Gig Workers Strike | అసలే కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్డర్స్ ఎక్కువగా జరిగే ఈ సమయంలో గిగ్ వర్కర్స్ మెరుపు సమ్మె నిర్వహిస్తుండటంతో ఫుడ్ ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు అయిన జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలపై చాలా ప్రభావం పడుతోంది. అందుకే.. జొమాటో, స్విగ్గీ సంస్థలు డెలివరీ పార్టనర్స్‌కి అదనపు పే ఇస్తామని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో డెలివరీ పార్టనర్‌గా న్యూ ఇయర్ ఆర్డర్స్ డెలివరీ చేసిన వారికి ఈ బంపర్ ఆఫర్‌ని ప్రకటించాయి. ఫెస్టివల్ టైమ్‌లో పని చేసే డెలివరీ బాయ్స్‌కి అదనపు పే అందుతుంది. డిసెంబర్ 31న సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల మధ్య పనిచేసే వర్కర్లకు ఒక ఆర్డర్‌పై కనీసం రూ.120 అదనంగా చెల్లిస్తామని ఆయా సంస్థలు ప్రకటించాయి. దీనికి సంబంధించిన సందేశాలను డెలివరీ ఏజెంట్లకు పంపిస్తామని తెలిపాయి. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో కూడా ఇదే తరహా ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె కొనసాగుతోంది. ఇఫ్పటికే డిసెంబర్ 25న ఒకసారి సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు, డిసెంబర్ 31న కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఆధ్వర్యంలో ఈ సమ్మెని నిర్వహిస్తున్నారు. తమకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని, 10 నిమిషాల్లో డెలివరీ అనే క్విక్ డెలివరీ ఆప్షన్‌ని తీసేయాలని ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లకు ఇచ్చే కమిషన్‌లో కోత విధించవద్దని కూడా డిమాండ్ చేస్తున్నారు.