త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court on Stray Dogs | కుక్క ఏ మూడ్‌లో ఉందో, ఎప్పుడు కరుస్తుందో ఎలా తెలుస్తుంది? వీధి కుక్కల సమస్యపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కుక్కల సంచారంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రోడ్లపై కుక్కలు రాకుండా ఉండాలంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి.

J

National | Published On Jan 7, 2026, 3.37 pm IST

Supreme Court on Stray Dogs | కుక్క ఏ మూడ్‌లో ఉందో, ఎప్పుడు కరుస్తుందో ఎలా తెలుస్తుంది? వీధి కుక్కల సమస్యపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Advertisement

Supreme Court on Stray Dogs | వీధి కుక్కల వల్ల ఇప్పటి వరకు చాలా మంది బాధపడ్డారు. ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా దాడి చేసేది వీధి కుక్కలే. ఈ సమస్య ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుక్కల బెడద తప్పడం లేదు. అందుకే వీధి కుక్కల సమస్య చివరకు సుప్రీం మెట్లెక్కింది. వీధి కుక్కల బెడద, అవి కలిగించే ప్రమాదాలపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టి ఆందోళన వ్యక్తం చేసింది.

వీధి కుక్కల బెడద మరియు అవి కలిగించే ప్రమాదాలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క ఏ మూడ్‌లో ఉందో, అది ఎప్పుడు కరుస్తుందో ఎవరూ ఊహించలేరని, అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

రోడ్లు శుభ్రంగా ఉండాలి

రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కుక్కల సంచారంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రోడ్లపై కుక్కలు రాకుండా ఉండాలంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి. రోడ్లపైకి కుక్కలు అకస్మాత్తుగా రావడం వల్ల వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో కుక్కలు ఎందుకు ఉండాలి? అంటూ త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.

Supreme Court Flags Safety Concerns Over Stray Dogs

క్షేత్రస్థాయిలో ఏం మార్పు వచ్చింది?

ఏబీసీ (ABC) నియమాలు అమలు చేయాలని 2018 లోనే సుప్రీం మార్గదర్శకాలు విడుదల చేసినా అవి క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతు జనన నియంత్రణ (Animal Birth Control - ABC) నియమాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని కోర్టు మండిపడింది. 2018లోనే దీనిపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఏం మార్పు వచ్చిందని నిలదీసింది. ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని కోర్టు ప్రశ్నించింది.

కపిల్ సిబల్ వాదనలు

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఒకవేళ ఏదైనా కుక్క దూకుడుగా ఉంటే, దానిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలివేయవచ్చని సూచించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. "తిరిగి వదిలే ముందు కుక్కలకు 'కౌన్సెలింగ్' కూడా ఇస్తే బెటర్, అలా చేస్తే అవి కరవకుండా ఉంటాయేమో" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

నివాస ప్రాంతాల్లో ఆంక్షలు అవసరం

సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకి తమ పరిధిలో కుక్కలను అనుమతించాలా వద్దా అనే నిర్ణయాధికారం ఉండాలని కోరారు. "మనం జంతు ప్రేమికులం కావచ్చు, కానీ అంతకంటే ముందు మానవ ప్రేమికులం కావాలి. రేపు ఎవరో ఒకరు పాలు తాగుతామని చెప్పి బర్రెలను కూడా లోపలికి తీసుకువస్తామంటే అనుమతిస్తారా? అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కదా" అంటూ తుషార్ మెహతా ఉదహరించారు.

ఇప్పటికే విద్యాసంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రద్దీ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించి వాటికి ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వాలు ఆదిశగా చేస్తున్న చర్యలేవీ లేవు.

మున్సిపల్ అధికారులు వీధి కుక్కల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాటి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయడం, వాటికి ఆహారం అందించాలన్నా ప్రత్యేకమైన ఫీడింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, పబ్లిక్‌గా వాటికి ఆహారం అందించడం వల్ల అందరికీ ఇబ్బందులు కలుగుతాయని, అందుకే పబ్లిక్‌గా కుక్కలకు ఆహారం ఎవ్వరూ పెట్టకుండా మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పబ్లిక్‌గా వీధి కుక్కలకు ఫుడ్ పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement