Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
Sheikh Hasina | దాదాపు రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆమె కొత్త పాస్‌పోర్ట్ (new passport), ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Sheikh Hasina | త్రినేత్ర న్యూస్ : దాదాపు రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తొలి అడుగు వేశారు. తాను స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది జులైలో హసీనా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే నెలలో బంగ్లాదేశ్ వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాత పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును (NID) రద్దు చేయడంతో.. ఆమె కొత్త ట్రావెల్ డాక్యుమెంట్లు, ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు తన లాయర్ల ద్వారా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ఆశ్రయించారు. హసీనా బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త పత్రాలు జారీ చేయాలని వారు ఆ లేఖలో అభ్యర్థించారు. హసీనా బంగ్లాదేశ్ పౌరురాలని, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల ప్రకారం ఈ దరఖాస్తును పరిశీలించాలని కోరారు.
మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెకు పాస్‌పోర్టు అవసరం లేదని, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 'నేరస్థుల అప్పగింత ఒప్పందం' (Extradition Treaty) ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తోంది. హసీనాకు పాస్‌పోర్ట్ జారీ చేయడం కంటే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హుమాయూన్ డిమాండ్ చేశారు. "మేము హసీనాను అప్పగించాలని కోరుతున్నాము. ఆమె ఒక ఉగ్రవాది" అని వ్యాఖ్యానించారు.
లొంగిపోయేందుకు సిద్ధం
కాగా, రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన వివాదం కారణంగా.. విద్యార్థుల నిరసనలకు జడిసి 2024 ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బంగ్లానుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. అయితే, తాను స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు హసీనా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లో తాను తిరిగి స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
"నేను వెళ్లగానే వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు.. హతమార్చవచ్చు కూడా. అయినా సరే నేను స్వదేశానికి వెళ్లి తీరుతా. నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే.. అది నా తల్లిదండ్రులను ఖననం చేసిన చోట, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నాను" అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ డిసెంబర్‌లో తన పార్టీకి చెందిన సీనియర్ నేతలు, తాను స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అక్కడ న్యాయస్థానం ముందు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు హసీనా వెల్లడించారు.
Also Read..
షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు
టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
- ●Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు
- ●ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా
- ●Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ●Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?
- ●KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్
- ●DK Shivakumar | షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు

Sanath nagar Police | డబ్బు కోసం పోలీసుల డిమాండ్.. కేసు నమోదు

ACB Rides | లంచం ఇయ్యకుంటే చార్జిషీట్ లేటైతది.. పైసలు పట్టుకురా

Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?






