త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్‌లో కొత్త ప్రేమకథ!

Siddhu Jonnalagadda | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. తన కెరీర్‌లో పదో చిత్రంగా తెరకెక్కనున్న కొత్త సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

P

Entertainment | Published On Nov 11, 2026, 4.35 pm IST

Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్‌లో కొత్త ప్రేమకథ!
Advertisement

Siddhu Jonnalagadda | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. తన కెరీర్‌లో పదో చిత్రంగా తెరకెక్కనున్న కొత్త సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాత్కాలికంగా ‘సిద్ధూ 10’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సిద్ధూకు జోడీగా యువ కథానాయిక నయన్ సారిక నటించనుండటం మరో విశేషం. దర్శకుడిగా మోహన్ బి పరిచయం అవుతుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ బాణీలు అందించనున్నాడు.

భాగ‌స్వామిగా సుకుమార్‌

కేవలం హీరోగా సిద్ధూ కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా పలువురు ప్రతిభావంతులు ఒకే వేదికపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండటం, అల్లు అరవింద్ వంటి ప్రముఖ నిర్మాత ఈ వేడుకలో పాల్గొనడం సినిమాపై సినీ వర్గాల్లోనూ చర్చకు కారణమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందించగా, అల్లు అరవింద్ తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. తబితా సుకుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బన్నీ వాస్, అన్మోల్ శర్మ, అశోక్ బండ్రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేప‌ట్టారు.

టిల్లు ఇమేజ్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేనా?

సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్‌ను పరిశీలిస్తే.. నటుడిగా తన ప్రయాణాన్ని చాలా సాధారణంగా ప్రారంభించిన ఆయన, క్రమంగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగానూ గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ సినిమాతో కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. టిల్లు పాత్రలో సిద్ధూ పలికించిన డైలాగులు, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విజయంతో ఆయనకు స్టార్ బాయ్ అనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ కూడా ప్రేక్షకులను అలరించడంతో ఈ ఫ్రాంచైజీతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. విభిన్నమైన కథలను ఎంచుకోవాలనే ప్రయత్నంలో సిద్ధూ ఉండ‌గా.. ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చినా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. ఈ నేపథ్యంలో తన పదో చిత్రంగా ప్రేమకథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సిద్ధూ.. ఈసారి ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న పాత్రలో ఎలా కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుందేమో చూడాలి.

నయన్ సారికకు మరో కీలక అవకాశం

మరోవైపు కథానాయిక నయన్ సారిక కూడా టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో తన కెరీర్‌ను ముందుకు దూసుకెళ్తోంది. ‘గం గం గణేశా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ‘ఆయ్’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. గోదావరి నేపథ్యంలో సాగే కథలో పల్లవి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో సత్యభామ పాత్రలో నటించి తనలోని నటనకు మరో కోణాన్ని చూపించింది. ఈ రెండు సినిమాల విజయాలు ఆమెకు ఇండ‌స్ట్రీలో మరిన్ని అవకాశాలు తీసుకొచ్చాయి. ఉత్తమ నూతన నటిగా అవార్డును అందుకోవడం కూడా ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఇక శ్రీ విష్ణు సరసన ‘విష్ణు విన్యాసం’, ‘రాకాస’ వంటి చిత్రాలతోనూ నయన్ ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌రైంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రలు చేయాలనే ఆసక్తిని ఆమె పలు సందర్భాల్లో వ్యక్తం చేసింది. ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ వంటి యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోతో జతకట్టడం ఆమె కెరీర్‌కు మరో కీల‌కంగా భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య తెరపై కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది చూడాలి.

జీవీ ప్రకాశ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ ఎంపిక కావడం మరో ఆసక్తికరమైన అంశం. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సంగీతం సుపరిచితమే. మెలోడీ పాటలతో పాటు నేపథ్య సంగీతంలోనూ తనదైన ముద్ర వేసిన జీవీ.. ఈ ప్రేమకథకు ఎలాంటి సంగీతాన్ని అందిస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు సుకుమార్ నిర్మాణ భాగస్వామ్యం, ఆయన సంస్థ కథల ఎంపికపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది ఈ ప్రాజెక్టు. ఈ చిత్రానికి మోహన్ బీ దర్శకత్వం వ‌హిస్తున్నారు. సుకుమార్ టీమ్‌తో రచయితగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొత్త దర్శకుడి కథను సిద్ధూ తన పదో చిత్రంగా ఎంచుకోవడం కూడా ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

త్వ‌ర‌లో షూటింగ్‌

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల కలయికగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మరి టిల్లు ఇమేజ్‌ను పక్కనపెట్టి సిద్ధూ కొత్త ప్రేమకథతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? నయన్ సారికతో ఆయన జోడీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సిద్ధూ జొన్నలగడ్డ పదో సినిమా ఆయన కెరీర్‌లో మరో కొత్త ప్రయత్నంగా నిలవనుంది. కథ, దర్శకుడు, సంగీతం, నిర్మాణ సంస్థల కలయికతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

Advertisement
Advertisement