త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru | బెంగ‌ళూరులో ఎబోలా క‌ల‌క‌లం.. ఉగాండా మ‌హిళ‌కు ల‌క్ష‌ణాలు!

Bengaluru | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో (Bengaluru) ఎబోలా (Ebola) కలకలం రేపింది. ఎబోలా వంటి లక్షణాలతో (Mild Symptoms) బాధపడుతున్న 28 ఏండ్ల‌ మహిళను బెంగ‌ళూరులో ద‌వాఖాన‌కు తరలించారు.

G

National | Published On May 27, 2026, 8.25 am IST

Bengaluru | బెంగ‌ళూరులో ఎబోలా క‌ల‌క‌లం.. ఉగాండా మ‌హిళ‌కు ల‌క్ష‌ణాలు!
Advertisement

Bengaluru | త్రినేత్ర‌.న్యూస్‌: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో (Bengaluru) ఎబోలా (Ebola) కలకలం రేపింది. ఎబోలా వంటి లక్షణాలతో (Mild Symptoms) బాధపడుతున్న 28 ఏండ్ల‌ మహిళను బెంగ‌ళూరులో ద‌వాఖాన‌కు తరలించారు. ఉగాండాకు (Uganda) చెందిన ఆమె ఎబోలా ప్రభావిత ప్రాంతం నుంచి న‌గరానికి వచ్చినట్లు తెలుస్తున్న‌. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవ‌ల ఉగాండ నుంచి వ‌చ్చిన ఆమె తొలుత అహ్మ‌దాబాద్‌కు వెళ్లార‌ని, అటునుంచి బెంగ‌ళూరుకు చేరుకున్నార‌ని వెల్ల‌డించారు.

విమానాశ్ర‌యంలో ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా ఆమెలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని, అయితే ఆమె ట్రావెల్ హిస్ట‌రీ చూసిన త‌ర్వాత ద‌వాఖాన‌కు త‌ర‌లించాల్సి వ‌చ్చింద‌న్నారు. 24 గంట‌ల త‌ర్వాత ఆమెలో స్వ‌ల్పంగా ఎబోలా ల‌క్ష‌ణా బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెప్పారు. దీంతో ఆమెనుంచి సేక‌రించిన న‌మూనాల‌ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి (NIV) పంపించామ‌ని చెప్పారు. ఫ‌లితాలు ఒక‌టీ, రెండు రోజుల్లో వ‌స్తాయ‌న్నారు. నెగెటివ్ అని తేలినా ప్రొటోకాల్ ప్ర‌కారం మ‌రో 48 గంట‌ల త‌ర్వాత మ‌రోసారి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు పంపిస్తామ‌ని తెలిపారు. రెండుసార్లు నెగెటివ్‌గా తేలితేనే ఆమెను హాస్పిట‌ల్ నుంచి పంపిస్తామ‌ని, అప్ప‌టి అబ్జ‌ర్వేష‌న్‌లోనే ఉంటుంద‌ని చెప్పారు.

హెల్త్ ఎమ‌ర్జెన్సీ

మే 15న కాంగోలోని బునియా నగరంలో ఎబోలా తొలి కేసు నమోదైంది. అయితే అంతకు దాదాపు రెండు నెలల ముందే అక్కడ వైరస్ వ్యాప్తి మొదలైనట్లు అంతర్జాతీయ సంస్థల విచారణలో తేలింది. ఈ వైర‌స్ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్‌వో బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ఈ నెల 24న‌ ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండ, దక్షిణ సూడాన్‌లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 204 మంది ఈ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించారు.

హెల్త్ వ‌ర్క‌ర్ మృత్యువాత‌..

ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్‌ వర్కర్‌ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకొని కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించ‌గా చాలా మందికి ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్‌ సోకిన వారికి కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం ఏర్ప‌డుతోంది. వ్యాధి వ్యాపించిన ప్రదేశం కాంగోలో ప్రధాన మైనింగ్‌ కేంద్రం కావడంతో జనాభా రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దాన్ని కట్టడి చేయడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టింది.

మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్‌ల్లో బుండిబుగ్యో ఒకటి. దీన్ని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో మొద‌టిసారిగా కనుగొన్నారు. గతంలో రెండుసార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా తాజాగా వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్‌ పరీక్షల్లో దీన్ని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో కొంత‌ జాప్యం జరిగింది. మొదటి గుర్తించేందుకు నమూనాను వేల మైళ్ల దూరంలో ఉన్న గవర్నమెంట్‌ రీసెర్చి ల్యాబ్‌కు పంపాల్సి వచ్చింది.

ఎబోలా జైర్‌తో పోలిస్తే..

ఎబోలాలో జైర్‌ అనే స్ట్రెయిన్ కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్‌ కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధనల్లో వెల్ల‌డ‌వుతోంది. జైర్‌ వేరియంట్‌ పశ్చిమాఫ్రికా ప్రాంతంలో 2014లో 11,300 మంది ప్రాణాలను బ‌లిగొంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తి. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్‌ సోకిన వారిలో 30% మందే మ‌ర‌ణించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్‌, చికిత్స లేకపోవడంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న నెల‌కొంది. కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు పాకి వందల మందికి సోకింది. ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement