త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | అరగుంట అక్రమం అని తేలినా ముక్కు నేలకు రాస్తా

KLI పంపులు నడపకపోతే 12న నార్లపూర్ ముట్టడిస్తాం! నా భూముల్లో అరగుంట అక్రమం తేలినా ముక్కు నేలకు రాస్తానంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

J

Telangana | Published On Oct 7, 2026, 3.46 pm IST

Singireddy Niranjan Reddy | అరగుంట అక్రమం అని తేలినా ముక్కు నేలకు రాస్తా

సంక్షిప్త సారాంశం

కల్వకుర్తి (KLI), జూరాల నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలని, లేకుంటే ఈ నెల 12న వేలాది మంది రైతులతో నార్లపూర్ పంపులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు, అధికారుల నిర్వహణ లోపం వల్ల మోటార్లు, పంపులు కాలిపోయి 6 నుంచి 7 లక్షల ఎకరాల పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫామ్‌హౌస్‌లో అరగుంట భూమి ఆక్రమించినట్లు తేలినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని మంత్రులు పొంగులేటి, ఎమ్మెల్యే కృష్ణారావులకు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గత ప్రభుత్వంలో వలసలు లేవని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులకు నీరు, యూరియా, రుణమాఫీ, రైతుభరోసా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

Advertisement
  • 12న నార్లపూర్ పంపుల ముట్టడి
  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

Singireddy Niranjan Reddy | త్రినేత్ర న్యూస్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, ప్రభుత్వం రైతులను ఆదుకోవడం మానేసి తనపై తప్పుడు ఆరోపణలతో వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLI) పంపులను నిరంతరం నడిపి, జూరాల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయకపోతే ఈ నెల 12వ తేదీన వేలాది మంది రైతులతో కలిసి నార్లపూర్ పంపులను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతాంగానికి అరిగోస

ప్రకృతి కరుణించి జలాశయాల్లో సరిపడా నీరు చేరినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతాంగం విలవిలలాడుతోందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జూరాలలో 9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, ప్రజల ఒత్తిడి తెచ్చాకే సర్దుబాటు చేశారని మండిపడ్డారు. KLI పరిధిలో 70 టీఎంసీల నీరు ఉందని, పంపులు 802 అడుగుల అట్టడుగున ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని నిలదీశారు. కేవలం 9 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా, మిగిలిన నీటిని ఎత్తిపోసే సామర్థ్యం లేక ప్రభుత్వం తాగునీటి సాకుతో తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు.

నిర్వహణ లోపం.. కాలిపోతున్న మోటార్లు

KLI పరిధిలోని 30 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు ప్రభుత్వ నిర్లక్ష్యం, కరెంట్ కోతల వల్ల మరమ్మతులకు గురవుతున్నాయని ఆయన వివరించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల బేరింగులు, థ్రస్ట్ ప్యాడ్స్ (Thrust pads) పాడై స్టార్టర్లు, మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో 11 లక్షల ఎకరాల్లో పంటలు పండగా, ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం 6 లక్షల ఎకరాలకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొందన్నారు. సగటున గ్రామానికి రూ. 6 కోట్ల విలువైన పంట ఆధారపడి ఉందని, కేఎల్ఐ పరిధిలోని 3 పంపులు పూర్తిస్థాయిలో నడిపితే పంటలు కాపాడటంతో పాటు చెరువులు, కుంటలను నింపవచ్చని స్పష్టం చేశారు. నార్లపూర్ నుంచి ఏలూరుకు లింక్ ఉన్నప్పటికీ పంపులను ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు.

రైతు సమస్యలపై సోయి లేదు.. వలసలు మళ్లీ మొదలయ్యాయి

కరెంటు, సాగునీరు, యూరియా, రుణమాఫీ, రైతుభరోసాపై ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు నుంచి వలసలు ఆగిపోతే, రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ ప్రజలు వలసబాట పడుతున్నారని ఆరోపించారు. ఎల్‌నినో కమిటీ సూచనల మేరకు ఇంకుడు గుంతలు, బావులు తవ్వుకోవాలని రైతులకు సూచిస్తే, కేసీఆర్ బావి నిర్మిస్తే నానా యాగీ చేశారని మండిపడ్డారు.

నా ఫామ్‌హౌస్‌లోనే భోజనాలు పెడతా.. మీడియా సాక్షిగా రండి: ఓపెన్ చాలెంజ్

రైతుల సమస్యలపై ప్రశ్నిస్తున్న తనపై ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు దిగడం చేతకానితనానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. "మంత్రి పొంగులేటి గారు, ఎమ్మెల్యే కృష్ణారావు గారు.. మీ కలెక్టర్లు, అధికారులతో రండి. నా పానగల్ వ్యవసాయ క్షేత్రంలోనే టెంట్లు వేసి భోజనం కూడా పెడతా. ముందస్తు సమాచారం ఇచ్చి రండి, బహిరంగ చర్చకు నేను సిద్ధం" అని సవాల్ విసిరారు.

రాష్ట్ర మీడియా, అధికారుల సమక్షంలో తన ఆస్తుల్లో కనీసం అరగుంట అక్రమమని తేలినా ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. గతంలో 90 ఎకరాల ప్రభుత్వ భూమి అన్నారని, చివరికి 19 గుంటలని తేల్చారని, సర్వే నంబర్ 663 (ఉబేదుల్లా కొత్వాల్ భూమి)లో భూతద్దం పెట్టి వెతికి తన కుమార్తెకు చెందిన అరగుంట అక్రమం అన్నారని నిలదీశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు రాయిస్తున్నారని, సీఎంవో నుంచి మళ్లీ సర్వేకు ఆదేశించారని పేర్కొంటూ.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై న్యాయపరంగా పోరాడతానని హెచ్చరించారు.

రాజకీయ త్యాగాలను మరిచి మాట్లాడొద్దు

తన సంపాదన చట్టబద్ధమైనదని, కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. "కృష్ణారావు.. పుట్టుకతోనే నువ్వు ఆగర్భ శ్రీమంతుడివా? నీ చరిత్ర నాకు తెలుసు. నా రాజకీయ త్యాగం వల్లే నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, అది గుర్తుంచుకో" అంటూ మండిపడ్డారు. అసూయ, కుయుక్తులతో రాజకీయ మనుగడ సాగించలేరని, దమ్ముంటే తన సవాలును స్వీకరించి చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, బి. లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్ (జిల్లా మీడియా కన్వీనర్), కృష్ణా నాయక్, మాణిక్యం, వనం రాములు, రాళ్ల కృష్ణయ్య, గంధం పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Also Read | చిత్త‌శుద్ధి ఉంటే ఫోర్త్ సిటీలో అమ‌రుల కాల‌నీ క‌ట్టు

Advertisement
Advertisement