త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mushroom Farming | 14 ఏళ్ల ఐటీ కెరీర్‌ను వ‌దిలి.. వ్య‌వ‌సాయంవైపు అడుగులు.. క‌ట్ చేస్తూ పుట్ట‌గొడుగుల‌ వ్యాపారంతో నెల‌కు రూ.10 ల‌క్ష‌ల లాభం

Mushroom Farming | ఒడిశాకు చెందిన ఓ టెకీ 14 ఏళ్ల‌ ఐటీ రంగాన్ని వ‌దిలేసి వ్యవ‌సాయ రంగాన్ని ఎంచుకున్నారు. పుట్ట‌గొడుగుల వ్యాపారం మొద‌లు (Mushroom Farming) పెట్టి నెల‌కు రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం అర్జిస్తూ.. స్థానికంగా ప‌లువురికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. ఒక ఐటీ నిపుణుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో నేర్చుకున్న నైపుణ్యాలను పూర్తిగా భిన్నమైన వ్యాపారంలో ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనడానికి ఈ మాజీ టెకీ క‌థ ఓ నిదర్శనం.

D

National | Published On Aug 17, 2026, 3.43 pm IST

Mushroom Farming | 14 ఏళ్ల ఐటీ కెరీర్‌ను వ‌దిలి.. వ్య‌వ‌సాయంవైపు అడుగులు.. క‌ట్ చేస్తూ పుట్ట‌గొడుగుల‌ వ్యాపారంతో నెల‌కు రూ.10 ల‌క్ష‌ల లాభం
Advertisement

Mushroom Farming | త్రినేత్ర‌.న్యూస్ : ఐటీ రంగం, పట్టణ జీవితం వదిలి ఉద్యోగులు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు హై-పెయింగ్ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, డైరీ, పశుపోషణ వంటి రంగాల్లో రాణిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను, మార్కెటింగ్ పద్ధతులతో ఏడాదికి రూ.ల‌క్ష‌లు, రూ.కోట్ల‌ల్లో ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ టెకీ 14 ఏళ్ల‌ ఐటీ రంగాన్ని వ‌దిలేసి వ్యవ‌సాయ రంగాన్ని ఎంచుకున్నారు. నెల‌కు రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం అర్జిస్తూ.. స్థానికంగా ప‌లువురికి ఉపాధి క‌ల్పిస్తున్నారు.

బీటెక్ పూర్తి చేసి ఐటీవైపు

ఒడిశా (Odisha)కు చెందిన విక్రమ్‌దేవ్ మోహపాత్ర (Vikramdev Mohapatra) 2012లో ఒడిశాలోని బిజు పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఐటీ రంగంలో అడుగుపెట్టారు. డిస్కవర్చర్ సొల్యూషన్స్, మైండ్‌ట్రీ, సెరోల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్ ట్రీ వంటి కంపెనీల్లో ప‌నిచేశారు. మొత్తంగా ఐటీ రంగంలో 14 ఏళ్ల అనుభ‌వం ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మాడ్యూల్ లీడ్, టెక్నికల్ లీడ్, ప్యాకేజీ ఇంప్లిమెంటేషన్‌లో సీనియర్ స్పెషలిస్ట్ వంటి పలు హోదాల్లో పనిచేసి మంచి కెరీర్‌ను నిర్మించుకున్నారు.

గంగా భూమి మష్రూమ్స్..

