త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP Draft Voter List | కులం, మ‌తం ఆధారంగా ఓటర్ల రికార్డులను నిర్వహించం.. సీఎం యోగి ఆరోప‌ణ‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఎన్నిక‌ల అధికారి

UP Draft Voter List | స‌ర్ ప్ర‌క్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నవదీప్ రిన్వా (Navdeep Rinwa) స్పష్టతనిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల రికార్డులను ఎప్పుడూ మతం లేదా కులం ఆధారంగా నిర్వహించదని స్పష్టం చేశారు.

D

National | Published On Nov 17, 2026, 4.23 pm IST

UP Draft Voter List | కులం, మ‌తం ఆధారంగా ఓటర్ల రికార్డులను నిర్వహించం.. సీఎం యోగి ఆరోప‌ణ‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఎన్నిక‌ల అధికారి
Advertisement

UP Draft Voter List | త్రినేత్ర న్యూస్ : 2027 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమ్మరీ రివిజన్ (SSR) కింద ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Voter List) మంగ‌ళ‌వారం విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో చేప‌ట్టిన‌ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్ర‌క్రియ‌తో పోలిస్తే తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమ్మరీ రివిజన్ (SSR) ద్వారా రాష్ట్రంలో కొత్త‌గా 18 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు పెరిగారు. ల‌క్నోలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మేర‌కు వివ‌రాల‌ను ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నవదీప్ రిన్వా (Navdeep Rinwa) వెల్ల‌డించారు.

SSR 2027 డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్ర‌కారం రాష్ట్రంలో మొత్తం 13.58 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు CEO నవదీప్‌ రిన్వా తెలిపారు. వీరిలో పురుషులు 7,38,58,510 మందికాగా, మ‌హిళా ఓట‌ర్లు 6.20 కోట్లుగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు (4042), యువ ఓటర్లు (11,83,352)గా ఉన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించ‌నున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. 2027 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే అర్హులు ఫారం-6 ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అభ్యంత‌రాల‌ను డిసెంబ‌ర్ 28 నాటికి పూర్తి చేసిన తుది ఎన్నిక‌ల జాబితాను జ‌న‌వ‌రి 4వ తేదీన ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఓటరు జాబితా అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని.. రివిజన్ ప్రక్రియ ముగిసి తుది జాబితా వెలువడిన తర్వాత కూడా అర్హులైన పౌరులు పేర్ల చేర్పులు, తొలగింపులు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,73,730 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 21, 22, 28, 29 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించ‌నున్న‌ట్లు చెప్పారు. బూత్ స్థాయి అధికారులు (BLO) ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.

సీఎం యోగి ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన అధికారి

అదేవిధంగా స‌ర్ ప్ర‌క్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల (Hindu voters) పేర్లను జాబితా నుంచి తొలగించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (CM Yogi Adityanath) చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టతనిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఓటర్ల రికార్డులను ఎప్పుడూ మతం లేదా కులం ఆధారంగా నిర్వహించదని స్పష్టం చేశారు.

ఓటర్ల డేటాబేస్‌లో ఓట‌రు పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయస్సు, ఇంటి నంబర్, లింగం వంటి వివరాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. మతం లేదా కులానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందులో ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఓటర్ల జాబితాలు బహిరంగ పత్రాలు కాబట్టి, కొన్ని మీడియా సంస్థలు లేదా విశ్లేషకులు పేర్లు, ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా స్వ‌యంగా డేటా విశ్లేష‌ణ చేస్తుంటార‌ని ఆయ‌న వివ‌రించారు. వాటిని ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలుగా పరిగణించకూడదని సీఈఓ నవ‌దీప్ రిన్వా పేర్కొన్నారు.

సీఎం ఆరోప‌ణ‌లు

కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సీఎం యోగి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ముఖ్య‌మంత్రి.. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ తర్వాత ఓటరు జాబితాలలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలో ఉన్న సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు.. భారత ఎన్నికల సంఘం (ECI) ఓటరు జాబితాలో లేవని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులుగా ఉన్న 55 ల‌క్ష‌ల మంది హిందూ ఓట‌ర్ల‌తోపాటూ 18-19 ఏళ్ల వ‌య‌సు గ‌ల దాదాపు 4.5 ల‌క్ష‌ల మంది యువ ఓట‌ర్లు స‌హా మొత్తం 66 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల పేర్లు జాబితా నుంచి గ‌ల్లంతైన‌ట్లు పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఒక మెమోరాండం సమర్పించిన‌ట్లు చెప్పారు.

Also Read..

వాహ‌న‌దారుల‌కు కీల‌క అల‌ర్ట్‌.. బీమా లేకుండా టోల్‌ప్లాజా దాటితే ఫోన్ల‌కు అల‌ర్ట్ మెసేజ్‌లు

కొత్త జేమ్స్‌బాండ్ ఇత‌డే - ఒక్కో సినిమాకు 235కోట్ల రెమ్యూన‌రేష‌న్‌

ప్ర‌భుత్వం ఉన్న‌ది పేద‌ల కోసం.. పెట్టుబ‌డిదారుల కోసం కాదు..

Advertisement
Advertisement