Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్
Giorgia Meloni | ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు కెక్కింది.
International | Published On Sep 4, 2026, 1.14 pm IST
Giorgia Meloni | త్రినేత్ర.న్యూస్ : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆమె నేతృత్వంలోని కన్జర్వేటివ్ ప్రభుత్వం 1,413 రోజుల పాటు నిరంతరాయంగా అధికారంలో కొనసాగి 1946లో ఇటలీ రిపబ్లిక్‌గా ఏర్పడిన తర్వాత (రెండో ప్రపంచ యుద్ధం తర్వాత) అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు కెక్కింది. గతంలో 2001-2005 మధ్య కాలంలో దివంగత ప్రధాని సిల్వియో బెర్లుస్కోని నేతృత్వంలోని ప్రభుత్వం 1,412 రోజుల పాటూ సుదీర్ఘంగా అధికారంలో కొనసాగి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును సెప్టెంబర్ 4, 2026 నాటికి మెలోనీ ప్రభుత్వం అధిగమించింది ( Italys longest-serving uninterrupted government).
80 ఏళ్లలో 68 ప్రభుత్వాలు
పలు నివేదికల ప్రకారం.. సాధారణంగా ఇటలీ రాజకీయాల్లో తరచూ ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. గత 80 ఏళ్లలో ఇటలీలో దాదాపు 68 ప్రభుత్వాలు మారాయి. అక్కడ ఒక్కో ప్రభుత్వం సగటున కేవలం 13 నెలలు మాత్రమే పాలన సాగించగలిగింది. అలాంటి రాజకీయ అస్థిరత ఉన్న దేశంలో మెలోనీ ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగడం చెప్పుకోదగ్గ విజయమని నిపుణులు భావిస్తున్నారు.
తొలి మహిళా ప్రధానిగా..
అక్టోబర్ 2022లో మెలోనీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా మెలోనీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా నియో-ఫాసిస్ట్ మూలాలున్న పార్టీ నుంచి ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇదే కావడంతో యూరప్ మిత్రదేశాలు ఆమెను కొంత అనుమానంగానే చూశాయి. అయితే, మెలోనీ మాత్రం చాలా ఆచరణాత్మకంగా పాలన సాగిస్తూ ముందుకుసాగారు. రష్యా దండయాత్ర తర్వాత కూడా ఉక్రెయిన్‌కు తన పూర్తి మద్దతు కొనసాగించారు. యూరోపియన్ సంస్థల పరిధిలోనే పనిచేస్తూ.. ఆర్థిక నియమ నిబంధనలను పాటించారు. పాలనలో తన మార్క్‌ను చూపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న అనుబంధం.. ఆమె విదేశాంగ విధానంలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా నిలిచింది.
కఠినమైన వలస విధానాలు..
బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పొరుగు యూరప్ దేశాలు ప్రభుత్వాలను మారుస్తూ, తీవ్ర రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ మెలోనీ మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించడంలో విజయం సాధించగలిగారు. ఆధునిక ఇటాలియన్ రాజకీయాల్లో ఇది చాలా అరుదైన విషయం. కఠినమైన వలస విధానాలు, యూరోపియన్ యూనియన్‌తో సమతుల్య సంబంధాలు, దేశీయ ఆర్థికాంశాలపై మెలోనీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇటలీ ఓటర్లలో ఆమె పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇటలీ నమ్మకాన్ని పెంచేలా ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ఆమెకు కలిసొచ్చిన అంశం.
రాజకీయ స్థిరత్వం సరిపోదు..
ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం మరొకటి ఉంది. ఐరోపాలోనే అత్యంత అస్థిరమైన రాజకీయాలు ఉండే ఇటలీలో.. ఐదేళ్ల పూర్తి కాలం ఒకే ప్రభుత్వం కొనసాగేలా మెలోనీ స్థిరత్వాన్ని చూపించగలిగారు. అయితే, కేవలం రాజకీయ స్థిరత్వం మాత్రమే ఎల్లప్పుడూ ఎన్నికల్లో గెలిపించలేదు. ఓటర్లు కేవలం స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా, తమ దైనందిన జీవితాల్లో వచ్చిన స్పష్టమైన మార్పులను బేరీజు వేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటలీ ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరగడం, ఉపాధి అవకాశాలు, నెమ్మదించిన ఆర్థిక వృద్ధి వంటి సవాళ్లను మెలోనీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలా అధిగమనిస్తుందనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 2027 చివర్లో జరగబోయే ఎన్నికల్లో ఇటాలియన్ ఓటర్లు మళ్లీ మెలోనీకే పట్టంకడతారో లేదో చూడాలి మరి.
ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పాటూ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న మెలోనీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభినందనలు తెలిపారు. ఈ మైలురాయి ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. అదే సమయంలో భారత్-ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆమె స్నేహం కీలక పాత్ర పోషించిందని ప్రధాని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మెలోనీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.
Her friendship has also been…
— Narendra Modi (@narendramodi) September 4, 2026
Also Read..
ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఏ భాషనైనా నేర్పించే డ్యుయోలింగో ప్లాట్‌ఫామ్, ఏడాదిపాటు ఫ్రీ..
వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

GSLV F17 mission | మరో ఆరు ప్రయోగాలే లక్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజయవంతం వేళ గగన్‌యాన్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్
సెప్టెంబర్ 4, 2026

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
సెప్టెంబర్ 3, 2026

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..
- ●Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!
- ●KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం
- ●Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
- ●Harish Rao | తాగునీరు లేక విద్యార్థుల అవస్థలు.. కాగజ్‌నగర్ ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హరీశ్ రావు
- ●Uttam Kumar Reddy | సమ్మక్క సారక్క బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి

Fire breaks out at Hospital | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది నవజాత శిశువులు సహా..

Air India Flight | మత్తులోనే ఎయిర్ ఇండియా పైలట్.. ఏఏఐబీ దర్యాప్తులో వెల్లడి!

KTR | లక్సెంబర్గ్ వెంచర్ డేస్‌లో ఉపన్యాసమివ్వండి.. కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది



