Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారంతో ముగియనున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణా నదీ జలాల వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో పవర్ పయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం చట్ట సవరణపై కూడా సభలో చర్చించారు. ఇక మిగిలింది హిల్ట్ పాలసీపైనే చర్చ. దీనిపై సోమవారం సభలో చర్చ నిర్వహించిన తదనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు గతేడాది డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు సంతాప తీర్మానాలతో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సభ తిరిగి జనవరి 2వ తేదీన ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో పాటు ఉపాధి హామీ పథకం చట్ట సవరణపై సభలో చర్చించారు. 3వ తేదీన కృష్ణా జలాల వివాదంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతో పాటు నదీ జలాల వివాదంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు.