త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు జీవం పోసింది కేసీఆరే

KTR | ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు జీవం పోసింది కేసీఆరే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శివాల‌యాల మాదిరి ఉన్న ప్రాజెక్టుల‌కు జీవం పోసి.. ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు పారించార‌ని తెలిపారు.

S

Telangana | Published On Nov 11, 2026, 6.55 pm IST

KTR | వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు జీవం పోసింది కేసీఆరే
Advertisement

తుమ్మ‌లు మొలిచిన కాల్వ‌ల్లో కాళేశ్వ‌రం ద్వారా నీళ్లు పారించిండు
ఊరు జీవితం బాగుండాల‌ని చెరువుల‌ను బాగు చేయించిండు
మండుటెండ‌ల్లోనూ చెరువులు మ‌త్త‌డి దుంకాయి
పొలాల‌కు నీళ్లు పారిన‌య్
నిర్మ‌ల్ రైతు గ‌ర్జ‌న స‌భ‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు జీవం పోసింది కేసీఆరే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. శివాల‌యాల మాదిరి ఉన్న ప్రాజెక్టుల‌కు జీవం పోసి.. ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు పారించార‌ని తెలిపారు. నిర్మ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు గ‌ర్జ‌న స‌భ‌లో కేటీఆర్ పాల్గొని రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

నిర్మ‌ల్ జిల్లాకు గొప్ప చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. ఈ చారిత్ర‌క స్థ‌లానికి, కేసీఆర్ ఉద్య‌మానికి అవినాభావ సంబంధం ఉంది. 30 ఏళ్ల కింద‌ట 1996లో నిర్మ‌ల్‌కు ఉప ఎన్నిక వ‌చ్చింది. కేసీఆర్ మంత్రిగా ఇంచార్జిగా వచ్చారు. పోచంపాడు ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ రోజు కేసీఆర్ పోచంపాడు క‌ట్ట మీద చూస్తుంటే తూములు సిలుము ప‌ట్టి పోయాయి. ఒక అనాథ‌గా మారిపోయిన ప్రాజెక్టు ప‌రిస్థితిని చూసి చ‌లించిపోయారు. ఏదో ఒక రోజు మ‌న ప్రాజెక్టుల‌కు మంచి రోజుల రావాలి. మ‌న ప్రాజెక్టులు శివాల‌యాలుగా ఉన్నాయి. ఆంధ్ర‌లోని ప్రాజెక్టులు వైష్ణ‌వ ఆల‌యాలుగా ఉన్నాయి. నేనే తెలంగాణ తీసుకువ‌స్తాన‌ని చెప్పాడు నిర్మ‌ల్ గ‌డ్డ మీద నుంచి. వ‌ట్టిపోయిన శ్రీరాంసాగ‌ర్‌కు కేసీఆర్ జీవం పోశారు. కాళేశ్వ‌రం వ‌ద్ద ఉన్న గంగ‌ను 250 కి.మీ. శ్రీరాం సాగ‌ర్ దాకా తెచ్చిన మ‌హానాయ‌కుడు. గంగ ఎదురెక్కింది. మీ అంద‌రికీ శాశ్వ‌తంగా ఇబ్బంది లేకుండా చేసిండు. తుమ్మ‌లు మొలిచిన కాల్వ‌ల్లో కాళేశ్వ‌రం ద్వారా నీళ్లు పారించిండు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.

భూగ‌ర్భ జ‌లాలు పాతాళానికి ప‌డిపోయాయి

2014కు ముందు క‌రువు, క‌న్నీళ్లు, ఆత్మ‌హ‌త్య‌లు, ప్రాజెక్టులు క‌ట్ట‌రు, క‌రెంట్ ఇవ్వ‌రు. రైతును ప‌ట్టించుకోని దుస్థితి. భూగ‌ర్భ జ‌లాలు పాతాళానికి ప‌డిపోయాయి. బోర్ల‌ మీద బోర్లు వేసి బొక్క బొర్లా ప‌డ్డారు. అర్థ‌రాత్రి వ‌చ్చే క‌రెంట్ కోసం పోతే పాము కాట్ల‌కు, క‌రెంట్ షాక్‌ల‌కు బ‌ల‌య్యారు. కేసీఆర్ స్వ‌యంగా రైతు బిడ్డ కాబ‌ట్టి తెలంగాణ ఏర్పాటుకు మూడేండ్ల ముందే.. చాలా మంది పెద్ద‌ల‌తో ఆలోచ‌న చేశారు. వ్య‌వ‌సాయాన్ని ఎట్ల నిల‌బెట్టాలి, రైతును రాజును చేయాల‌ని సుదీర్ఘ స‌మాలోచ‌న‌లు చేశారు. 60 ఏండ్లు అనుభ‌వించిన గోస చాలు.. క‌రువు, క‌న్నీళ్లు రావొద్దు.. మ‌న రైతు గ‌ల్లా ఎగ‌రేసి బ‌త‌కాల‌ని దీర్ఘ ఆలోచ‌న చేశారు. చెరువు బాగుంటే.. ఊరి జీవితం బాగుంటుంది అని కేసీఆర్ ఆలోచ‌న చేశారు. అందుకే తెలంగాణ రాగానే మొట్ట‌మొద‌టి నిర్ణ‌యం.. మిష‌న్ కాక‌తీయ పేరుతో 46 వేల చెరువుల‌కు జీవం పోశారు. మండుటెండ‌ల్లో చెరువుల మ‌త్త‌డి దుంకాయి. నీళ్లు పొలాల‌కు పారాయని కేటీఆర్ పేర్కొన్నారు.

