన ఏనుగు.. ప‌రుగులు పెట్టిన ప్ర‌జ‌లు.. వీడియో

Advertisement
Advertisement