త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | దేశ‌మంతా క‌దులుతుంది.. ఎంత‌మందిని అరెస్ట్ చేస్తారు..?

CJP | త‌మ పార్టీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని సీజేపీ (CJP) ఆరోపించింది. అక్టోబ‌ర్ 10 నిర‌స‌న‌ల‌కు దేశ‌మంతా సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. అలాంట‌ప్పుడు అమిత్ షా ఎంత‌మందిని అరెస్టు చేస్తారంటూ ప్ర‌శ్నించింది.

D

National | Published On Oct 5, 2026, 11.29 am IST

CJP | దేశ‌మంతా క‌దులుతుంది.. ఎంత‌మందిని అరెస్ట్ చేస్తారు..?
Advertisement

CJP | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్ర‌భుత్వంపై కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (CJP) ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ (Saurav Das) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద తలపెట్టిన మెగా నిరసన కార్యక్రమానికి ముందు త‌మ పార్టీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ఆదివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

"న‌న్ను, అభిజీత్ దిప్కే, అశుతోష్ రంకా, ర‌త్న స‌హా ఇత‌ర కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి నియంత్ర‌తృత్వ చ‌ర్య‌ల‌తో నిర‌స‌న‌ల‌ను అణ‌చివేయ‌లేవు. అటువంటి నిరంకుశ చర్యలు ఫలిస్తాయని సర్కార్ భావిస్తే.. అది వారి భ్ర‌మే అవుతుంది. యువ‌త‌రంలో చైత‌న్యం వ‌చ్చింది. మేము ఉన్నా లేక‌పోయినా త‌మ‌ హ‌క్కులు, భ‌విష్య‌త్తు కోసం అంద‌రూ పోరాటం కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. జైలు శిక్షనైనా.. లేదా అంతకంటే దారుణమైన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేస్తే అది పెద్ద తప్పిదం అవుతుంది. యువత దీనిని సహించదు. నిరసనలు కొనసాగాలి. అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలి" అని సౌర‌వ్ దాస్ పిలుపునిచ్చారు.

దేశమంతా కదులుతుంది..

అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అక్టోబ‌ర్ 10 నిర‌స‌న‌ల‌కు దేశ‌మంతా సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. అలాంట‌ప్పుడు అమిత్ షా ఎంత‌మందిని అరెస్టు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. "అమిత్ షా.. మీరు ఎంత మందిని అరెస్టు చేస్తారు? అక్టోబర్ 10న దేశమంతా కదులుతుంది" అని ఎక్స్ పోస్టులో దిప్కే పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో శాంతియుత మార్చ్, నిరసన చేపడతామని స్ప‌ష్టం చేశారు. ఈ భారీ నిర‌స‌న‌ల‌కు ప్ర‌జ‌లు త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు. కాగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు వ్య‌తిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ CJP ఈ నెల 10న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Also Read..

ఆమె శ‌రీరం...ఆమె నిర్ణ‌యం...డీప్‌ఫేక్ వీడియోల‌పై జాన్వీక‌పూర్ రియాక్ష‌న్ - తెలుగు డైరెక్ట‌ర్ల‌పై సెటైర్స్‌!

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: క‌విత‌

స్టాక్ మార్కెట్‌ల‌కు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Advertisement
Advertisement