త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BY Polls | ఉప ఎన్నిక‌ల్లో ప‌ట్టు నిలుపుకున్న అధికార పార్టీలు.. త‌మిళ‌నాడులో టీవీకే ఘ‌న విజ‌యం

BY Polls | ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో (BY Polls) అధికార పార్టీలు త‌మ ప‌ట్టు నిలుపుకున్నాయి. త‌మిళ‌నాడు (Tamil Nadu)లో ధారాపురం, మ‌ధురాంత‌కం ఉప ఎన్నిక‌ల్లో టీవీకే అభ్య‌ర్థులు భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక ప‌శ్చిమ బెంగాల్‌లో రెజిన‌గ‌ర్‌, నందిగ్రామ్‌లో కాషాయ జెండా (BJP) రెప‌రెప‌లాడింది. అస్సాంలో నాగావ్ లోక్‌స‌భ స్థానాన్ని బీజేపీ ద‌క్కించుకుంది.

D

National | Published On Oct 9, 2026, 5.25 pm IST

BY Polls | ఉప ఎన్నిక‌ల్లో ప‌ట్టు నిలుపుకున్న అధికార పార్టీలు.. త‌మిళ‌నాడులో టీవీకే ఘ‌న విజ‌యం
Advertisement

BY Polls | త్రినేత్ర న్యూస్ : ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో (BY Polls) అధికార పార్టీలు త‌మ ప‌ట్టు నిలుపుకున్నాయి. త‌మిళ‌నాడు (Tamil Nadu) అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీవీకే (TVK) పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ధారాపురం (Dharapuram), మ‌ధురాంత‌కం (Madurantakam) స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో విజ‌య్ నేతృత్వంలోని టీవీకే భారీ మెజారిటీతో విజ‌యం సాధించింది. ధారాపురంలో టీవీకే అభ్యర్థి సత్యభామ తన సమీప డీఎంకే అభ్యర్థిపై సుమారు 9,471 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు మ‌ధురాంత‌కంలో కె. మరగాథం కుమారవేల్ 17 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

ఇటీవ‌లే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ఇద్దరు మహిళా నేత‌లు ఏఐఏడీఎంకే త‌ర‌ఫున గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే, టీవీకే అధికారంలో వ‌చ్చాక ఇద్ద‌రూ త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి విజ‌య్ పార్టీలో చేరారు. దీంతో అక్క‌డ ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఇప్పుడు రెండు చోట్లా టీవీకే త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో రాష్ట్రంలో టీవీకే త‌న ప‌ట్టు నిలుపుకుంది.

నందిగ్రామ్, రెజినగర్‌లో బీజేపీ గెలుపు

మ‌రోవైపు ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal)లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ అధికార బీజేపీ (BJP) భారీ మెజారిటీతో విజ‌యం సాధించింది. రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్య‌త ఉన్న నందిగ్రామ్‌, ముస్లిం మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన రెజిన‌గ‌ర్‌ (Rejinagar)లో కాషాయ జెండా రెప‌రెప‌లాడింది. నందిగ్రామ్‌ (Nandigram)లో మాజీ సీఎం మమతా బెనర్జీ మద్దతు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై బీజేపీ అభ్యర్థి హసిరాణి రాథ్ 1,22,753 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లో శంకరవ్ సర్కార్ 75,816 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో 294 స్థానాలున్న‌ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఆ పార్టీ బలం 209కి పెరిగింది.

ఈ గెలుపుపై సీఎం సువేందు అధికారి సంతోషం వ్య‌క్తం చేశారు. నందిగ్రామ్‌లో 80 శాతం మంది, రెజిన‌గ‌ర్‌లో 60 శాతానికిపైగా ముస్లిం ఓట‌ర్లు త‌మ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌త ఐదు నెల‌ల్లో నిర్బంధ కేంద్రాలు, మ‌త‌ప‌ర‌మైన ఆచ‌ర‌ణ‌ల‌పై ఆంక్ష‌లు విధించామంటూ ప్ర‌తిప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని ఈ ఎన్నిక‌ల‌తో తేలిపోయింద‌న్నారు.

నాగావ్ లోక్‌స‌భ స్థానం బీజేపీదే

అటు అస్సాంలో బీజేపీ విజ‌యం సాధించింది. నాగావ్ (Assams Nagaon) లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీజేపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థి దేవాశిష్ శర్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఏఐయూడీఎఫ్ (AIUDF) అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌పై 1,10,629 ఓట్లతో విజ‌యం సాధించారు. శ‌ర్మకు 4,20,705 ఓట్లు, అజ్మ‌ల్‌కు 3,10,076 ఓట్లు వ‌చ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శిబమోని బోరా 75,908 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Also Read..

రూ.60 వేలలోపు ల‌భిస్తున్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌.. ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు కూడా..

198 శాతం పెరిగిన పూల సాగు

50 శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేయ‌కుంటే అగ్గి రాజేస్తం

Advertisement
Advertisement