MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : గ్రూప్-1 మూల్యాంకనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.. కానీ జేఎన్టీయూలో జరిగినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. శాసనమండలిలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలతో పాటు జీవో 46 బాధితులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1 పరీక్షతో పాటు జీవో 46 బాధితులకు సంబంధించి ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థుల ఉద్యమం, వారి త్యాగాల ద్వారా తెలంగాణను తెచ్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇవాళ గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కూడా సరిగ్గా జరగకపోవడంతో వారు కోర్టుల చుట్టు తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు, హైకోర్టు అంటూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకమైన అప్పీల్ చేస్తున్నాను. మన పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పి, లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వం ఈ సభ ద్వారా ఒక వైట్ పేపర్‌ను రిలీజ్ చేసి అసలు గ్రూప్-1 పరీక్షల ద్వారా జరిగిన లాభాలు ఏంటి..? నష్టాలు ఏంటి..? అని వెల్లడిస్తే బాగుంటుందన్నారు దాసోజు శ్రవణ్. ఎందుకు ఇవాళ విద్యార్థులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. కోట్ల రూపాయాలు పెట్టి ఖరీదైన లాయర్లతో వాదనలు వినిపిస్తున్నారు. వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని చెప్తారు. ఆర్టీఐ ప్రకారం జేఎన్టీయూలో మూల్యాంకనం జరిగినట్లు వెల్లడైంది. ఇది మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. సీజీజీలో జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.. జేఎన్టీయూలో జరిగిందని ఆర్టీఐ సమాధానం చెప్తుంది. అలా మన పిల్లలను, భవిష్యత్ తరాలను కోర్టుల చుట్టు తిప్పి నానారకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఎమ్మెల్సీ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జీవో 46 ఉన్న తప్పిదాలను సరిదిద్దుతాం అని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది. న్యాయం చేస్తామని వారిని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకుంది. దాంతో లక్షల మంది విద్యార్థులు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక జీవో 46పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. వారు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన పిల్లలను కోర్టుల చుట్టు తిరగనివ్వకుండా వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.