త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi Sharma | వైష్ణ‌వి శర్మ జాత‌కాన్ని ఆనాడే చెప్పిన తండ్రి.. అనుకున్న‌ట్లే గొప్ప ప్లేయ‌ర్ అయింది..

Vaishnavi Sharma | భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు యువ ప్లేయ‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో, క్రికెట్ వ‌ర్గాల్లో ఈమె గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. యంగ్ ఏజ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్‌గా భార‌త మ‌హిళ‌ల సీనియ‌ర్ క్రికెట్ జ‌ట్టులోకి ఇటీవ‌లే ప్ర‌వేశించిన ఈమె త‌న టాలెంట్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

S

Sports | Published On Dec 31, 2025, 2.46 pm IST

Vaishnavi Sharma | వైష్ణ‌వి శర్మ జాత‌కాన్ని ఆనాడే చెప్పిన తండ్రి.. అనుకున్న‌ట్లే గొప్ప ప్లేయ‌ర్ అయింది..
Advertisement

Vaishnavi Sharma | భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు యువ ప్లేయ‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో, క్రికెట్ వ‌ర్గాల్లో ఈమె గురించి అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. యంగ్ ఏజ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్‌గా భార‌త మ‌హిళ‌ల సీనియ‌ర్ క్రికెట్ జ‌ట్టులోకి ఇటీవ‌లే ప్ర‌వేశించిన ఈమె త‌న టాలెంట్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. భారీ స్కోర్లు చేసిన మ్యాచ్‌లో సీనియ‌ర్ బౌల‌ర్ల క‌న్నా మెరుగ్గా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయ‌డ‌మే కాక‌, వికెట్లు తీసి అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకుంది. ఈ క్ర‌మంలోనే క్రికెట్ ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు సైతం అస‌లు వైష్ణ‌వి శ‌ర్మ ఎవ‌రు..? ఆమె ఏ రాష్ట్రం నుంచి వ‌చ్చింది..? ఎక్క‌డ నివాసం ఉంటుంది..? క్రికెట్ ప్ర‌పంచంలో ఆమె జ‌ర్నీ ఎలా సాగింది..? వంటి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

శిక్ష‌ణ కోసం ఇంటిని అమ్మేశారు..

వైష్ణ‌వి శ‌ర్మ మ‌ధ్యప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో జ‌న్మించింది. తండ్రి పేరు డాక్ట‌ర్ న‌రేంద్ర శ‌ర్మ‌. ఆయ‌న జ్యోతిష్యంలో పీహెచ్‌డీ చేశారు. జాతకాల‌ను చెబుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే వైష్ణ‌వి శ‌ర్మ జ‌న్మించిన‌ప్పుడు ఆమె జాత‌కాన్ని స్వ‌యంగా ప‌రిశీలించిన ఆయ‌న ఆమె ఒక గొప్ప క్రీడాకారిణి లేదా వైద్యురాలు అవుతుంద‌ని అంచనా వేశారు. అందులో భాగంగానే ఆయ‌న ఆమెను క్రీడ‌ల వైపు ప్రోత్స‌హించారు. ఆమెలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి అక్క‌డి తాన్‌సేన్ క్రికెట్ అకాడ‌మీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ అకాడమీ, గ్వాలియ‌ర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేష‌న్‌ల‌లో ఆమెకు శిక్షణ ఇప్పించాడు. అయితే కోవిడ్ స‌మ‌యంలో చేతిలో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆమె శిక్ష‌ణ కోసం ఆయ‌న ఇంటిని అమ్మేశారు. ఆ త‌రువాత అద్దె ఇంట్లో ఉంటున్నారు. కానీ ఏనాడూ వైష్ణ‌వి శ‌ర్మకు లోటు చేయ‌లేదు. ఆమె మేటి ప్లేయ‌ర్‌గా మారేందుకు ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రోవైపు వైష్ణ‌వి శ‌ర్మ కూడా అండ‌ర్ 14, అండ‌ర్ 16, అండ‌ర్ 19 జ‌ట్ల‌లో రాణించి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్‌గా పేరు తెచ్చుకుంది.

అండ‌ర్ 19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో..

జ‌న‌వ‌రి 2024లో మ‌లేషియాలో నిర్వ‌హించిన ఐసీసీ అండ‌ర్ 19 మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌లేషియాతో జ‌రిగిన మ్యాచ్‌లో వైష్ణ‌వి శ‌ర్మను తీసుకున్నారు. దీంతో అప్ప‌టి నుంచి ఆమె కెరీర్ చాలా వేగంగా మారింది. తొలి మ్యాచ్‌లోనే ఆమె హ్యాట్రిక్ వికెట్ల‌ను తీయ‌గా మొత్తం మ్యాచ్‌లో కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏకంగా 5 వికెట్ల‌ను తీసింది. దీంతో ఆమెకు ఒక్క‌సారిగా స్టార్ స్పిన్న‌ర్‌గా గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌రువాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అనంత‌రం నిర్వ‌హించిన దేశవాళీ మ‌హిళ‌ల సీనియ‌ర్ టీ20 మ్యాచ్ టోర్నీల్లోనూ స‌త్తా చాటింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, సెంట్ర‌ల్ జోన్ జ‌ట్ల‌కు ఆడిన ఆమె మొత్తం 9 మ్యాచ్‌ల‌లో 21 వికెట్ల‌ను తీసి అబ్బుర‌ప‌రిచింది. ఆ త‌రువాత ఆమెకు సీనియ‌ర్ మ‌హిళ‌ల జ‌ట్టులోకి పిలుపువ‌చ్చింది.

డబ్ల్యూపీఎల్ మిస్ అయినా..

అయితే సీనియర్ మ‌హిళ‌ల జ‌ట్టులో ఆమె చేర‌క‌ముందే న‌వంబ‌ర్ 27న నిర్వ‌హించిన డబ్ల్యూపీఎల్ వేలంలో చాన్స్ వ‌స్తుంద‌ని ఆమె ఆశించింది. రూ.10 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు అందులో ఆమె రిజ‌స్ట‌ర్ చేసుకుంది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమెను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌లేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఇక స‌రిగ్గా నెల రోజుల త‌రువాత ఆమెకు సీనియ‌ర్ జట్టులో చోటు క‌ల్పించారు. దీంతో డబ్ల్యూపీఎల్ మిస్ అయినా కూడా ఏకంగా సీనియ‌ర్ జ‌ట్టులో చోటు ద‌క్క‌డంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ త‌రువాత జ‌రిగిన‌దంతా అంద‌రికీ తెలిసిందే. శ్రీలంక‌తో జ‌రిగిన 5 టీ20ల సిరీస్‌లో ఆమె పాల్గొంది. అన్ని టీ20లు ఆడింది.

పొదుపుగా బౌలింగ్‌..

తొలి టీ20 మ్యాచ్‌లో భాగంగా డిసెంబ‌ర్ 22న లంక‌తో ఆమె సీనియ‌ర్ జ‌ట్టులోకి ప్ర‌వేశించ‌గా, అదే మ్యాచ్‌లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. వికెట్లు ద‌క్క‌క‌పోయినా 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చింది. ఆ త‌రువాత మ‌రో మ్యాచ్‌లో శ్రీలంక జ‌ట్టు భార‌త బౌల‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతుంటే వైష్ణ‌వి శర్మ మాత్రం చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది. 4 ఓవ‌ర్లు వేసిన ఆమె కేవ‌లం 24 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 2 వికెట్లు తీసింది. జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది. ఇక సిరీస్ మొత్తం మీద 5 టీ20ల‌లోనూ ఆడిన వైష్ణ‌వి శర్మ 119 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్ల‌ను సాధించ‌గా, ఆమె ఎకాన‌మీ కేవ‌లం 6.26గా న‌మోదైంది. టీ20ల‌లో ఎంత పొదుపుగా బౌలింగ్ చేస్తుందో ఆమె ఎకాన‌మీని బ‌ట్టి మ‌నం అర్థం చేసుకోవచ్చు. కాగా వైష్ణ‌వి శర్మ భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా మేటి స్పిన్న‌ర్ అవుతుంద‌ని, భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టుకు మ‌రెన్నో విజ‌యాలు అందిస్తుంద‌ని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement