త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది

Harish Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వ వెయ్యి రోజుల పాల‌న‌లో అభివృద్ధి మ‌టుమాయ‌మైంద‌ని.. వెయ్యి ప‌డ‌గ‌ల‌తో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు ఆరోపించారు. 33 నెలలైనా రూ.4,000 పెన్షన్ అతీగతీ లేదన్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 3.5 లక్షల పెన్షన్ల‌ను రద్దు చేశార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 4, 2026, 1.00 pm IST

Harish Rao | వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి మటుమాయమైంది.. వెయ్యి పడగలతో అవినీతి రాజ్యమేలుతోంది
Advertisement
  • 33 నెలలైనా రూ. 4,000 పెన్షన్ అతీగతీ లేదు.. 3.5 లక్షల పెన్షన్లు రద్దు చేశారు
  • ప్రతి అవ్వా తాతకు రేవంత్ స‌ర్కార్‌ రూ. 66,000 బాకీ పడింది
  • నీ గురువు ఏపీలో మొదటి నెలలోనే రూ. 4,000 ఇస్తే.. నువ్వెందుకు ఇవ్వట్లేదు?
  • రేవంత్ పాల‌నంతా క‌మీష‌న్ల చుట్టే తిరుగుతుంది
  • బెల్లంపల్లిలో నిర్వహించిన వంటావార్పులో రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వ వెయ్యి రోజుల పాల‌న‌లో అభివృద్ధి మ‌టుమాయ‌మైంద‌ని.. వెయ్యి ప‌డ‌గ‌ల‌తో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్ రావు ఆరోపించారు. 33 నెలలైనా రూ.4,000 పెన్షన్ అతీగతీ లేదన్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 3.5 లక్షల పెన్షన్ల‌ను రద్దు చేశార‌ని మండిప‌డ్డారు. ప్రతి అవ్వా తాతకు కాంగ్రెస్ సర్కార్ రూ. 66,000 బాకీ పడిందిని తెలిపారు. రేవంత్‌ గురువు ఏపీలో మొదటి నెలలోనే రూ. 4,000 ఇస్తే.. రేవంత్‌రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాల‌న్నారు. పాలన అంటే బూతులు మాట్లాడటం, భూములు అమ్ముకోవడమేనా? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ సమరభేరిలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో శుక్ర‌వారం నిర్వ‌హించిన వంటావార్పులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం కమీషన్లు రావనే కేసీఆర్ సంక్షేమ పథకాలన్నింటికీ మంగళం పాడుతున్నారు. రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ఏం జరిగిందని చూస్తే.. అంతా కబ్జాలు, కుంభకోణాలు, లూటీలు, సెటిల్‌మెంట్లే తప్ప పాలన ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమం పూర్తిగా బందైపోయింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల కమీషన్లు రావన్న ఒకే ఒక్క కారణంతో వాటన్నింటినీ రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఎత్తేసింది.

రైతుబంధు నిర్వీర్యమైంది, రైతుబీమా ఎగ్గొట్టారు, కేసీఆర్ కిట్ బంద్ చేశారు, గొర్రెల పంపిణీ పథకం ఆపేశారు, చేప పిల్లల పథకాన్ని గాలికొదిలేశారు, బీసీ బంధు జాడ లేదు, దళితబంధు పత్తా లేకుండా పోయింది. రేవంత్ పాలన అంతా కేవలం కమీషన్ల చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల ముందు వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, అవ్వాతాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాట తప్పకుండా రూ. 200 ఉన్న పెన్షన్‌ను మొదటి నెలలోనే రూ. 2,000 చేసిన గొప్ప నాయకుడు.

కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 33 నెలలు పూర్తయినా.. ఒక్క వికలాంగుడికి, ఒక్క వితంతువుకి, ఒక్క వృద్ధుడికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కేసీఆర్ ఏకంగా 42 లక్షల మంది పేదలకు నెలనెలా రూ. 2,000 గౌరవప్రదంగా పెన్షన్ అందిస్తే.. రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ఉన్నవాటిలో ఏకంగా మూడున్నర లక్షల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల కడుపు కొట్టాడు.

రేవంత్ రెడ్డి నిత్యం ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అంటాడు, ఆయన గురువు గారిని ఆదర్శంగా తీసుకుంటానని చెబుతాడు. మరి నీ గురువు గారు ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన మొదటి నెలలోనే రూ. 4,000 పెన్షన్ ఇస్తున్నప్పుడు.. 33 నెలలైనా నువ్వు తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదు? వృద్ధుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కార్‌ను నిలదీస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే.. గత 33 నెలలుగా నెలకు రూ. 2,000 చొప్పున ఇప్పటివరకు ప్రతి అవ్వకు, తాతకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ. 66,000 బాకీ పడింది.

ఎన్నిక‌ల నాటికి మ‌ర్చిపోత‌ర‌ని పెంచుత‌లేర‌ట‌..

ఇప్పుడే పెన్షన్లు పెంచితే ఎన్నికల నాటికి మర్చిపోతారట.. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందో, మూడు నెలల ముందో రూ. 4,000 చేస్తామని రేవంత్ రెడ్డి జాదా ఉషారు, అతితెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు నీకంటే తెలివైనవాళ్లు. ఎన్నికల ముందు నువ్వు ఇచ్చినా తీసుకుంటారు, కానీ బాకీ పడ్డ మొత్తం రూ.66 వేలు లెక్క తేల్చిన తర్వాతే రేవంత్ రెడ్డిని నిలదీస్తారు.

రేవంత్ రెడ్డి పాలన అంతా గాలి మాటలకే పరిమితమైంది. అయితే బూతు పురాణం మాట్లాడటం, లేదంటే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్ముకోవడం.. ఇంతకుమించి ఈ ప్రభుత్వంలో ఇంకేమైనా పాలన ఉందా? కనబడ్డ దేవుళ్ల మీదల్లా ఒట్లు పెట్టి.. చివరికి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను నట్టేట ముంచారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో మోసాలు, కుంభకోణాలు, ప్రమాణాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ రోజురోజుకూ పతనమవుతోంది.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో సాంకేతికంగా వాళ్లు గెలిచినా.. నైతిక విజయం బీఆర్ఎస్‌దే, ప్రజలు మనవైపే ఉన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రెండేళ్లు కష్టపడి పనిచేసి, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. భవిష్యత్తు ముమ్మాటికీ బీఆర్ఎస్‌దే.. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. బెల్లంపల్లిలో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement