Next CM of Telangana | నెక్స్ట్ సీఎం ఎవరు?
2034 దాకా నేనే సీఎం అని రేవంత్.. కాదు బీసీనే సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్! తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన నయా పవర్‌వార్ పూర్తి వివరాలివే.
సంక్షిప్త సారాంశం
2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటిస్తుండగా, వచ్చేసారి బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం కలకలం రేపింది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీ పదవుల్లో, కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచుతామని శంషాబాద్ ఓబీసీ సభలో మహేష్ గౌడ్ ప్రకటన చేశారు. 15 మంది మంత్రుల్లో ఇద్దరే బీసీలని, 200 కార్పొరేషన్లలో కేవలం 41 మాత్రమే ఇచ్చి బీసీ సీఎం అంటే ఎలా నమ్మాలని విపక్షాలు సూటి ప్రశ్న వేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, టికెట్ల ఖరారుతో రేవంత్ తన పట్టు నిరూపించుకుంటున్న వేళ తెరపైకి వచ్చిన ఈ నినాదం పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది.
- 2034 వరకు తానే సీఎంను..అంటూ పలు వేదికలపై బహిరంగ ఉపన్యాసాలు
- బీసీయే సీఎం అవుతారంటూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు
- కాంగ్రెస్ లో రోజురోజుకూ బలపడుతున్న బీసీ నినాదం
- అయినా.. అగ్రవర్ణాలకే కీలక పదవులు
- 15 మంది మంత్రుల్లో ఇద్దరే బీసీలు
- 11 ఎమ్మెల్సీల్లో కూడా బీసీలు ఇద్దరే
- 200 కార్పొరేషన్లలో 41 మాత్రమే బీసీలకు
- కాంగ్రెస్ బీసీ నినాదంలో బలమెంత?
Next CM of Telangana | త్రినేత్ర న్యూస్ : నెక్స్ట్ సీఎం ఎవరు? ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పదే పదే చెబుతున్నట్టుగా రేవంత్ రెడ్డి తిరిగి పీఠమెక్కుతారా? లేదా రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? లేదా ..బీసీ సామాజిక వర్గాలను సంతృప్తి పరిచేందుకు వీలుగా.. కాంగ్రెస్ రూటు మార్చనుందా? ఈ సారి బీసీ యే ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర చర్చ మొదలైంది.
Also Read | సీఎం రేవంత్ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి
2034 వరకు నేనే సీఎంను
2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా పదే పదే బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు. వే టు న్యూస్ కాన్ క్లేవ్, మహబూబ్ నగర్ బహిరంగ సభ, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశంలో.. ఆ విషయాన్ని ఆయన పదే పదే ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ముందే ఖరారు చేస్తున్నారు. మరోవైపు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యల కోసం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన ఘటనలో.. మంత్రి కొండా సురేఖను ఏకంగా బర్తరఫ్ చేశారు. పార్టీలోనే అత్యంత సీనియర్ అయిన చిన్నారెడ్డి కూడా ప్రణాళిక సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో.. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ముద్ర వేసుకోగలిగారు. అందులో భాగంగానే..ఇటీవలి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులుగా ..తాను ప్రతిపాదించిన పేర్లనే అధిష్టానం వద్ద ఆమోద ముద్ర వేయంచుకోగలగడం గమనార్హం.
ఇదీ చదవండి | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి
ఈ సారి సీఎం బీసీయే
తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడని ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని.. అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. బీసీలది న్యాయమైన కోరిక అని అన్నారు. బీసీలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండగా ఉంటారని చెప్పారు. శంషాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు.
"తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపథంగా చెబుతున్నా. రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన ధైర్యంతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నా. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం" అని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కలవరాన్ని సృష్టించాయి.
Also Read | కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు
బీసీ నినాదంలో బలమెంత?
కాగా, మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. బీసీలను సంతృప్తి పరచడానికి తప్ప.. బీసీయే సీఎం అవుతాడని ఆయన చేసిన వ్యాఖ్యల్లో పెద్దగా సత్తా లేదని చెబుతున్నారు. ఇటవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2 ఎమ్మెల్సీ సీట్లలో రెండింటికి రెండు రెడ్లకే ఇవ్వడం బీసీ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే..బీసీ వర్గాలను సమాధానపరిచేందుకే కాంగ్రెస్..హడావుడిగా ఓబీసీ సమావేశం పెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి. "రాష్ట్ర మంత్రి వర్గంలో 17 మంది మంత్రులకు గాను 2 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 15 మందిలో ఇద్దరు మంత్రులు మాత్రమే బీసీలు. అంతేకాదు..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు 11 మంది ఎమ్మెల్సీ పదవులను నింపితే అందులో మూడే మూడు సీట్లు బీసీలకు ఇచ్చారు. నిన్నామొన్న ప్రకటించిన రెండు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇద్దరూ రెడ్లే. 200 కార్పొరేషన్ల పదవులు ప్రకటిస్తే అందులో 41 మాత్రమే బీసీలకు ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతిపాదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకు ఇవ్వకుండా ఏ చట్టం అడ్డు వస్తున్నది? ఇదే రిజర్వేషన్ ను మంత్రి వర్గంలో ఎందుకు అమలు చేయరు? కాంగ్రెస్ చెబుతున్న మాటలకు.. ఆచరణకు అస్సలు పొంతనే లేదు" అని బీఆర్ ఎస్ నేత దూదిమెట్ల బాల రాజ్ యాదవ్ ప్రశ్నించారు. బీసీలపై ప్రేమలేని కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తుందంటే.. అది ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెప్పారు.
Also Read | రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్.. సచివాలయంలో మంచినీటి సరఫరా బంద్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పారిస్ ఫ్యాషన్ షోలో జాన్వీకపూర్ అందాల విందు
- ●Rahul Gandhi | బీజేపీకి మేలు చేసేందుకే : ఫారం 6 ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా మార్చారు
- ●Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
- ●Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
- ●ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు
- ●Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్

Janhvi Kapoor | పారిస్ ఫ్యాషన్ షోలో జాన్వీకపూర్ అందాల విందు

Rahul Gandhi | బీజేపీకి మేలు చేసేందుకే : ఫారం 6 ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా మార్చారు

Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు

Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు





