త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs SA final T20I | ఇండియా టీ20 సిరీస్ సిరీస్ గెలుచుకుంది: తిలక్–పాండ్యా బ్యాటింగ్, వరుణ్–బుమ్రా బౌలింగ్​ మెరుపులు

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ టీ20లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ 231/5 స్కోర్ చేసింది. వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో సౌత్ ఆఫ్రికాను 30 పరుగులతో ఓడించి భారత్ 3-1తో సిరీస్‌ను గెలుచుకుంది.

a

Sports | Published On Dec 20, 2025, 12.25 am IST

IND vs SA final T20I | ఇండియా టీ20 సిరీస్ సిరీస్ గెలుచుకుంది: తిలక్–పాండ్యా బ్యాటింగ్, వరుణ్–బుమ్రా బౌలింగ్​ మెరుపులు

సంక్షిప్త సారాంశం

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ 231/5 స్కోర్‌ను కాపాడుకుని దక్షిణాఫ్రికాను 201/8కు పరిమితం చేసింది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో మెరిసగా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా కీలక వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుని వరుసగా 10వ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది

Advertisement

India Seal T20 Series 3-1: Tilak Varma, Hardik Pandya, Varun Chakravarthy Shine Against South Africa

(త్రినేత్ర క్రీడా విభాగం)

అహ్మదాబాద్, డిసెంబర్ 19:
ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ టీ20 మ్యాచ్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. 231/5 భారీ స్కోరును కాపాడుకుని దక్షిణాఫ్రికాను 201/8కే పరిమితం చేసిన భారత్, 30 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీ20 సిరీస్‌లలో వరుసగా 10వ సిరీస్ విజయం నమోదు చేసి భారత్ తన స్థిరత్వాన్ని మరోసారి రుజువు చేసింది.

ఈ మ్యాచ్ రెండు జట్లకు 2025లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ పోరు అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించింది.

తిలక్–పాండ్యా మెరుపులతో 231/5… భారత్ బ్యాటింగ్ ఆధిపత్యం

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు భారత్ బ్యాటర్లు తొలి నుంచే బాదుడు రుచి చూపించారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు అందించగా, మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించినట్లు కనిపించింది. అయితే ఆ దశలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పారు.

తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, హార్దిక్ పాండ్యా సుడిగాలిలా చెలరేగి కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. తొలి ఏడు బంతుల్లోనే 31 పరుగులు సాధించిన హార్దిక్, ఇండియా తరపున రెండో అత్యంత వేగవంతమైన టీ20 ఫిఫ్టీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో  నలుగురు భారత బ్యాటర్లు మొదటి బంతికే బౌండరీ బాదడం ఈ మ్యాచ్‌లో భారత్ దూకుడుకు నిదర్శనంగా నిలిచింది. చివర్లో శివం దూబే సిక్స్, ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇచ్చాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 231/5 భారీ స్కోర్ సాధించింది.

వరుణ్ స్పిన్ మాయ, బుమ్రా క్లాస్‌తో సౌతాఫ్రికా ఛేదన విఫలం

Indian players celebrate a wicket as Varun Chakravarthy and Jasprit Bumrah shine against South Africa in final T20I

4 ఓవర్లలో 52 పరుగులిచ్చినా, నాలుగు కీలక వికెట్లు తీసిన వరుణ్​ చక్రవర్తి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు (ఫోటో : espncricinfo)

232 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో భారత్‌కు గట్టి సవాల్ విసిరింది. క్వింటన్ డి కాక్ (65), డివాల్డ్ బ్రెవిస్ కలిసి డ్యూ సహాయంతో 10 ఓవర్లలోనే స్కోర్‌ను 118/1కి తీసుకెళ్లారు. ఈ దశలో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు తిరుగుతున్నట్లు కనిపించినా, మారిన బంతితో భారత్ బౌలర్లు తిరిగి అద్భుతంగా లయ అందుకున్నారు. వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయతో నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. మొత్తం మ్యాచ్‌లో 432 పరుగులు నమోదైనప్పటికీ, బుమ్రా కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు తీసి రెండు జట్ల మధ్య అసలైన తేడాగా నిలిచాడు. చివర్లో మార్కో జాన్సెన్ వరుసగా రెండు సిక్సర్లతో ఉత్కంఠ కలిగించినా, అప్పటికే పరాజయం ఖరారు కావడంతో సౌతీలు వెనుదిరగాల్సివచ్చింది.

స్కోర్‌కార్డ్

ఇండియా ఇన్నింగ్స్:
సంజూ శాంసన్ 37 (22 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) – b జార్జ్ లిండే; అభిషేక్ శర్మ 34 (21 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) – c డి కాక్ b కార్బిన్ బాష్; తిలక్ వర్మ 73 (42 బంతులు, 10 ఫోర్లు, 1 సిక్స్) – రనౌట్ (డి కాక్/బార్ట్‌మన్); సూర్యకుమార్ యాదవ్ 5 (7 బంతులు) – c మిల్లర్ b కార్బిన్ బాష్; హార్దిక్ పాండ్య 63 (25 బంతులు, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) – c హెండ్రిక్స్ b ఆట్నీల్ బార్ట్‌మన్; శివం దూబే 10* (3 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్); జితేష్ శర్మ 0*.
ఎక్స్‌ట్రాలు: 9 (లెగ్‌బై 3, వైడ్ 6).
మొత్తం: 20 ఓవర్లలో 231/5.
వికెట్ల పతనం: 63, 97, 115, 220, 227.

సౌత్ ఆఫ్రికా బౌలింగ్:
లుంగి ఎన్‌గిడి 4–0–29–0; మార్కో జాన్సెన్ 4–0–50–0; ఆట్నీల్ బార్ట్‌మన్ 3–0–39–1; కార్బిన్ బాష్ 3–0–44–2; డొనోవన్ ఫెర్రెయిరా 2–0–20–0; జార్జ్ లిండే 4–0–46–1.

సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్:
క్వింటన్ డి కాక్ 65; డీవాల్డ్ బ్రెవిస్ 42; డేవిడ్ మిల్లర్ 31; మార్కో జాన్సెన్ 21; ఇతరులు విఫలం.
మొత్తం: 20 ఓవర్లలో 201/8.

ఇండియా బౌలింగ్:
వరుణ్ చక్రవర్తి 4–0–53–4; జస్ప్రీత్ బుమ్రా 4–0–17–2; అర్ష్‌దీప్ సింగ్ 4–0–41–1; వాషింగ్టన్ సుందర్ 4–0–36–1.

ఫలితం: ఇండియా 30 పరుగులతో విజయం (సిరీస్ 3–1).

సిరీస్ భారత్‌దే… టీ20ల్లో కొనసాగుతున్న ఆధిపత్యం

టెస్టు సిరీస్‌ను సౌత్ ఆఫ్రికా 2-0తో గెలిచినా, వన్డే, టీ20ల్లో మాత్రం భారత్ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. గత రెండేళ్లుగా భారత్ టీ20 సిరీస్‌లలో ఓటమి లేకుండా కొనసాగుతుండగా, ఈ పదో విజయం ఆ స్థిరత్వానికి మరో ముద్ర వేసింది. ​ఈ విజయంతో భారత జట్టు 2025 అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ఘనంగా ముగించింది.

నేడే టి20 ప్రపంచకప్​కు భారత జట్టు ఎంపిక

కాగా, 2026 ఫిబ్రవరి 7 నుండి భారత్​–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టి20 ప్రపంచకప్​కు భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో బిసిసిఐ రేపు ముంబయిలో సమావేశం కానుంది. 2026 జనవరి 21 నుండి దాదాపు ఇదే జట్టుతో స్వదేశంలో న్యూజీల్యాండ్​తో టి20 సిరీస్​ ఆడనున్న భారత్​, ప్రపంచకప్​లో కూడా వీరే అధికంగా ఉండే అవకాశముంది. వరల్డ్​కప్​కు ఎంపిక ముందు సాక్షాత్తు వైస్​ కెప్టెన్​ శుభ్​మన్​ గిల్​ పేలవ ఫామ్​ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత 18 ఇన్నింగ్స్​లో ఒక్క అర్థ సెంచరీ లేని గిల్​, ఈ దక్షిణాఫ్రికా సిరీస్​లో 4, 0, 28 పరుగులు సాధించి నిరాశపరిచాడు. కాగా, సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నమెంట్లో దుమ్మురేపిన కీపర్​–బ్యాటర్​ ఇషాన్​ కిషన్​ గిల్​కు గట్టిపోటీనివ్వనున్నాడు. 517 పరుగులు, 33 సిక్సులు, 197 స్ట్రైక్​రేట్​తో ఇషాన్​ ఆ టోర్నమెంట్​లో అదరగొట్టాడు. కానీ మూడు ఫార్మాట్లలో గిల్​ను కెప్టెన్​గా కొనసాగించాలనే బోర్డు నిర్ణయం ఇషాన్​కు షాక్​ ఇవ్వొచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement