త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పులు.. ఫీల్డింగ్ కోచ్‌గా రాజీవ్ కుమార్..

IPL 2027 | ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు కోచింగ్‌ విభాగాన్ని ప‌టిష్టం చేసుకుంటున్న‌ది. ఇందులో భాగంగా మాజీ జార్ఖండ్ క్రికెటర్ రాజీవ్ కుమార్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

P

Sports | Published On Nov 25, 2026, 9.45 pm IST

IPL 2027 | పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పులు.. ఫీల్డింగ్ కోచ్‌గా రాజీవ్ కుమార్..
Advertisement

IPL 2027 | ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు కోచింగ్‌ విభాగాన్ని ప‌టిష్టం చేసుకుంటున్న‌ది. ఇందులో భాగంగా మాజీ జార్ఖండ్ క్రికెటర్ రాజీవ్ కుమార్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. రాజీవ్ కుమార్ గతంలో ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశారు. 2018 నుంచి 2026 వరకు ఎనిమిది సీజన్ల పాటు ఆ జట్టుతో కొనసాగారు. గత నెలలో సీఎస్‌కే కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేపట్టడంతో ఆయన జట్టును వీడారు. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఆయన అనుభవం పంజాబ్ ఫీల్డింగ్ విభాగాన్ని మెరుగుపరచడంతో పాటు ఆటగాళ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ పేర్కొంది.

బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే

జేమ్స్ హోప్స్ స్థానంలో పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ తరఫున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన ఆయన.. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున పలు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించారు. 2021 నుంచి 2024 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉండగా.. భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇండియా-ఏ, ముంబై ఇండియన్స్, దేశవాళీ జట్లతోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2026 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్‌ను వీడిన మాంబ్రే.. ప్రస్తుతం దుబాయ్ ఐఎల్‌టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.

మళ్లీ రికీ పాంటింగ్‌తో కలిసి..

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి మాంబ్రే మరోసారి పనిచేయనున్నాడు. గతంలో ముంబ‌యి ఇండియన్స్ కోచింగ్ బృందంలో వీరిద్దరూ భాగస్వాములుగా ఉన్నారు. 2015లో ముంబ‌యి ఇండియన్స్ టైటిల్ గెలిచిన సమయంలోనూ కలిసి పనిచేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐపీఎల్‌ 2027 బరిలోకి దిగేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తోంది. జట్టులో 19 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ.. డిసెంబర్ 16న గోవాలో జరిగే వేలంలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయనుంది. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటుంది. వేలం కోసం పంజాబ్‌ వద్ద రూ.18.60 కోట్ల పర్స్‌ మిగిలి ఉంది. మరోవైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో జట్టు మరింత ప‌టిష్ట‌మైంది.

Advertisement
Advertisement