త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | నిర్భ‌య ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తోంది.. ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీం ఆందోళ‌న‌

Supreme Court | రాజ‌ధాని ఢిల్లీలో ఇటీవ‌లే చోటు చేసుకున్న వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై (rape cases reported in Delhi NCR) దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. నెల రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలోని ప‌రి చౌక్ నుంచి ఢిల్లీలోని క‌శ్మీర్ గేట్ వ‌ర‌కు 16 ఏళ్ల బాలిక‌పై క‌దిలే బ‌స్సులో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఇది 2012 నాటి నిర్భయ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తోంద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

D

National | Published On Sep 28, 2026, 12.53 pm IST

Supreme Court | నిర్భ‌య ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తోంది.. ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీం ఆందోళ‌న‌
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇటీవ‌లే చోటు చేసుకున్న వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై జ‌స్టిస్ జేబీ పార్దివాలా, జ‌స్టిస్ కే వినోద్ చంద్ర‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సుమోటోగా విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

రాజ‌ధాని ప్రాంతంలో వ‌రుస లైంగిక దాడి వార్త‌లు త‌మ‌ను క‌లచివేశాయ‌ని పేర్కొంది. బాధ్యులైన అధికారుల జవాబుదారీతనాన్ని (Accountability) ఖరారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్ప‌ష్టం చేసింది. నెల రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలోని ప‌రి చౌక్ నుంచి ఢిల్లీలోని క‌శ్మీర్ గేట్ వ‌ర‌కు ఓ 16 ఏళ్ల బాలిక‌పై క‌దిలే బ‌స్సులో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఇది 2012 నాటి నిర్భయ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తోంద‌ని జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు.

రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడులు.. మహిళల భద్రతకు సంబంధించి శాంతిభద్రతల యంత్రాంగం, ప్రభుత్వ అధికారుల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయా సంఘ‌ట‌న‌లు పోలీసులు, ప్ర‌భుత్వ అధికారుల వైఫ‌ల్యాన్ని స్ప‌ష్టంగా ఎత్తిచూపుతున్నాయ‌ని వ్యాఖ్యానించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని మండిప‌డింది.

కల్కాజీ ఆలయం సమీపంలోని ఓ పార్కులో 17 ఏళ్ల బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపాల‌ను ధ‌ర్మాస‌నం తీవ్రంగా పరిగ‌ణించింది. స‌రైన వెలుతురు లేక‌పోవ‌డం, నిఘా కొర‌వ‌డ‌డం, గ‌స్తీ లేక‌పోవ‌డం వంటి ప‌రిపాల‌నా లోపాల వ‌ల్ల ప‌బ్లిక్ స్పేస్‌లు అధిక ప్ర‌మాదక‌ర ప్రాంతాలుగా మారుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కేవలం ఘటనలపై సానుభూతి వ్యక్తం చేయడం సరిపోదని.. బాధ్యతను నిర్ధారించే వ్యవస్థ ఉండాలని జస్టిస్ పార్దీవాలా స్పష్టం చేశారు. ఈ మేర‌కు వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై విచారణకు ఈ పిల్‌ను లిస్టింగ్‌ చేయాలని రిజిస్ట్రీని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

ఢిల్లీలో అత్యాచార ఘ‌ట‌న‌లు

కాగా, ఇటీవ‌లే కాలంలో రాజ‌ధాని ప్రాంతంలో మ‌హిళ‌లు, చిన్నారులు, మైన‌ర్ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబ‌ర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వ‌రూప్ న‌గ‌ర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేసి ఆపై హ‌త్య చేశారు. మృత‌దేహాన్ని బ‌హిరంగ ప్ర‌దేశంలో ప‌డేశారు. దీంతో యువ‌తి మృత‌దేహాన్ని వీధి కుక్క‌లు పీక్కుతిన్నాయి. ఆ త‌ర్వాత మూడు రోజుల‌కే అంటే సెప్టెంబ‌ర్ 16న ఉత్త‌ర ఢిల్లీలోని స‌ద‌ర్ బ‌జార్ ప్రాంతంలో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 10 ఏళ్ల బాలిక చేతులు, కాళ్లు క‌ట్టేసి ఓ దుకాణంలో లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. సెప్టెంబ‌ర్ 20 కిష‌న్ గంజ్ ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై 34 ఏళ్ల వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. సెప్టెంబ‌ర్ 21న క‌ల్కాజీ మందిర్ స‌మీపంలోని ఓ పార్కులో మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింది.

అంత‌కుముందు ఆగ‌స్టు 4న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మైన్‌పురి జిల్లాకు (Mainpuri district) చెందిన 16 ఏళ్ల బాలికపై ఢిల్లీలో అత్యాచారం జ‌రిగింది. క‌దిలే బ‌స్సులో బాలికపై డ్ర‌వ‌ర్‌, క్లీన‌ర్ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. అంత‌కుముందు మే నెల‌లో ఓ మ‌హిళ‌పై ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఈ రెండు ఘ‌ట‌న‌లు 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భ‌య ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తున్నాయి. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో రాజ‌ధానిలో మ‌హిళ‌లు, బాలిక‌ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నిర్భ‌య ఉదంతం

2012లో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణమైన సామూహిక అత్యాచారం, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మ‌రో నలుగురు దోషులకు మార్చి 20, 2020న తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం అత్యాచార చట్టాలను కఠినతరం చేసింది. 2013లో మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్ (Nirbhaya Fund)ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధిని కేటాయించింది.

Also Read..

ఉజ్జ‌యినిలో ఘ‌ర్ష‌ణ‌.. పోలీసుల‌పై రాళ్లు రువ్విన నిర‌స‌న‌కారులు

ఒక్క రోజులోనే రూ.25వేల‌కు పైగా త‌గ్గిన పసిడి ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల‌కు నిపుణుల అల‌ర్ట్‌..

పాల‌సీ బ‌జార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్‌.. కొనాలా.. వేచి చూడాలా..?

Advertisement
Advertisement