త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allahabad High Court | మేజరైన‌ కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు

Allahabad High Court | మేజర్ అయిన కుమార్తెను (adult daughters) ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తమతో కలిసి జీవించేలా తలిదండ్రులు బలవంతం చేయలేరని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) స్ప‌ష్టం చేసింది. మేజ‌రైన మ‌హిళ‌కు త‌న ఇష్టానుసారం ఎక్క‌డైనా, ఎవ‌రితోనైనా నివ‌సించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.

D

National | Published On Oct 6, 2026, 11.42 am IST

Allahabad High Court | మేజరైన‌ కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు
Advertisement

Allahabad High Court | త్రినేత్ర న్యూస్ : వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల విషయంలో అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మేజర్ అయిన కుమార్తెను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తమతో కలిసి జీవించేలా తలిదండ్రులు బలవంతం చేయలేరని స్ప‌ష్టం చేసింది. క‌ళావ‌తి దేవి అనే మ‌హిళ త‌న 25 ఏళ్ల కుమార్తె పూజ‌ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిష‌న్‌ను విచారించిన‌ జస్టిస్ సందీప్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం.. యువ‌తిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌తో యువ‌తిని పోలీసులు న్యాయ‌స్థానం ఎదుట హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా యువ‌తి వాంగ్మూలం న‌మోదు చేశారు. తాను ప్ర‌స్తుతం ఎలాంటి చ‌ట్ట‌విరుద్ధ‌మైన నిర్బంధంలో లేన‌ని, ఢిల్లీలో స్వేచ్ఛ‌గా, స్వ‌తంత్రంగా జీవిస్తున్న‌ట్లు యువ‌తి స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లి ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని, త‌ర‌చూ త‌న‌ను కొడుతూ వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించింది. అయితే, కుమార్తె ఆరోప‌ణ‌ల‌ను త‌ల్లి క‌ళావ‌తి ఖండించింది. త‌న కుమార్తె త‌మ‌తోపాటూ క‌లిసి జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్లు కోర్టుకు తెలిపింది.

ఇరుప‌క్షాల‌ వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మేజ‌రైన మ‌హిళ‌కు త‌న ఇష్టానుసారం ఎక్క‌డైనా, ఎవ‌రితోనైనా నివ‌సించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. పూజ ప్ర‌స్తుతం మేజ‌ర్ అని గుర్తు చేసింది. కేవలం క‌న్న‌వారు అయినంత‌ మాత్రాన మేజ‌రైన కుమార్తెను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తమ వద్దే నివసించేలా బలవంతం చేయలేరని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కళావతి దేవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో ఎలాంటి న్యాయపరమైన బలం లేదని స్పష్టం చేసింది. ఒక‌ వ్య‌క్తిని ఎవ‌రైనా చ‌ట్ట‌విరుద్ధంగా నిర్బంధిస్తే మాత్ర‌మే హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది. అంతేకానీ, త‌ల్లిదండ్రుల ఇష్టాల కోసం వ‌య‌సొచ్చిన పిల్ల‌ల‌ను వారి ఇష్టానికి వ్య‌తిరేకంగా లొంగ‌దీసుకోవ‌డానికి ఈ పిటిష‌న్‌ను సాధ‌నంగా వాడ‌లేర‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు క‌ళావ‌తి దేవి వేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది.

Also Read..

ఇండీ కూట‌మి సేవ్ డెమొక్ర‌సీ మార్చ్‌.. ఢిల్లీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌

స‌మాధానం చెప్పాల్సింది పోయి.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తారా..?

'ప‌ది'లో ప‌రిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగిక‌దాడి

Advertisement
Advertisement