త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana 12th Class System | తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి స్కూల్‌లోనే 12వ తరగతి వరకు చదవొచ్చు

తెలంగాణలో ఇంటర్ స్థానంలో వచ్చే ఏడాది నుంచే 12వ తరగతి విధానం అమలుకానుంది. విద్యాశాఖలో భారీ సంస్కరణలు, నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

J

Telangana | Published On Nov 11, 2026, 6.55 pm IST

Telangana 12th Class System | తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి స్కూల్‌లోనే 12వ తరగతి వరకు చదవొచ్చు

సంక్షిప్త సారాంశం

వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ స్థానంలో 12వ తరగతి వరకు ఒకే గొడుగు కింద పాఠశాల విద్యా వ్యవస్థను అమలు చేయాలని సీఎం ఆదేశం. 10వ తరగతి తర్వాత విద్యను మధ్యలోనే ఆపేస్తున్న 40 శాతం విద్యార్థులను (ముఖ్యంగా బాలికలను) బడిబాట పట్టించడమే ప్రధాన లక్ష్యం. కొత్త విధానంతో జూనియర్ కాలేజీ లెక్చరర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టీకరణ. అద్దె భవనాల్లోని రెసిడెన్షియల్స్, హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించడంతో పాటు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం.

Advertisement
  • డ్రాపౌట్లకు చెక్
  • లెక్చరర్లకు భరోసా
  • హాస్టళ్లు, వర్సిటీ నియామకాలు
  • తెలంగాణ విద్యాశాఖలో సమూల మార్పులు
  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే 12వ తరగతి విధానం
  • సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

Telangana 12th Class System | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ పాఠశాల విద్యా వ్యవస్థలో చరిత్రాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 12వ తరగతి విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ (MCRHRD)లో విద్యాశాఖ ప్రగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఆధునిక ప్రపంచ పోటీని తట్టుకునేలా నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యాబోధనను సమూలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

4 అంచెల నూతన విద్యా విధానం

కొత్త మార్గదర్శకాల ప్రకారం పాఠశాల విద్యను నాలుగు విభాగాలుగా విభజించనున్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 12వ తరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు (Language Skills), సమాచార విశ్లేషణపై పూర్తి స్థాయి పట్టు సాధించేలా సిలబస్ ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత వారు తమకు నచ్చిన రంగాల్లో నిపుణులుగా ఎదిగేందుకు మార్గం సుగమం కావాలని తెలిపారు.

40% డ్రాపౌట్లను అరికట్టేందుకే ఈ మార్పు

రాష్ట్రంలో పదో తరగతి తర్వాత సగటున 40 శాతం మంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో అత్యధికులు బాలికలతో పాటు దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులే ఉంటున్నారని గుర్తుచేశారు. అయితే 12వ తరగతి వరకు కొనసాగింపుగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) డ్రాపౌట్స్ చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 18 రాష్ట్రాల్లో 12వ తరగతి విధానమే విజయవంతంగా అమలవుతోందని సీఎం వివరించారు.

లెక్చరర్ల సర్వీసులకు పూర్తి రక్షణ

12వ తరగతి విధానం అమల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై జూనియర్ కళాశాలల లెక్చరర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది సర్వీస్ రూల్స్, ఉద్యోగ భద్రత, రిటైర్‌మెంట్ బెనిఫిట్లకు ఎటువంటి భంగం కలగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని తేల్చిచెప్పారు.

అద్దె భవనాలకు స్వస్తి.. యంగ్ ఇండియా స్కూల్స్ వేగవంతం

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని సీఎం గట్టిగా ఆదేశించారు. ఆధునిక వసతులతో సొంత భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని చెప్పారు. పాఠశాలలు, హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం, రన్నింగ్ వాటర్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. మరోవైపు ప్రతిష్టాత్మక 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల' (YIIRS) పనులను వేగవంతం చేయాలని, డిజిటల్ తరగతులు, ల్యాండ్‌స్కేపింగ్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఎంపికలో రాజీపడకుండా ఉత్తమ ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకం.. పాలిటెక్నిక్‌ల ఆధునీకరణ

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యామండలికి సీఎం సూచించారు. ఇప్పటికే ఐటీఐలను 'అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు'గా (ATCs) మార్చడం వల్ల విద్యార్థులకు పెద్దఎత్తున ఉద్యోగాలు దక్కాయని, అదే తరహాలో పాలిటెక్నిక్ కళాశాలల ఆధునీకరణకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement