త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మ‌గా మారారు.. స‌ర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖ‌ర్గే

Mallikarjun Kharge | ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేతిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలు బొమ్మ‌గా మారార‌ని వ్యాఖ్యానించారు.

D

National | Published On Sep 29, 2026, 1.47 pm IST

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మ‌గా మారారు.. స‌ర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖ‌ర్గే
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల సంఘం వ్యవహారశైలి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్​) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాల‌ని హ‌స్తం పార్టీ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. ఎన్నికల సంఘం పనితీరు, స‌ర్‌ అమలు, ఓటర్ల జాబితాలో పేర్ల తొల‌గింపు వంటి కీల‌క అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

Image

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేతిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలు బొమ్మ‌గా మారార‌ని వ్యాఖ్యానించారు. సీఈసీకి ప‌ద‌విలో కొన‌సాగే అర్హ‌త లేద‌న్నారు. ఆయ‌న్ని వెంట‌నే ప‌ద‌వి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈసీలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయంటూ ఓ జాతీయ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఖ‌ర్గే ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు.

ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయాలి

ప్రజాస్వామ్య పునాదులను, రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర వ్యవస్థలను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై  తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పదేళ్ల క్రితం నోట్ల రద్దు (Demonetisation)తో ఇప్పుడు ఓట్ల రద్దుతో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని మండిపడ్డారు.  మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా సీఈసీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. స్వయంగా ఆయన సహచరులే సీఈసీని నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌నకు ప‌ద‌విలో కొన‌సాగే అర్హ‌త లేదన్నారు. ప‌ద‌వి నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఖార్గే డిమాండ్ చేశారు.

వీధుల్లోకి వ‌చ్చి పోరాడుతాం

ఓటు అనేది రాజ్యాంగ హ‌క్కు అని ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో అత్యంత ప్రాథ‌మిక‌మైన ఓటు హ‌క్కును ఏక‌ప‌క్షంగా తొల‌గించ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ఫామ్-6 నిబంధనల్లో మార్పులు యువ ఓటర్లపై ప్రభావం చూపుతాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల సంఘంపై కాంగ్రెస్ పోరాటం ఏ ఒక్క పార్టీకి, సంస్థ‌కు లేదా వ్య‌క్తికి వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఓట‌ర్ల హ‌క్కులు, రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ కోస‌మేన‌ని తెలిపారు. ఎన్నికల సంఘం (Election Commission).. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటికీ సమానమైన నమ్మకాన్ని కలిగించేలా, పూర్తిగా స్వతంత్రంగా, విశ్వసనీయంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంద‌ని ఖ‌ర్గే చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ వివాదంపై వీధుల్లోకి వ‌చ్చి పోరాడ‌టంతోపాటూ పార్లమెంట్‌లోనూ నిల‌దీస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం ఇండియా కూటమి పక్షాలతో కలిసి సంయుక్త వ్యూహాన్ని రచిస్తామని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ ఖ‌ర్గే ఐదు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

ఐదు ప్రధాన డిమాండ్లు ఇవే..

  • ఓటర్ల జాబితాలో జరిగిన అన్ని ప్రధాన మార్పులకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయాలి.
  • ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన ప్రతి ఓటరుకు ఆ సమాచారాన్ని అందించ‌డంతోపాటూ, అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
  • అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా, దానికి సంబంధించిన అవ‌స‌ర‌మైన డేటాను ఈజీ ఫార్మాట్‌లో స‌కాలంలో అందించాలి.
  • ఓటర్ల జాబితాలలో తీవ్రమైన అక్రమాలు వెలుగుచూసిన చోట నిర్దిష్ట కాలపరిమితిలో స్వతంత్ర విచారణ జరిపించాలి.
  • ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలు, డేటా విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలి. సమాచారాన్ని దాచారనే ఆరోపణలకు తావుండకూడదు.

Image

Image

Also Read..

9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు.. NTF స‌ర్వేలో షాకింగ్ విష‌యాలు

సీఈసీ నిర్ణయాలపై విచార‌ణ‌కు సుప్రీం అంగీకారం

ఏమున్నా నేన్‌ ఆధారాల‌తోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు క‌విత వార్నింగ్‌

Advertisement
Advertisement