అయితే, అనూహ్యంగా ఆయ‌న త‌న ఐటీ కెరీర్‌ను ముగించారు. ఒడిశాలోని త‌న స్వ‌స్థ‌ల‌మైన న‌బ‌రంగ్‌పూర్ (Nabarangpur) వెళ్లిపోయారు. అక్క‌డ ఓ పుట్ట‌గొడుగుల వ్యాపారం మొద‌లు పెట్టారు. 'గంగా భూమి మష్రూమ్స్' పేరిట పుట్ట‌గొడుగుల‌ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నెల‌కు దాదాపు రూ.20 ల‌క్ష‌లు అర్జిస్తున్నారు. ఈ సంస్థ‌ రోజుకు 500-600 కిలోల పుట్ట‌గొడుగుల‌ను (నెలకు 15-18 టన్నులు) ఉత్ప‌త్తి చేస్తోంది. స‌గ‌టు కేజీ పుట్ట‌గొడుగులు రూ.100 నుంచి రూ.110కి విక్ర‌యిస్తున్నారు. వీటిని బ్రహ్మపూర్, భువనేశ్వర్‌లలోని మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. ఏడాది పొడవునా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా కొనసాగుతోంది. నెల‌కు రూ.16 నుంచి 19 ల‌క్ష‌ల రాబడి వ‌స్తోంది. ఖర్చుల‌న్నీ పోను విక్రమ్‌దేవ్ ఈ వ్యాపారం ద్వారా ప్రస్తుతం నెల‌కు రూ.10 ల‌క్ష‌ల‌కుపైగా నిక‌ర లాభాన్ని పొందుతున్నాడు.

నెల‌కు రూ.10 ల‌క్ష‌ల నిక‌ర లాభం

ఈ ప్రాజెక్టు కోసం విక్రమ్‌దేవ్ రూ.2.56 కోట్లు ఖ‌ర్చు చేశారు. 'ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ్ యోజన' కింద రూ. 97 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ లభించింది. నిర్వహణ ఖర్చులు పోను ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ. 10 లక్షలకుపైగా నికర లాభం ఆర్జిస్తూ ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, ఈ కేంద్రం ద్వారా త‌న సొంతం ప్రాంతంలోని 24 మంది స్థానికుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నారు విక్రమ్‌దేవ్. ఇందులో 18 మంది మ‌హిళ‌లే కావ‌డం విశేషం. అత‌ను త‌న సంస్థ ద్వారా జీతం తీసుకుంటూనే.. ప‌లువురికి ఉపాధి క‌ల్పిస్తుండ‌టం విశేషం. విక్ర‌మ్‌దేవ్ కథ కేవలం ఐటీ కొలువును వదిలి వ్యవసాయంలోకి రావడం గురించే కాదు.. ఒక ఐటీ నిపుణుడు కార్పొరేట్ ప్ర‌పంచంలో నేర్చుకున్న నైపుణ్యాలను పూర్తిగా భిన్నమైన వ్యాపారంలో ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనడానికి ఒక నిదర్శనం.

సొంత నేల‌వైపు అడుగులు

పుట్టగొడుగుల పెంపకంలో విక్రమ్‌దేవ్ పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఆయన కేవలం పుట్టగొడుగులు పెంచడమే కాకుండా, వాటిని నిల్వ చేయడం, ప్యాక్ చేయడం, పెద్ద మార్కెట్లకు స‌ర‌ఫ‌రా చేయ‌డం చేస్తున్నారు. ఆయన ఐటీ నేపథ్యం వ్యవసాయానికి సంబంధ‌మే లేదు. ప‌క్కా ప్ర‌ణాళిక‌, వ్యవస్థలు, ఉత్పత్తి నిర్వహణ, లాజిస్టిక్స్, సమన్వయంతో వ్యాపారాన్ని విజ‌య‌వంతంగా న‌డుత‌పుతున్నాడు.  ఒక బీటెక్ డిగ్రీ అనేది వ్య‌క్తి కెరీర్ ఎక్క‌డ ముగియాల‌నేదాన్ని నిర్ణ‌యించ‌లేద‌డానికి విక్రమ్‌దేవ్ క‌థే ఉదాహ‌ర‌ణ. 14 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ప్రయాణం చివరికి ఆయనను మళ్లీ సొంత నేల వైపు అడుగులేసేలా చేసింది.

Also Read..

త‌మిళ‌నాడు రైతుల‌కు విజ‌య్ గుడ్‌న్యూస్‌.. రూ.75వేల దాకా పంట రుణాల‌మాఫీ

పాత వాహ‌నాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎక‌నామిస్ట్ నాగేశ్వ‌ర‌న్‌

మ‌రో ఇద్ద‌రు ఎయిర్ ఇండియా పైల‌ట్ల‌కు డ్ర‌గ్స్ పాజిటివ్‌

Advertisement
Advertisement