త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | న్యాయాధికారుల నిర్బంధం.. దీదీ స‌ర్కార్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సీజేఐ

Supreme Court | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మాల్దాలో స‌ర్ విధుల్లో ఉన్న న్యాయాధికారుల‌ను నిర్బంధించ‌డం ప‌ట్ల దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

D

National | Published On Apr 2, 2026, 1.16 pm IST

Supreme Court | న్యాయాధికారుల నిర్బంధం.. దీదీ స‌ర్కార్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సీజేఐ
Advertisement

Supreme Court | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మాల్దాలో స‌ర్ విధుల్లో ఉన్న న్యాయాధికారుల‌ను నిర్బంధించ‌డం ప‌ట్ల దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు బెంగాల్ ప్ర‌భుత్వంపై తీవ్రంగా మండిప‌డింది. ఈ ఘ‌ట‌న‌పై సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ లేదా జాతీయ ద‌ర్యాప్తు సంస్థతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచార‌ణ‌ను తామే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని కూడా పేర్కొంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా త‌మ పేర్ల‌ను తొల‌గించారని ఆరోపిస్తూ కొంద‌రు నిర‌స‌న‌కారులు.. మాల్దాలో స‌ర్ విధుల్లో ఉన్న ముగ్గురు మ‌హిళ‌లు స‌హా ఏడుగురు జ్యూడీషియ‌ల్ అధికారుల‌ను ఘెరావ్ చేశారు. దాదాపు తొమ్మిది గంట‌ల‌పాటూ వారిని నిర్బంధించారు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు అర్ధ‌రాత్రి 1 గంట త‌ర్వాత అక్క‌డికి చేరుకుని అధికారుల‌ను ర‌క్షించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది.

సీజేఐ అస‌హ‌నం..

ఈ ఘ‌ట‌న‌పై భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) తీవ్రంగా స్పందించారు. ఈ ఘ‌ట‌న సుప్రీంకోర్టు అధికారాన్ని స‌వాలు చేసేలా ఉంద‌ని వ్యాఖ్యానించారు. "సాయంత్రం 4 గంటలకు అధికారులను నిర్బంధిస్తే, రాత్రి వరకు వారికి సహాయం అందలేదు. ఇది సాధారణ ఘటన కాదు. న్యాయాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసి, కొనసాగుతున్న ప్రక్రియను అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన దాడిలా కనిపిస్తోంది" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

ఈ ఘెరావ్ గురించి రాష్ట్ర అధికారుల‌కు మ‌ధ్యాహ్న‌మే స‌మాచారం అందింద‌ని సీజేఐ తెలిపారు. అయినా ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని మండిప‌డ్డారు. కోల్‌క‌తా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ స్వ‌యంగా డీజీపీ, హోం సెక్ర‌ట‌రీకి ఫోన్ చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. అర్ధ‌రాత్రి త‌ర్వాత వారిని విడుద‌లు చేసిన‌ట్లు చెప్పారు. నిర్బంధం నుంచి విడుద‌లైన అనంత‌రం అధికారులు త‌మ నివాసాల‌కు వెళ్తున్న స‌మ‌యంలో వారి వాహ‌నాల‌పై నిర‌స‌న‌కారులు దాడి చేశార‌ని మండిప‌డ్డారు.

దురుద్దేశంతో చేసిన చ‌ర్య‌గా అనిపిస్తోంది..

"ఈ ఘ‌ట‌న కేవలం న్యాయాధికారుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డ‌మే కాకుండా.. కోర్టు అధికారాన్ని బ‌హిరంగంగా స‌వాల్ చేసే ప్ర‌య‌త్నం. ఇది ఏదో అనుకోకుండా జ‌రిగిన సాధార‌ణ ఘ‌ట‌న కాదు. న్యాయాధికారుల నైతిక ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌డానికి, అలాగే జాబితాలో లేని ఓట‌ర్ల అభ్యంత‌రాల ప‌రిష్కార ప్ర‌క్రియ‌ను అడ్డుకోవ‌డానికి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో, దురుద్దేశంతో చేసిన చ‌ర్య‌గా క‌నిపిస్తోంది. ఎవరైనా స‌రే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని న్యాయాధికారులపై దాడికి పాల్పడటాన్ని మేము అనుమతించబోము" అని సీజేఐ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌లో బెంగాల్ ప్ర‌భుత్వం త‌న విధిని నిర్వ‌ర్తించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సీజేఐ అభిప్రాయ‌ప‌డ్డారు. ఘెరావ్ గురించి స‌మాచారం అందిన‌ప్ప‌టికీ అధికారుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకురావ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

బెంగాల్‌లో అంతా రాజ‌కీయ భాషే మాట్లాతారు..

విచార‌ణ సంద‌ర్భంగా పశ్చిమ బెంగాల్ అడ్వొకేట్ జనరల్ కిషోర్ దత్తా స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ప్రతికూల పక్షంలా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. దానికి ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. "దురదృష్టవశాత్తు.. మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయ భాష మాట్లాడుతున్నారు. దేశంలోనే అత్యంత ధ్రువీకరించబడిన రాష్ట్రం మీది. అర్ధ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కూ నేనే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాను. ఆ దుండగులు ఎవరో మాకు తెలియదని అనుకుంటున్నారా..? ఇది చాలా చాలా దురదృష్టకరం" అని సీజేఐ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Also Read..

Mojtaba Khamenei | ఇరాన్ పునర్నిర్మాణానికి క‌దిలి రావాలి.. ప్ర‌జ‌ల‌కు మొజ్తాబా ఖ‌మేనీ పిలుపు

రూ.167 కోట్లు ప‌లికిన‌ "య‌శోద కృష్ణ" పెయింటింగ్‌.. అత్య‌ధిక ధ‌ర ప‌లికిన చిత్రంగా రికార్డు

రామాయ‌ణ వ‌ర్సెస్ వార‌ణాసి - రాజ‌మౌళిని మించినోడు లేడు...నెటిజ‌న్ల కంపేరిజ‌న్స్ వైర‌ల్

Advertisement

తాజావార్తలు

Advertisement