త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాంగ్రెస్ స‌ర్కార్‌ నిర్లక్ష్యం.. కేంద్ర ప్ర‌భుత్వ‌ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హ‌రీశ్ రావు

Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.

G

Telangana | Published On Nov 14, 2026, 5.50 pm IST

Harish Rao | కాంగ్రెస్ స‌ర్కార్‌ నిర్లక్ష్యం.. కేంద్ర ప్ర‌భుత్వ‌ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధిస్తామని ప్రధాని (PM Modi) వద్ద స్పష్టమైన హామీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ నీటిపారుద‌ల‌ ప్రాజెక్టుల‌పై ప్ర‌ధాని మోదీతో చ‌ర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్తున్న నేప‌థ్యంలో హ‌రీశ్ రావు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ అసమర్థత..

47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. ఇప్పటికే ఆమోద ప్రక్రియలో ఉన్న డీపీఆర్‌కు కొత్త మార్గదర్శకాలను వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమ‌ని ప్ర‌శ్నించారు. హైడ్రాలజీ సహా కీలక విభాగాల పరిశీలన పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను వెనక్కి పంపడం తెలంగాణ (Telangana) ప్రయోజనాలపై గొడ్డలిపెట్టని చెప్పారు. సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు కేవలం టీఏసీ అనుమతి మాత్రమే రావాల్సి ఉంద‌ని చెప్పారు. అలాంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమ‌ర్శించారు. కేంద్రం వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపించే చిత్తశుద్ధి రేవంత్ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గత ఆరు నెలలుగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రతి వేదికపై మాట్లాడుతున్నార‌ని చెప్పారు. శుక్ర‌వారం విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులోనూ గోదావరి-కావేరి అనుసంధానాన్ని పోలవరం నుంచి బనకచర్ల వరకు చేపడతామని ప్రకటించారు.

ఆ తర్వాతే నదుల అనుసంధానం

అసలు గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు తెలంగాణలోని ఇంచంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా తమిళనాడులోని గ్రాండ్ అనికట్ వరకు ప్రతిపాదించార‌న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా స్పష్టమైన వైఖరి తీసుకుంద‌ని చెప్పారు. 968 టీఎంసీల గోదావరి జలాలపై తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ ముందుగా కేంద్రం అనుమతులు ఇవ్వాల‌ని, ఆ తర్వాతే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేసింద‌న్నారు.

గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం అంటే 75 టీఎంసీలు కేటాయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టింద‌న్నారు. ఇచ్చంప‌ల్లి నుంచే ఈ ప్రాజెక్టు చేపట్టాలని, తెలంగాణ భూభాగం మీదుగా అలైన్‌మెంట్ ఉండాలని స్పష్టం చేసింద‌ని తెలిపారు. మన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర టాస్క్‌ఫోర్స్ సైతం హామీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఎన్‌డ‌బ్ల్యూడీఏ (NWDA) ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ అనికట్ వరకు డీపీఆర్ రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేసింద‌న్నారు. అందులో నుంచి కీలకమైన మూడు రాష్ట్రాల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి అనుమతులు కూడా వచ్చాయి. కేవలం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆర్థికంగా వయబుల్ కానీ, ఏపీ మినహా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం లేని ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని విమ‌ర్శించారు. పోలవరం నుంచి బనకచర్లకు ప్రాజెక్టు (Polavaram Banakacherla Link Project) అలైన్‌మెంట్‌ను మార్చారని చెప్పారు. తెలంగాణకు చెందాల్సిన జలాలను లేకుండా చేస్తూ, తెలంగాణకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి ఏపీకి అనుకూలంగా మార్చే కుట్రను సహించేది లేదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చరిత్రహీనులుగా మిగిలిపోతారని వెల్ల‌డించారు. ఈ విషయాన్ని కేంద్రం దగ్గర తేల్చుకొని రాష్ట్రానికి రావాలని సూచించారు.

ప్రజాక్షేత్రంలో ఎండగడతాం..

తెలంగాణకు సంబంధించిన ఈ కీలక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించకుండా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా వస్తే ఢిల్లీ పర్యటన అర్థరహితమ‌న్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామ‌న్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామ‌ని, తెలంగాణ నీటి హక్కులను కాపాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ డిమాండ్లు..

  • తెలంగాణకు హామీగా ఉన్న 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి.
  • పాత మార్గదర్శకాల ప్రకారమే సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించి, వెంటనే టీఏసీ అనుమతి ఇప్పించాలి.
  • గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి.
  • ఈ ప్రాజెక్టులో తెలంగాణకు 148 టీఎంసీల్లో 75 టీఎంసీల వాటా కేటాయించాలి.
  • తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పోలవరం–బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి.
Advertisement
Advertisement