త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది : ప్ర‌ధాని మోదీ

PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ముగిసిన బ్రిక్స్ సదస్సు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పుకొచ్చారు.

D

National | Published On Sep 17, 2026, 1.36 pm IST

PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : న్యూఢిల్లీలో జరిగిన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవంగా ఆమోదం ల‌భించ‌డం భారతదేశంపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో 'సెమికాన్ ఇండియా 2026' (SEMICON India 2026) ఐదో ఎడిష‌న్‌ను ప్ర‌ధాని ప్రారంభించారు.

సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ మెగా చిప్ సమ్మిట్ జరగనుంది. ‘సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఈకోసిస్టమ్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ప్ర‌ధాని.. భారతదేశం తన సెమీకండక్టర్ ప్రయాణంలో రెండో దశలోకి ప్రవేశించిందని తెలిపారు. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సెమీకండక్టర్ చిప్స్ (Semiconductor Chips) గుండె కాయ‌లాంటివ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. మ‌నం రోజూ వాడే స్మార్ట్‌ఫోన్‌లు మొద‌లుకొని ల్యాప్‌టాప్‌లు, ఎల‌క్ట్రిక్ కార్లు, ప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తిదీ ఈ చిప్స్‌పైనే ఆధార‌ప‌డి ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు.

సెమీకండక్టర్ తయారీకి భారత్‌ ప్రాధాన్య గమ్యస్థానం

గ్లోబల్ చిప్ తయారీకి భారతదేశం అత్యంత నమ్మకమైన గమ్యస్థానమని చెప్పారు. ప్రపంచ దేశాలు దశాబ్దకాలంలో సాధించే పురోగతిని భారత్ కేవలం నాలుగేళ్లలోనే సాధించిందని పేర్కొన్నారు. చిప్ డిజైన్, తయారీ, సంబంధిత సాంకేతిక‌త‌ల్లో భార‌త్ సాధిస్తున్న సామ‌ర్థ్యాలు దేశంపై ప్ర‌పంచ దేశాల న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌పంచానికి కొత్త‌, న‌మ్మ‌ద‌గిన చిప్ తయారీ కేంద్రాలు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ ఇందుకు పూర్తిగా సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిపారు. సెమీకండక్టర్ తయారీకి భారత్‌ను ప్రధాన‌ గమ్యస్థానంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 12 చిప్ త‌యారీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయ‌ని చెప్పారు. రాబోయే తదుపరి దశలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

యువత పాత్ర అత్యంత కీలకం

భారత సెమీకండక్టర్ రంగం అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. దేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా యువ ప్రతిభను (Young Talent) వెలికితీయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యార్థులకు చిప్ డిజైనింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారే స్వయంగా చిప్స్‌ను డిజైన్ చేసే అవకాశాలను కల్పిస్తున్నామని వివ‌రించారు.

భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది

ఈ సంద‌ర్భంగా దేశ ఆర్థిక పనితీరును ప్ర‌ధాని ప్ర‌ముఖంగా ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదురైనప్పటికీ భార‌త్ బ‌ల‌మైన వృద్ధిని క‌న‌బ‌రిచింద‌ని ప్ర‌శంసించారు. సెప్టెంబర్‌లో విడుదలైన త్రైమాసిక జీడీపీ (GDP) నివేదిక ప్రకారం భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించింద‌ని గుర్తు చేశారు. భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. మూడు రోజుల క్రితం ముగిసిన బ్రిక్స్ సదస్సు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పుకొచ్చారు.

భారత్ వేగవంతమైన పురోగతికి గడిచిన 15 రోజుల్లో జ‌రిగిన ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మిన ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. పది రోజుల క్రితం ముంబైలో జరిగిన ఫిన్‌టెక్ సదస్సులో ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీలపై విస్తృతంగా చర్చ జరిగిందని మోదీ తెలిపారు. అదే స‌మ‌యంలో దేశంలో సుమారు 3,000 కిలోమీట‌ర్ల మేర డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా రవాణాను వేగవంతం చేసి, లాజిస్టిక్స్‌ను మెరుగుపరుస్తాయని, తయారీ రంగానికి కొత్త బలాన్ని ఇస్తాయని ప్రధాని వివ‌రించారు. అదేవిధంగా జ‌పాన్‌కు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భార‌త్ సావ‌రిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింద‌ని చెప్పారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంద‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు.

Also Read..

జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

దిశా శాలియ‌న్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగ‌ల్ నోటీసు

డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం

Advertisement
Advertisement