త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhilesh Yadav | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 181 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్‌: అఖిలేశ్ యాద‌వ్‌

Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 181 సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటున్న‌దని సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh Yadav) వెల్లడించారు.

G

National | Published On Nov 15, 2026, 10.38 am IST

Akhilesh Yadav | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 181 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్‌: అఖిలేశ్ యాద‌వ్‌
Advertisement

Akhilesh Yadav | త్రినేత్ర న్యూస్‌: ఉత్తరప్రదేశ్‌లో వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ 181 సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటున్న‌దని సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh Yadav) వెల్లడించారు. బీజేపీని ఓడించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తాము ఇండియా కూట‌మిలో (INDIA bloc) ఉన్నామ‌ని, మ‌రో పార్టీతో పొత్తు పెట్టుకునేది లేద‌న్నారు. కాంగ్రెస్‌తో త‌మ‌కు స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని, సీట్ల పంప‌కాల విష‌యంలో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ఆయన హిందుస్తాన్‌టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ‘అసెంబ్లీలోని మొత్తం 403 సీట్లకు గాను ఎన్ని చోట్ల పోటీ చేయాలో మేం ఇప్పటికే నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్‌ మాత్రం 181 సీట్లు అడుగుతున్న‌ది. ఏదేమైనా, ఈ దఫా బీజేపీని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఐక్యంగానే ఎన్నికల బరిలోకి దిగుతుంది’ అని చెప్పారు.

కాంగ్రెస్‌కు 100 సీట్లు కేటాయిస్తారా అనే ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. 100 కంటే చాలా ఎక్కువ సీట్లు అడుగుతున్న‌ద‌ని చెప్పారు. 180 సీట్లేనా అని ఇంట‌ర్వ్యూయ‌ర్ అడ‌గ‌డంతో.. 180కి ఒక‌టి క‌ల‌పండి (181) అంటూ జ‌వాబిచ్చారు. యూపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)ని ఓడించడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని, సీట్ల సర్దుబాటు కంటే గెలుపు ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక కూటమిలో తాము కొనసాగుతున్నందున, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP)తో పొత్తు విషయం ఆలోచించడం లేద‌ని చెప్పారు. కాంగ్రెస్‌తో కూడిన ఇండియా కూటమితోనే కొనసాగుతామ‌ని, ఈ విషయంలో ఎలాంటి మార్పూ లేద‌ని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement