త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొల‌గించ‌లేం.. ఎన్నిక‌ల సంఘానికి సుప్రీం కీల‌క ఆదేశాలు

CEC Gyanesh Kumar | CEC జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)ను విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం మీడియా కథనాల ఆధారంగా ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని సీజేఐ జ‌స్టిస్‌ సూర్య‌కాంత్ నేతృత్వంలోని త్రిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది. ఈ మేర‌కు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను తమ ముందుంచాలని కేంద్ర‌ ఎన్నికల సంఘాన్ని (Election Commission of India) ఆదేశించింది.

D

National | Published On Oct 5, 2026, 2.00 pm IST

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్‌ను తొల‌గించ‌లేం.. ఎన్నిక‌ల సంఘానికి సుప్రీం కీల‌క ఆదేశాలు
Advertisement

CEC Gyanesh Kumar | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నేతృత్వంలో ఎన్నికల సంఘం (ECI) పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచార‌ణ జ‌రిపింది. వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను తమ ముందుంచాలని కేంద్ర‌ ఎన్నికల సంఘాన్ని (Election Commission of India) సుప్రీంకోర్టు ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. మిగ‌తా ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల ఆమోదం లేకుండానే పలు మార్గదర్శకాలను, సాఫ్ట్‌వేర్ మార్పులను ఏకపక్షంగా ప్రవేశపెట్టారనే ఆరోప‌ణ‌ల‌పై ధ‌ర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణ‌యాలు పూర్తిగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒక్క‌రే తీసుకున్నారా..? లేక‌ మెజారిటీ, ఏక‌గ్రీవ ఆమోదంతో జ‌రిగాయా..? అనేది తాము ప‌రిశీలించాల‌నుకుంటున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈ వివాదాస్పద నిర్ణయాల ప్రక్రియ ఎలా జరిగిందో స్పష్టం చేయాలని కోరుతూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

అదే స‌మ‌యంలో విచారణ ముగిసే వరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న పిటిష‌న‌ర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం మీడియా కథనాల ఆధారంగా అంత పెద్ద నిర్ణయం తీసుకోలేమని ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది. సీఈసీ చ‌ట్ట‌విరుద్ధంగా నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు నిరూపిత‌మైతే.. ఆయా నిర్ణ‌యాల‌ను పునఃపరిశీలించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని స్ప‌ష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) సీజేఐ ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఎన్నికల సంఘం ఇచ్చే సమాధానాన్ని పరిశీలించిన తర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read..

నేరస్థుల్లో భయం పుట్టించాలి.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌గాలి : మ‌ల్లికార్జున ఖ‌ర్గే

బోగ‌స్ ప‌త్రాలతో ఘ‌రానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్

Advertisement
Advertisement