కేవ‌లం ఆరు నెల‌ల్లోపే.. 60 ఏండ్ల క‌రెంట్ క‌ష్టాల‌ను తీర్చిన నాయ‌కుడు కేసీఆర్

కేసీఆర్ అధికారంలోకి రాగానే నీటి తిరువాను శాశ్వ‌తంగా ర‌ద్దు చేశారు. స‌మైక్య పాల‌న‌లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు.. కేవ‌లం ఆరు నెల‌ల్లోపే మ‌న సింగ‌రేణికి జీవం పోసి, విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు క‌ట్టి, 60 ఏండ్ల క‌రెంట్ క‌ష్టాల‌ను తీర్చిన నాయ‌కుడు కేసీఆర్. అప్పు నుంచి రైతుకు విముక్తి జ‌ర‌గాల‌ని పెట్టుబ‌డి సాయం చేయాల‌ని 11 సార్లు 73 వేల కోట్లు జ‌మ చేశారు. 5 ఎక‌రాల కంటే త‌క్కువ ఉన్నోళ్లు 90 శాతం రైతులు ఉన్నారు. రైతు చ‌నిపోతే ఆ కుటుంబానికి దీమా ఉండాల‌ని 5 ల‌క్ష‌ల రైతు బీమా తెచ్చారు కేసీఆర్. పండించిన ప్ర‌తి గింజ‌ను కొన్నాడు. వారం ప‌ది రోజుల్లోనే మీ ఖాతాల్లో జ‌మ చేశాడు అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణ‌కు ఎక్కిళ్లు ఎందుకు..?

గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో ప్ర‌తి నీటి బొట్టును ఒడిసిప‌ట్టాడు కేసీఆర్. సీతారామ‌, భ‌క్త‌రామ‌దాసు, స‌ద‌ర్‌మ‌ట్, కాళేశ్వ‌రం, పాల‌మూరు ఎత్తిపోత‌ల వంటి ప‌థ‌కాల‌ను క‌ట్టాడు. కానీ క‌లుపు మొక్క లాంటి కాంగ్రెస్ ద‌రిద్రం మ‌న గ‌డ‌ప తొక్కింది. 90 శాతం పూర్త‌యిన పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను పండ‌బెట్టిండు, కాళేశ్వ‌రం మీద క‌క్ష గ‌ట్టిండు. కృష్ణా, గోదావ‌రిలో 1000 టీఎంసీల నీళ్లు వ‌దిలిపెట్టిండు. నీళ్లు ఎత్తిపోయ‌లేదు. ఇంత చిల్ల‌ర రాజ‌కీయమా..? రైతు జీవితం కంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌మే ముఖ్య‌మా..? ఓటు ఎవ‌రికి వేయాల‌నేది ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. కేసీఆర్‌కు పేరు రావొద్ద‌నే నీళ్లు విడిచిపెట్టి క‌రువు తెచ్చిండు. చంద్ర‌బాబు వ‌ట్టిసీమ వ‌ద్ద నీళ్లు ఎత్తిపోస్తుంటే క‌న్నెప‌ల్లి వ‌ద్ద ఎందుకు ఎత్తిపోయ‌లేదు. ఈ నీళ్లు ఎత్తిపోసి ఉంటే ఎస్సారెస్సీలో 100 టీఎంసీ నీళ్లు ఉంటుండే. బంగారం లాగా నీళ్లు వ‌స్తుండే. ఆంధ్రా ప్రాజెక్టులు ఎందుకు నిండినయ్.. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణ‌కు ఎక్కిళ్లు ఎందుకు..? కృష్ణా నీళ్ల‌ను కుప్పం దాకా తీసుకుపోయిండు.. కృష్ణా ప‌క్క‌నే ఉన్న పంట‌లు ఎందుకు ఎండిపోతున్న‌య్. రేవంత్ రెడ్డికి ఇవేమీ ప‌ట్ట‌వు. గోదావ‌రి ఒడ్డుకు ఉండే మండ‌లాల‌ను ఎందుకు క‌రువు మండ‌లాలుగా ప్ర‌క‌టించ‌బ‌డ్డాయి. క‌డెం ప్రాజెక్టు కింద పంట‌లు ఎందుకు ఎండ‌బెట్టారని కేటీఆర్ నిల‌దీశారు.

Advertisement
Advertisement