త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gauhati High Court | పాన్ కార్డు, ఓట‌రు ఐడీ భార‌తీయ పౌర‌స‌త్వానికి ఆధారాలు కావు.. గువాహ‌టి హైకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌

Gauhati High Court | పాన్ కార్డు (PAN Card), ఓటరు గుర్తింపు కార్డు (EPIC) మాత్రమే భార‌తీయ పౌర‌స‌త్వాన్ని (Indian Citizenship) నిరూపించ‌లేవ‌ని గువాహ‌టి హైకోర్టు (Gauhati High Court) స్ప‌ష్టం చేసింది. ఆధార్, పాన్ కార్డు, ఓటరు ఐడీ, రేషన్ కార్డు వంటివి కేవలం వ్యక్తిగత గుర్తింపు, నివాస చిరునామా లేదా పన్ను చెల్లింపు అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయ‌ని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ లేదా భారత ఎన్నికల సంఘం ఎలాంటి లోతైన విచారణ లేకుండా ద‌ర‌ఖాస్తుదారు ఇచ్చే స్వీయ-ధృవీకరణ (Self-declaration) ఆధారంగా వీటిని జారీ చేస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Nov 11, 2026, 7.29 pm IST

Gauhati High Court | పాన్ కార్డు, ఓట‌రు ఐడీ భార‌తీయ పౌర‌స‌త్వానికి ఆధారాలు కావు.. గువాహ‌టి హైకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌
Advertisement

Gauhati High Court | త్రినేత్ర న్యూస్ : పాన్ కార్డు (PAN Card), ఓటరు గుర్తింపు కార్డు (EPIC) మాత్రమే భార‌తీయ పౌర‌స‌త్వాన్ని (Indian Citizenship) నిరూపించ‌లేవ‌ని గువాహ‌టి హైకోర్టు (Gauhati High Court) స్ప‌ష్టం చేసింది. సరైన ఆధారాలు, విచారణ లేకుండా కేవలం స్వీయ-ధృవీకరణ ఆధారంగా జారీ చేసే ఈ పత్రాలు పౌరసత్వానికి రుజువుగా సరిపోవని తేల్చిచెప్పింది. ఈ మేర‌కు ఫారినర్స్ ట్రిబ్యునల్ (Foreigners Tribunal) ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను జ‌స్టిస్ క‌ల్యాణ్ రాయ్ సురానా, జ‌స్టిస్ సుస్మితా ఫుకాన్ ఖౌండ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

అస్సాంకు చెందిన కుల్చన్ బేగం అనే మహిళను 1971 మార్చి 25 తర్వాత భారత్‌లోకి ప్రవేశించిన విదేశీయురాలిగా ఫారినర్స్ ట్రిబ్యునల్ ప్రకటించింది. పిటిషనర్ తాను 1977 ఏప్రిల్ 25న అస్సాంలో జన్మించానని పేర్కొన్నారు. ఈ మేర‌కు 1966, 1970 నాటి ఓటర్ల జాబితాలను సమర్పించారు. వీటితో పాటు ఆమె తండ్రి పాన్ కార్డ్ (PAN card), ఈపీఐసీ (EPIC), తన సొంత ఓటర్ ఐడి, రేషన్ కార్డు, అలాగే ఎన్ఆర్సీ (NRC) దరఖాస్తుకు సంబంధించిన రసీదు వంటి ఇతర పత్రాలను కూడా ఆధారాలుగా చూపారు. త‌న తండ్రి ఒక భార‌త పౌరుడ‌ని ఆయ‌న పేరు ఎన్నిక‌ల రికార్డుల్లో ఉంద‌ని పేర్కొంది. అత‌ను లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతోపాటూ గువాహ‌టి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కౌన్సిల‌ర్‌గా కూడా సేవ‌లందించిన‌ట్లు ఆమె వాదించారు. అయితే, ఆమె త‌న తండ్రిగా పేర్కొన్న వ్య‌క్తితో ర‌క్త‌సంబంధాన్ని నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని భావించిన ఫారిన‌ర్స్ ట్రిబ్యున‌ల్ ఆమె వాద‌న‌ను తిర‌స్క‌రించింది. ఆమె 25 మార్చి 1971 త‌ర్వాత భార‌త్‌లోకి ప్ర‌వేశించిన విదేశీయురాలిగానే ప‌రిగ‌ణించింది.

ఈ తీర్పును స‌వాల్ చేస్తూ స‌ద‌రు మ‌హిళ హైకోర్టును ఆశ్ర‌యించింది. విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టులో పిటిష‌న‌ర్ వాదిస్తూ.. ట్రిబ్యున‌ల్ తాము స‌మ‌ర్పించిన సాక్ష్యాల‌ను స‌రిగ్గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన పత్రాలు త‌న పౌరసత్వాన్ని నిరూపించడానికి సరిపోతాయని చెప్పారు. తన మునుపటి న్యాయవాది తప్పుగా సలహా ఇచ్చారని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే, న్యాయవాది తప్పుడు సలహా ఇచ్చారనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. సాక్ష్యాలను సమర్పించడానికి తగినన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేదని, త‌మ త‌ప్పుల‌ను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చారని కోర్టు మండిప‌డింది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని హైకోర్టు ధ‌ర్మాస‌నం సమర్థించింది. పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6ఏ(2) ప్రకారం త‌న తండ్రి, తాతముత్తాతలతో తనకున్న సంబంధాన్ని నమ్మదగిన ఆధారాలతో నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది.

ఆధార్, పాన్ కార్డు, ఓటరు ఐడీ, రేషన్ కార్డు వంటివి కేవలం వ్యక్తిగత గుర్తింపు, నివాస చిరునామా లేదా పన్ను చెల్లింపు అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయ‌ని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ లేదా భారత ఎన్నికల సంఘం ఎలాంటి లోతైన విచారణ లేకుండా ద‌ర‌ఖాస్తుదారు ఇచ్చే స్వీయ-ధృవీకరణ (Self-declaration) ఆధారంగా వీటిని జారీ చేస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. అందువ‌ల్ల వాటి జారీకి ఉప‌యోగించిన అస‌లు రికార్డుల‌ను నిరూపించ‌నంత వ‌ర‌కూ ఇవి పౌర‌స‌త్వ రుజువుగా చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. పిటిషనర్ తండ్రి ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన ఆమె ఆయన కుమార్తె అవుతుందని నిరూపించలేమని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ఫారిన్ ట్రైబ్యునల్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ.. ఆమె వేసిన‌ రిట్ పిటిష‌న్‌ను హైకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. అంతేకాదు, 2022లో ఆమెకు మంజూరైన మ‌ధ్యంత‌ర బెయిల్‌ను కూడా ర‌ద్దు చేసింది.

Also Read..

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌న్‌ఖ‌డ్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త.. ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లింపు

గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నరు

వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు జీవం పోసింది కేసీఆరే

Advertisement
Advertisement