త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Seizes | మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడికి ఈడీ షాక్‌.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్‌!

ED Seizes | ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి షాకిచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.3వేల‌ కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక చర్యలు చేపట్టింది.

P

National | Published On Nov 15, 2026, 10.20 am IST

ED Seizes | మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడికి ఈడీ షాక్‌.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్‌!
Advertisement
  • విట్టల్‌ గ్రీన్‌ కాలనీలోని చైత‌న్య బ‌ఘేల్‌ 355 ప్లాట్లు అటాచ్‌..
  • ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణం కేసులో చ‌ర్య‌లు

ED Seizes | ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి షాకిచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.3వేల‌ కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక చర్యలు చేపట్టింది. చైతన్య బఘేల్‌కు చెందిన విట్టల్‌ గ్రీన్‌ కాలనీలోని 355 ప్లాట్లను జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ.61 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు కాలనీ ప్రధాన ద్వారం వద్ద ఈడీ అధికారులు నోటీసులు కూడా అంటించారు.

385 ప్లాట్లలో 355 జప్తు

కుమ్హారి-జంజ్‌గిరి ప్రాంతంలోని విట్టల్‌ గ్రీన్‌ కాలనీలో మొత్తం 385 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 30 ప్లాట్లు విక్రయించడంతో వాటిని ఈడీ జప్తు నుంచి మినహాయించింది. మిగ‌తా 355 ప్లాట్లతో పాటు ఒక వాణిజ్య స్థలాన్ని కూడా జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆస్తుల జప్తునకు సంబంధించి అడ్జుడికేటింగ్‌ అథారిటీ అనుమతి లభించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే ఈ స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

మద్యం సిండికేట్‌లో కీలక పాత్ర?

ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసినట్లు ఆరోపణలున్న మద్యం కుంభకోణం విలువ దాదాపు రూ.3వేల‌ కోట్లుగా ఈడీ అంచనా వేస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా సంపాదించిన నిధులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ఇతర ఆస్తుల కొనుగోలుకు మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. మద్యం సిండికేట్‌లో కీలక స్థాయిలో చైతన్య బఘేల్‌ వ్యవహరించారని, అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన లెక్కలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ కేసులో ఆయనకు సంబంధించిన ఆస్తులపై జప్తు చర్యలు చేపట్టింది.

మార్చి 23నే అథారిటీ ఆమోదం

చైతన్య బఘేల్‌కు చెందిన ఆస్తులను ఈడీ తొలుత 2025 నవంబర్‌ 10న తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌ 8న పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్‌ అథారిటీకి ఫిర్యాదు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన అథారిటీ.. 2026 మార్చి 19న ఈడీ చర్యలను సమర్థించింది. మార్చి 23న వెలువరించిన ఉత్తర్వుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. గతంలో భిలాయ్‌-3లోని మానసరోవర్‌ నివాస సముదాయంలో ఉన్న చైతన్య బఘేల్‌ ఇంటి బయటి గోడపైనా ఈ ఉత్తర్వుల ప్రతులను ఈడీ అధికారులు అంటించారు. తాజాగా విట్టల్‌ గ్రీన్‌ కాలనీలోని 355 ప్లాట్లను జప్తు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా నిలిచింది.

Advertisement
Advertisement