త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | ట్వీట్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు సార్‌.. సీఎం రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించండి.. మ‌న్నె క్రిషాంక్‌

Manne Krishank | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్ర‌మాల‌పై కేవ‌లం ట్వీట్లు చేస్తే స‌రిపోద‌ని బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిషాంక్ (Manne Krishank) వ్యాఖ్యానించారు. ఆయా అంశాల‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న ట్వీట్ పెట్టారు.

D

Telangana | Published On Oct 5, 2026, 3.32 pm IST

Manne Krishank | ట్వీట్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు సార్‌.. సీఎం రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించండి.. మ‌న్నె క్రిషాంక్‌
Advertisement

Manne Krishank | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిషాంక్ (Manne Krishank) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్, ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌త రెండేళ్ల‌లో రూ.50 వేల కోట్ల‌కుపైగా ఆస్తులు కూడ‌బెట్టార‌ని ఆరోపించారు. అధికారాన్ని, ప‌ద‌విని దుర్వినియోగం చేస్తూ వ్యాపార ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

కాగా, దేశంలో జ‌రిగిన అన్ని ఎన్నిక‌లు పూర్తిగా అక్ర‌మ‌మంటూ (all elections illegal) కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆరోపించిన విష‌యం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సహా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంతా అక్ర‌మంగా ఎన్నికైన వారేన‌ని చెప్పారు. ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌పై అధికార బీజేపీ నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రులు, ఎంపీలు కూడా అక్ర‌మంగా ఎన్నిక‌య్యారా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) సైతం కాంగ్రెస్ చీఫ్‌కు ఇలాంటి ప్ర‌శ్నే వేశారు. కాంగ్రెస్ ఏటీఎం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అక్రమమేనా..? ఖర్గే జీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్ల మనసు గెలుచుకోవాలంటూ చుర‌క‌లంటించారు. అంతేగానీ భారత ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం స‌రికాదంటూ రిజిజు ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

కేవ‌లం ట్వీట్లు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు

కిర‌ణ్ రిజుజు ట్వీట్‌పై మన్నె క్రిషాంక్ స్పందించారు. కేవ‌లం ట్వీట్లు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్‌బీన్ ఫార్మా, మైండ్‌వాల్ట్, గీతా ఆటోమోటివ్, టెస్సరాక్ట్, స్వచ్ఛ బయో.. త‌దిత‌ర సంస్థ‌ల‌తో సీఎం కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయా అంశాల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌తో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

క్రిషాంక్ ఆరోప‌ణ‌లు

  • మెడికోవర్ హాస్పిటల్‌లో రేవంత్‌ బంధువులు, బినామీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా నిర్మించలేదు. కానీ మూడు మెడికోవర్ హాస్పిటల్స్‌ను ప్రోత్సహించారు. అసాధారణంగా, ఒక సంవత్సరంలోనే ఆసుపత్రి ఆదాయం 685.01 శాతం పెరిగింది. సహృదయ హెల్త్ కేర్ ద్వారా మెడికోవ‌ర్ సంస్థ‌ను రూ. 13,200 కోట్లకు విక్రయించి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చారు.
  • మాక్స్‌బీన్ ఫార్మా.. దీనికి ముఖ్య‌మంత్రి అల్లుడు గోలుగూరి సత్యనారాయణ రెడ్డి అధిపతిగా ఉన్నారు. గోలుగూరి కుటుంబంపై ఆర్థిక మోసాలు, బ్యాంకు రుణ ఎగవేతలకు సంబంధించి అనేక ఈడీ కేసులు ఉన్నాయి. ఫార్మా రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఈ కంపెనీ డైరెక్టర్లు, మెడికోవర్ ఆసుపత్రి డైరెక్టర్లు ఒక్కరే.
  • మైండ్‌వాల్ట్.. కాంగ్రెస్ స‌ర్కార్ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తుండగా సీఎం రేవంత్ కుమార్తె 2025లో ఈ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించారు. ఈ సంస్థ‌ ప్రస్తుతం భారీ కార్పొరేట్ పాఠశాలను నిర్మిస్తోంది. ఆసక్తికర విష‌యం ఏంటంటే.. మెడికోవర్, మాక్స్‌బీన్ డైరెక్టర్లు ఈ కంపెనీలో కూడా నైమిషారెడ్డితో పాటు డైరెక్ట‌ర్లుగా కొన‌సాగుతున్నారు.
  • గీతా ఆటోమోటివ్.. ముఖ్యమంత్రి రేవంత్ కుమార్తె కొరియా పర్యటనకు వెళ్లి హ్యుందాయ్ అధిపతులను కలిశారు... అప్పటి నుండి గీతా ఆటోమోటివ్స్ గీతా హ్యుందాయ్‌గా మారాయి. అది ఇప్పుడు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 5 భారీ కార్ షోరూమ్‌లుగా విస్తరించింది. ముఖ్యమంత్రి అంతర్జాతీయ పర్యటన వల్ల కుటుంబానికి ప్రయోజనం చేకూరిందే త‌ప్ప రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు.
  • టెస్సరాక్ట్.. తొమ్మితో త‌ర‌గ‌తి కూడా పాస్‌కాని రేవంత్ సోద‌రుడు కొండల్ రెడ్డి లక్ష రూపాయలతో ప్రారంభించిన షెల్ కంపెనీ ఇది. ఇప్పుడు ఛైర్మన్‌గా ఉంటూ ఏరోస్పేస్, డిఫెన్స్‌లో నిపుణుడినని చెప్పుకుంటున్న అతనికి.. ఫోర్త్ సిటీలో రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బహుమతిగా ఇచ్చారు. ఇది పదవి దుర్వినియోగం కాదా..?
  • స్వచ్ఛ బయో.. ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనకు కేవలం ఒక నెల ముందు ఆయ‌న సోద‌రుడు జగదీష్ ఈ కంపెనీని ప్రారంభించారు. ముఖ్యమంత్రి అధికారికంగా రూ. 1000 కోట్ల అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు. పెట్టుబడి పెట్టడానికి జ‌గ‌దీష్ ఈ రూ. 1000 కోట్లు ఎలా సంపాదించారు..? ఇది విచారణ జరపాల్సిన విషయం కాదా..? కేవ‌లం ట్వీట్లు చేస్తే స‌రిపోదు ఆయా అంశాల‌పై సమగ్ర విచారణ జరిపించాలి అని క్రిషాంక్ డిమాండ్ చేశారు.

Also Read..

తెలంగాణలో లండన్, బర్మింగ్‌హామ్ లాంటి ఆరు అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్‌లు

మేడిప‌ల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌

రూ.ల‌క్ష‌ల్లో బిల్లులు పెండింగ్‌.. సచివాలయంలో మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్‌

Advertisement
Advertisement