త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol | పాత వాహ‌నాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎక‌నామిస్ట్ నాగేశ్వ‌ర‌న్‌

E20 Petrol | పాత వాహ‌నాల కోసం ఈ10 పెట్రోల్ (E10 petrol)ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (Chief Economic Adviser) వి. అనంత నాగేశ్వరన్ (V Anantha Nageswaran) అభిప్రాయ‌ప‌డ్డారు.

D

Business | Published On Aug 17, 2026, 2.45 pm IST

E20 Petrol | పాత వాహ‌నాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎక‌నామిస్ట్ నాగేశ్వ‌ర‌న్‌
Advertisement
  • ఈ20 ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ..
  • ఆహారం, ఇంధనం, నీటి వినియోగంపై అంచ‌నా వేయాలి
  • ఈ20పై చ‌ర్చ వేళ‌ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కీల‌క సూచ‌న‌

E20 Petrol | త్రినేత్ర‌.న్యూస్ : ఈ20 పెట్రోల్ (E20 Petrol)పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ( V Anantha Nageswaran) ప్ర‌భుత్వానికి కీలక సూచన చేశారు. పాత వాహ‌నాల కోసం ఈ10 పెట్రోల్‌ను (E10 petrol) మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. అంతేకాదు పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే ముందు ఆహారం, ఇంధనం మధ్య తలెత్తే ప్రభావాలను, నీటి లభ్యత వంటి అంశాల‌ను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు రాసిన వ్యాసంలో ఆర్థిక వ్యవహారాల శాఖలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఆకాశ్‌ పూజారీ (Akash Poojari)తో కలిసి అనంత నాగేశ్వరన్ త‌న‌ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌ విక్రయిస్తున్నారు. అయితే, BS-IVకి ముందు తయారైన, కార్బ్యురేటర్‌ ఆధారిత ద్విచక్ర వాహనాలకు ఈ20 ఇంధనం కొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉందని నాగేశ్వరన్‌, ఆకాశ్‌ పూజారీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి వాహనాలు దేశంలో సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉన్నాయని అంచనా వేశారు. పాత వాహనాలకు ఇథనాల్‌కు అనుకూలంగా ఉండే విడిభాగాలు అమర్చవచ్చని, అయితే కోట్లాది వాహనాలను ఈ మార్పులు చేయ‌డానికి సమయం పడుతుందని తెలిపారు.

"దేశంలో ఈ10 ఇంధ‌నానికి అనుగుణంగా త‌యారైన 8 కోట్ల ద్విచ‌క్ర వాహ‌నాలు ఉన్నాయి. వీటిలో చాలా వాహ‌నాలు అధిక ఇథ‌నాల్ మిశ్ర‌మంతో న‌డిచేలా డిజైన్ చేయ‌లేదు. ఇది కేవలం మైలేజీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇథ‌నాల్ మోతాదు ఎక్కువ‌గా ఉంటే పెట్రోల్‌తో ఆ వాహ‌నాల్లో ఇంజిన్ వేడెక్కే ప్ర‌మాదం ఉంది. పాత ర‌బ్బ‌రు భాగాల‌పై ప్ర‌భావం చూపొచ్చు. కార్బ్యురేటర్ ఆధారిత వాహనాలు కూడా అధిక ఇథనాల్ మిశ్రమాలను తట్టుకోవడంలో ఇబ్బంది పడతాయి. పాత వాహ‌నాల్లో ఇథ‌నాల్‌కు అనుకూలంగా ఉండే విడిభాగాల‌ను అమ‌ర్చే అవ‌కాశం ఉంది. కానీ అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కోట్లాది వాహనాల్లో మార్పులు చేయడం ఒక్కసారిగా సాధ్యం కాదు. అందుకే పాత వాహ‌నాల కోసం ఈ 10 ఇంధ‌నాన్ని అందుబాటులో ఉంచ‌డమే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం. దీనివల్ల పాత వాహనాల యజమానులకు తమ వాహనాలకు అనుకూలమైన ఇంధనాన్ని ఎంచుకునే ప్రత్యామ్నాయం లభిస్తుంది. అంతేకాదు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న త‌గ్గ‌డ‌మే కాకుండా.. ఇథ‌నాల్ వినియోగం కూడా కొంత మేర త‌గ్గుతుంది" అని అభిప్రాయ‌ప‌డ్డారు.

భవిష్యత్తులో ఈ20ను దాటి ఈ27, ఈ30 వంటి అధిక ఇథనాల్‌ మిశ్రమాల వైపు వెళ్లే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని నాగేశ్వరన్‌, పూజారీ సూచించారు. ఇథనాల్‌ తయారీకి చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ పంటలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇంధన అవసరాల కోసం ఈ పంటలకు డిమాండ్‌ పెరిగితే ఆహారం, పశుదాణాకు వాటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చ‌రించారు. అందుకే ఈ20 ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. ఆహారం, ఇంధనం, నీటి వినియోగంపై ప‌డే ప్ర‌భావాల‌ను అంచ‌నా వేయడం ముఖ్య‌మ‌ని సూచించారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read..

హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ - డైరెక్ట‌ర్‌గా ప్ర‌భాస్ ఈశ్వ‌ర్ యాక్ట‌ర్ - టీజ‌ర్ రిలీజ్‌

వందేమాత‌ర గేయాన్ని అవ‌మానించారు.. కాంగ్రెస్‌వాళ్ల‌కు సిగ్గు మిగిలి ఉంటే క్ష‌మాప‌ణ చెప్పాలి

బీఫ్ ఇష్ట‌మా? - మ‌ల‌యాళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్ర‌శ్న‌ - నెటిజ‌న్లు ఫైర్‌

Advertisement
Advertisement