త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | నేడు న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌పై సుప్రీంకోర్టులో విచారణ‌.. ఢిల్లీలోనే రేవంత్ మ‌కాం..!

Telangana | తెలంగాణ ప్ర‌త్యేకంగా రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. కృష్ణా, గోదావ‌రి న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ‌, ఏపీకి మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

S

Telangana | Published On Jan 5, 2026, 7.47 am IST

Telangana | నేడు న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌పై సుప్రీంకోర్టులో విచారణ‌.. ఢిల్లీలోనే రేవంత్ మ‌కాం..!
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌త్యేకంగా రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. కృష్ణా, గోదావ‌రి న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ‌, ఏపీకి మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఓ వైపు కృష్ణా జ‌లాల‌పై ఇటీవ‌ల వివాదం మ‌ళ్లీ మొద‌టికి రాగా, మ‌రోవైపు గోదావ‌రి జలాల‌పై కూడా వివాదాలు మొద‌ల‌య్యాయి. ఏపీ ప్ర‌భుత్వం గోదావ‌రి న‌దిపై చేప‌ట్టిన పోల‌వ‌రం - న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ అనుసంధాన ప్రాజెక్టును స‌వాల్ చేస్తూ రేవంత్ స‌ర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధ‌మైంది. ఈ న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టుపై సోమ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలో గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు లో విచారణకు రానుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్నిఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.

అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్ కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది.

మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఈ పిటిషన్ లో స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో ప్రస్తావించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement