త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో..

Mutual Funds | సెప్టెంబర్‌లో రూ.1.33 లక్షల కోట్ల నికర పెట్టుబడుల ఉపసంహరణ నమోదైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అక్టోబర్‌లో భారీగా పుంజుకుంది. అక్టోబర్‌లో మొత్తం నికర పెట్టుబడుల ప్రవాహం రూ.1.73 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మరోవైపు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ), గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు మాత్రం తగ్గాయి.

S

Business | Published On Nov 11, 2026, 4.10 pm IST

Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో..
Advertisement

Mutual Funds | సెప్టెంబర్‌లో రూ.1.33 లక్షల కోట్ల నికర పెట్టుబడుల ఉపసంహరణ నమోదైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అక్టోబర్‌లో భారీగా పుంజుకుంది. అక్టోబర్‌లో మొత్తం నికర పెట్టుబడుల ప్రవాహం రూ.1.73 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మరోవైపు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ), గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు మాత్రం తగ్గాయి.

ఒక్క నెల‌లోనే రూ.1.73 ల‌క్ష‌ల కోట్ల ఇన్‌ఫ్లో..

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) బుధవారం విడుదల చేసిన అక్టోబర్ గణాంకాల ప్రకారం.. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రూ.1,73,839.91 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో మొత్తం రూ.1.33 లక్షల కోట్ల నికర పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, అక్టోబర్‌లో పరిశ్రమలోకి సుమారు రూ.3.06 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు సెప్టెంబర్‌లోని రూ.4,271 కోట్ల నుంచి అక్టోబర్‌లో రూ.8,484 కోట్లకు చేరాయి. ఇది నెలవారీగా 98.6 శాతం వృద్ధి. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగంలోనూ సెప్టెంబర్‌లో రూ.1.83 లక్షల కోట్ల నిధుల ఉపసంహరణ జరగ్గా, అక్టోబర్‌లో రూ.1.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో త‌గ్గిన పెట్టుబ‌డులు..

అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మాత్రం 13.9 శాతం తగ్గి రూ.38,307 కోట్ల నుంచి రూ.32,994 కోట్లకు చేరాయి. లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు 20.1 శాతం పెరిగి రూ.859 కోట్ల నుంచి రూ.1,032 కోట్లకు చేరాయి. మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు 37.5 శాతం తగ్గి రూ.4,893 కోట్లకు, స్మాల్ క్యాప్ ఫండ్లలో 29.1 శాతం తగ్గి రూ.6,408 కోట్లకు చేరాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలోనూ 25.7 శాతం తగ్గుదల నమోదై రూ.4,980 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లలో మాత్రం దాదాపు స్థిరంగా రూ.1,714 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) సెప్టెంబర్‌లోని రూ.82.64 లక్షల కోట్ల నుంచి అక్టోబర్‌లో 0.9 శాతం పెరిగి రూ.83.38 లక్షల కోట్లకు చేరింది.

ఎస్‌ఐపీ, గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడుల్లో తగ్గుదల..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా వచ్చిన నెలవారీ పెట్టుబడులు అక్టోబర్‌లో రూ.32,160 కోట్లకు తగ్గాయి. సెప్టెంబర్‌లో ఇవి రూ.32,490 కోట్లు, ఆగస్టులో రూ.32,297 కోట్లుగా నమోదయ్యాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచ్చిన నికర పెట్టుబడులు కూడా సెప్టెంబర్‌లోని రూ.4,450.61 కోట్ల నుంచి అక్టోబర్‌లో రూ.3,474.03 కోట్లకు పడిపోయాయి. ఇది దాదాపు 22 శాతం తగ్గుదల. అక్టోబర్ నెలలో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 7 శాతం తగ్గడం గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం తగ్గడానికి ఒక కారణంగా నిలిచింది.

Advertisement
Advertisement