త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కేనా నిధుల‌న్నీ..? తెలంగాణ‌పై వివ‌క్ష త‌గ‌దు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్‌

Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఆరోపించారు.

D

Telangana | Published On Mar 10, 2026, 2.31 pm IST

Ponnam Prabhakar | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కేనా నిధుల‌న్నీ..? తెలంగాణ‌పై వివ‌క్ష త‌గ‌దు.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్‌
Advertisement

Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి (Kishan Reddy), బండి సంజ‌య్ (Bandi Sanjay)కి పొన్నం ప్ర‌భాక‌ర్ బ‌హిరంగ లేఖ (open letter) రాశారు. కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు కేంద్రం ద‌య కాదు.. తెలంగాణ హ‌క్కు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ప‌న్నులు చెల్లిస్తున్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో తెలంగాణ‌కి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రులు చ‌ర్చించాల‌న్నారు.

ఏపీకేనా నిధుల‌న్నీ..?

ప‌క్క‌రాష్ట్రం ఏపీకి ప్ర‌తి బ‌డ్జెట్‌లోనూ కేంద్ర ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. దాన్ని తాము వ్య‌తిరేకించ‌డం లేద‌ని.. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో స‌గం నిధులైనా తెలంగాణ‌కు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌లు, రాజ‌కీయాలు వేర‌ని.. రాష్ట్రాభివృద్ధిపై వివ‌క్ష వ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. కేంద్రంతో కొట్లాడైనా రాష్ట్రానికి నిధులు సాధించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల న్యాయ‌మైన డిమాండ్ల‌ను విస్మ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు.

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

న‌రేంద్ర మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని పొన్నం మండిప‌డ్డారు. స‌మాఖ్య స్ఫూర్తిని దెబ్బ‌తీస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ్యాంగంలో పొందుప‌రిచిన స‌మాఖ్య స్ఫూర్తి ల‌క్ష్యాన్ని గౌర‌విస్తూ రాష్ట్రాల‌కు ప‌న్నుల వాటాలో న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల్లో కేంద్రం త‌న వాటాను త‌గ్గించుకుంటుంద‌ని.. త‌ద్వారా రాష్ట్రాల మీద భారాలు మోపుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇది స‌రైంది కాద‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర వాటా 90% ఉండే విధంగా పునరుద్ధరించాల‌ని డిమాండ్ చేశారు.

పొన్నం డిమాండ్లు ఇవీ..

కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు గత పదిహేనేళ్లుగా నామమాత్రంగా ఇస్తున్నది కేంద్రం.. ఆయా మొత్తాలను పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలి. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ‌కు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పురుడుపోసుకున్న తెలంగాణ‌కు కేంద్రం చేయూత‌నందించాలి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2కి రూ. 24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. దీనికి కేంద్రం 50శాతం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అదేవిధంగా మూసీ న‌ది పున‌రుద్ధ‌ర‌ణ ప్రాజెక్టు, రివ‌ర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర సాయం చేయాలి.

హైద‌రాబాద్ చుట్టూ 300 కిలోమీట‌ర్ల భారీ రింగ్ రోడ్ ఉత్త‌ర భాగానికి కొంత అనుమ‌తి వ‌చ్చినా.. ద‌క్షిణ భాగం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌కు కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ నుంచి పూర్తి ఆమోదం అవ‌స‌రం. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలోనే బయ్యారం స్టీల్ ప్లాంట్ వ‌ద్ద ఉక్కు కర్మాగారానికి ఇచ్చిన‌ హామీ ఇప్ప‌టికీ నెర‌వేర‌లేదు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ పూర్తిస్థాయిలో అమ‌లు కాలేదు. 2013లో ప్ర‌తిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ‌కు ప్ర‌క‌టించాలి.

రాష్ట్రానికి కొత్త జాతీయ ర‌హ‌దారుల‌ను ప్ర‌క‌టించాలి. తెలంగాణ‌లో మ‌రో AIIMS స్థాయి మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి. రామప్ప, యాదాద్రి ఆలయాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసే లేదు. ఒక్క ప్రాజెక్టుకూ ఆర్థిక సహాయం చేయడం లేదు. పార్లమెంట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేత‌లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయినా, తెలంగాణ‌పై ఈ వివ‌క్ష త‌గ‌ద‌ని పొన్నం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Also Read..

లోక్‌స‌భ స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం.. 10 గంట‌ల‌పాటూ కొన‌సాగ‌నున్న చ‌ర్చ‌

హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ నూతన గవర్నర్

మిలియన్‌ మార్చ్‌కు నేటితో 15 ఏళ్లు పూర్తి.. కీలకమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్‌

Advertisement
Advertisement