త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heatwave | పెరుగుతున్న ఎండ తీవ్ర‌త‌.. ఈ జాగ్ర‌త్త‌లు మ‌స్ట్‌

Heatwave | ఎండ‌లు (Heatwave) మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌తోపాటూ దేశ‌వ్యాప్తంగా ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. దీంతో ఉక్క‌పోత‌కు ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.

D

National | Published On Apr 23, 2026, 12.33 pm IST

Heatwave | పెరుగుతున్న ఎండ తీవ్ర‌త‌.. ఈ జాగ్ర‌త్త‌లు మ‌స్ట్‌
Advertisement

Heatwave | ఎండ‌లు (Heatwave) మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌తోపాటూ దేశ‌వ్యాప్తంగా ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. దీంతో ఉక్క‌పోత‌కు ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇక దేశంలో ఈ ఏడాది సాధార‌ణ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ చాలా అవ‌స‌రం అంటున్నారు. అందుకే ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

వ్యక్తిగత ఆరోగ్యం

ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను స్థిరంగా ఉంచుకోవ‌డం, డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ముఖ్యం. శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా త‌గిన‌న్ని నీళ్లు తాగాలి. దాహం లేక‌పోయినా నీరు తాగుతూ ఉండాలి. కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం, మ‌జ్జిగ‌, ఓఆర్ఎస్ ద్రావ‌ణాల‌ను తీసుకోవాలి. పుచ్చ‌కాయ‌, దోస‌కాయ వంటి నీరు ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను తీసుకుంటే మంచిది. అధిక ప్రోటీన్‌, మ‌ద్యం, కాఫీ, టీ వంటివి త‌గ్గించుకోవాలి.

కాట‌న్ దుస్తులు మంచిది..

ఎండ‌కు తేలిక‌పాటి, లైట్ క‌ల‌ర్ కాట‌న్ దుస్తులు ధ‌రిస్తే మంచిది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు గొడుగు లేదా టోపీ వాడాలి. లేదంటే స్కార్ఫ్‌తో త‌ల‌ను క‌వ‌ర్ వేసుకోవాలి. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల మ‌ధ్య బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మే మంచిది. ఏవైనా ప‌నులు ఉంటే ఉద‌యం, సాయంత్రం చూసుకోవాలి.

ఇంటిని కూల్‌గా ఉంచుకోండి..

ఇక ఇంట్లో కూడా చ‌ల్ల‌గా ఉండేలా (keep homes cool) త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇంటిపైక‌ప్పుల‌కు కూల్ రూఫ్ (తెలుపు రంగు) వేయ‌డం ద్వారా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కూ ఉష్ణోగ్ర‌త‌ను త‌గ్గించుకోవ‌చ్చు. కిటికీల‌కు క‌ర్టెన్లు, స‌న్‌షేడ్లు వాడాలి. రాత్రిపూట కిటికీల‌ను తెరిచి ఉంచుకుంటే గాలి వ‌స్తుంది. ఇంట్లో ఓఆర్ఎస్‌, థర్మామీటర్, నీటి బాటిళ్లు, తడి గుడ్డలు వంటి ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి

హీట్ సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్స

తీవ్ర‌మైన ఎండ‌ల‌కు వ‌డ‌దెబ్బబారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌. అందుకే ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. అధిక చెమ‌ట‌, త‌ల‌తిర‌గ‌డం, వాంతులు, బ‌ల‌హీన‌త వంటి ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మవ్వాలి. చ‌ల్ల‌ని ప్ర‌దేశానికి వెళ్లాలి. నీళ్లు బాగా తాగాలి. శ‌రీర ఉష్ణోగ్ర‌త 103 డిగ్రీలు ఉంటే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి.

ఐఎండీ సూచ‌న‌ల‌ను పాటించాలి

భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) జారీ చేసే సూచ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. వృద్ధులు, చిన్న‌పిల్ల‌లు, గ‌ర్భిణీలు, పెంపుడు జంతువుల‌పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ వ‌హించాలి. హీట్‌వేవ్ స‌మ‌యంలో పిల్ల‌లు, పెంపుడు జంతువుల‌ను పార్క్ చేసిన వాహ‌నాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలివేయ‌కండి. ఇది ప్రాణాంత‌క ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది. ఈ ఎండాకాలంలో ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read..

తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు.. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

స‌డెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ - ఫ‌స్ట్ నైట్‌లో హీరో ఫెయిలైతే...

ఆర్టీసీని ప్రైవేటీక‌రించేందుకు ప్రభుత్వం కుట్ర: తలసాని శ్రీనివాస్ యాదవ్

Advertisement
Advertisement