త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | జాతీయ జెండాను రాజకీయాల్లోకి లాగొద్దు

సెప్టెంబర్ 17 వేడుకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. జాతీయ జెండాను రాజకీయాల కోసం వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

J

Telangana | Published On Sep 17, 2026, 12.49 pm IST

Ponnam Prabhakar | జాతీయ జెండాను రాజకీయాల్లోకి లాగొద్దు
Advertisement
  • జాతీయ జెండా ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని, సెప్టెంబర్ 17ను రాజకీయ విభజనలకు వేదికగా మార్చొద్దని పొన్నం ప్రభాకర్ హితవు 
  • గుజరాత్‌లోని జునాగఢ్, జమ్మూ-కాశ్మీర్ విలీన దినోత్సవాలను కేంద్రం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్ రెడ్డికి సూటి ప్రశ్న
  • నాగ్‌పూర్‌లోని RSS కార్యాలయంలో దశాబ్దాల పాటు జెండా ఎగురవేయని చరిత్ర బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లది
  • తెలంగాణపై కపట ప్రేమ చూపడం మాని, రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వండి 

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : సెప్టెంబర్ 17 చారిత్రక దినోత్సవాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ జెండా ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని ఆయన హితవు పలకారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేసిందని పొన్నం గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అధికారికంగా నివాళులు అర్పించారని చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం "మేమే జాతీయ జెండా ఎగురవేస్తున్నాం.. మిగతావారు చేయడం లేదు" అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

చరిత్రను వక్రీకరిస్తున్నారు

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని అందరూ గౌరవిస్తారని, కానీ దీన్ని ఒకే పార్టీకి, ఒక సిద్ధాంతానికి మాత్రమే ఆపాదించడం అన్యాయమని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ కాలంలో ఉద్యమాలు నడిపింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలేనని, ఆ సమయంలో బీజేపీ జాడే లేదని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆయన కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. "హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోని జునాగఢ్, జమ్మూ-కాశ్మీర్ కూడా దేశంలో ఆలస్యంగా విలీనమయ్యాయి. మరి జునాగఢ్, కశ్మీర్ విలీన దినోత్సవాలను కేంద్రం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు? నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా, ప్రధానిగా ఉన్నప్పుడు జునాగఢ్‌లో ఎందుకు అధికారికంగా జెండా ఎగురవేయడం లేదు? అక్కడ మజ్లీస్ పార్టీకి భయపడుతున్నారా?" అని నిలదీశారు.

జెండా వందనంపై ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర ఏంటి?

జాతీయ జెండా గురించి మాట్లాడే ముందు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ గతాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో 2002 జనవరి 26న సుమారు 52 సంవత్సరాల తర్వాత తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారని గుర్తుచేశారు. కొత్తగా పదవి దక్కినవాళ్లకు ఆవేశం ఎక్కువన్నట్లుగా బీజేపీ నేతలు ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణకు నిధులు ఎక్కడ?

సెప్టెంబర్ 17 రాగానే తెలంగాణపై ప్రేమ ఒలకబోసే బీజేపీ నేతలకు కపట ప్రేమ ఇక్కడ చెల్లదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులను గుర్తించి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ అభివృద్ధికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. చరిత్రను గౌరవిద్దాం, అమరుల త్యాగాలను స్మరించుకుందాం, జాతీయ జెండాకు తగిన గౌరవం ఇద్దాం.. కానీ దాన్ని రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

Advertisement
Advertisement