త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Omar Abdullah | రాష్ట్ర హోదాను పున‌రుద్ద‌రించండి.. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో తీర్మానం

CM Omar Abdullah | జమ్ము కశ్మీర్‌కు (Jammu and Kashmir) పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని (restoration of statehood) కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో (assembly) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

D

National | Published On Sep 25, 2026, 2.23 pm IST

CM Omar Abdullah | రాష్ట్ర హోదాను పున‌రుద్ద‌రించండి.. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో తీర్మానం
Advertisement

CM Omar Abdullah | త్రినేత్ర న్యూస్ : జమ్ము కశ్మీర్‌కు (Jammu and Kashmir) పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలని (restoration of statehood) కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో (assembly) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఉంటుందని కేంద్రం ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం త‌క్ష‌ణ‌మే జ‌మ్ము క‌శ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పున‌రుద్ధ‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. పార్లమెంటులో, సుప్రీంకోర్టు వేదిక‌గా త‌మ‌కు కేంద్రం మూడు ద‌శ‌ల హామీ ఇచ్చింద‌న్నారు. డీలిమిటేష‌న్‌, ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌ర‌ణ ఉంటుందన్న హామీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. మొద‌టి రెండు విజ‌య‌వంతంగా ముగిశాయ‌ని ఇక చివ‌రిదైన మూడో ద‌శ ఒక్క‌టే మిగిలి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌మ్ము ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను కేంద్రం నిల‌బెట్టుకోవాల‌న్నారు.

నవంబర్ 6, 2024లోనూ ఇదే అంశంపై అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌స్తావించారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ తీర్మానాన్ని త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి పంప‌నున్నారు. కాగా, ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాగా, జ‌మ్ము క‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాను పున‌రుద్ధ‌రించాల‌ని ఒమ‌ర్ అబ్దుల్లా గ‌తంలోనూ ప‌లుమార్లు డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీఎం.. రాష్ట్ర హోదాను త్వ‌ర‌గా పున‌రుద్ధ‌రించాల‌ని ప్ర‌త్యేకంగా కోరారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ వల్ల ప్రజాస్వామ్య సంస్థలు బలపడతాయని, ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని చెప్పారు. జ‌మ్ము క‌శ్మీర్ అభివృద్ధి కూడా వేగ‌వంతం అవుతుంద‌ని అభిప్రాయప‌డ్డారు. 2019లో జ‌మ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కేంద్రం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

Also Read..

సిక్కింలో వ‌ర‌ద‌లు.. గ్రామంపై విరిగిప‌డ్డ కొండ‌చ‌రిలు

ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ త‌ప్ప‌నిస‌రి.. కొత్త చ‌ట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం

కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెల‌ల్లోనే 50 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు

Advertisement
Advertisement