త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delimitation Bill 2026 | డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయాలపై కోర్టుల్లో సవాల్‌కు ఆంక్షలు..! కొత్త బిల్లులో కీలక నిబంధన

ముగ్గురు సభ్యుల చేతుల్లో నియోజకవర్గాల పునర్విభజన.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదు.. కమిషన్‌ ఉత్తర్వులపై కోర్టుల్లో సవాల్‌కు ఆంక్షలు.. కొత్త డీలిమిటేషన్‌ బిల్లులో కీలక నిబంధన.

C

News | Published On Nov 28, 2026, 6.20 pm IST

Delimitation Bill 2026 | డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయాలపై కోర్టుల్లో సవాల్‌కు ఆంక్షలు..! కొత్త బిల్లులో కీలక నిబంధన

డీలిమిటేషన్‌ కమిషన్‌ ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయడంపై కొత్త బిల్లులో కీలక నిబంధన. (ప్రతీకాత్మక చిత్రం)

సంక్షిప్త సారాంశం

డీలిమిటేషన్‌ కమిషన్‌ ఉత్తర్వులు గెజిట్‌లో ప్రచురితమైతే వాటికి చట్టబద్ధత వస్తుంది. ఆ ఉత్తర్వులను న్యాయస్థానాల్లో ప్రశ్నించడంపై ఆంక్షలు విధిస్తూ కొత్త బిల్లులో సెక్షన్‌ 11(2)ను పొందుపరిచారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కమిషన్‌ స్వతంత్రత కీలకంగా మారింది. Section 11(2) of the proposed Delimitation Bill 2026 gives statutory force to the Delimitation Commission's orders upon Gazette publication and restricts court challenges. The provision underscores the importance of the Commission's independence, transparency and accountability in redrawing electoral constituencies.

Advertisement

Delimitation Bill 2026: నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్‌ కమిషన్‌ జారీ చేసే తుది ఉత్తర్వులను న్యాయస్థానాల్లో ప్రశ్నించడంపై ఆంక్షలు విధిస్తూ కొత్త ముసాయిదా బిల్లులో కీలక నిబంధనను పొందుపరిచారు.

  • గెజిట్‌లో ప్రచురితమైతే కమిషన్‌ ఉత్తర్వులకు చట్టబద్ధత
  • ముసాయిదా బిల్లులోని సెక్షన్‌ 11(2) కీలకం
  • కమిషన్‌ చైర్మన్‌ నియామకం కేంద్రం చేతుల్లోనే
  • అనుబంధ సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఓటు హక్కు మాత్రం ఉండదు
  • నియోజకవర్గాల పునర్విభజనలో కమిషన్‌ స్వతంత్రతే కీలకం

త్రినేత్ర న్యూస్‌ (2026 నవంబరు 28): మీ ఊరు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండాలి? మీ మండలం ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాలి? ఏ నియోజకవర్గాన్ని ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలి? మహిళలకు ఏ స్థానాలను రిజర్వ్‌ చేయాలి? దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఇటువంటి కీలక నిర్ణయాలు డీలిమిటేషన్‌ కమిషన్‌ (Delimitation Commission) చేతుల్లో ఉండనున్నాయి. కమిషన్‌ జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులు భారత ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైతే వాటికి చట్టబద్ధత వస్తుంది. ఆ ఉత్తర్వులను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీల్లేదని కొత్త డీలిమిటేషన్‌ ముసాయిదా బిల్లులోని సెక్షన్‌ 11(2) పేర్కొంటున్నది.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిబంధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. నియోజకవర్గాల సరిహద్దుల్లో జరిగే మార్పులు రాజకీయ పార్టీల బలాబలాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. మరోవైపు కమిషన్‌ చైర్మన్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి కీలక పాత్ర ఉండటం, అనుబంధ సభ్యులుగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకపోవడంతో కమిషన్‌ స్వతంత్రత, పారదర్శకతకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

డీలిమిటేషన్‌ బిల్లులోని సెక్షన్‌ 11(2)లో ఏమున్నది?

డీలిమిటేషన్‌ కమిషన్‌ సెక్షన్‌ 8, సెక్షన్‌ 9 కింద జారీ చేసే ఉత్తర్వులను భారత ప్రభుత్వ గెజిట్‌ (Gazette of India)లో ప్రచురించాల్సి ఉంటుంది. సంబంధిత రాష్ట్రాల అధికారిక గెజిట్లతోపాటు కనీసం రెండు స్థానిక భాషా పత్రికల్లోనూ వాటిని ప్రచురించాలి. ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. భారత ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైన వెంటనే ఆ ఉత్తర్వులకు చట్టబద్ధత వస్తుందని, వాటిని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీల్లేదని సెక్షన్‌ 11(2)లో పేర్కొన్నారు. అనంతరం ఆ ఉత్తర్వులను లోక్‌సభ, సంబంధిత రాష్ట్రాల శాసనసభల ముందు ఉంచాల్సి ఉంటుంది.

ముగ్గురు సభ్యుల చేతుల్లో నియోజకవర్గాల పునర్విభజన

డీలిమిటేషన్‌ కమిషన్‌లో సుప్రీంకోర్టు సిట్టింగ్‌ లేదా మాజీ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లేదా ఆయన నామినేట్‌ చేసిన ఎన్నికల కమిషనర్‌, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు ఎమ్మెల్యేలు అనుబంధ సభ్యులుగా (Associate Members) వ్యవహరిస్తారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి వీరు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అయితే కమిషన్‌ నిర్ణయాలపై ఓటు వేసే అధికారం వీరికి ఉండదు. తుది నిర్ణయాల్లో కమిషన్‌ ప్రధాన సభ్యుల పాత్రే కీలకం కానున్నది.

నియోజకవర్గాల సరిహద్దులు మారితే రాజకీయ సమీకరణాలూ మారుతాయి!

అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచడం ద్వారా రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యాన్ని దాదాపుగా యథాతథంగా కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే రాష్ట్రాల పరిధిలో నియోజకవర్గాల స్వరూపం మారనున్నది. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు, మండలాలు, పట్టణ ప్రాంతాలు మరో నియోజకవర్గంలోకి వెళ్లవచ్చు.

ప్రస్తుతం జనరల్‌ స్థానాలుగా ఉన్న నియోజకవర్గాలు రిజర్వ్‌డ్‌ స్థానాలుగా మారవచ్చు. రిజర్వ్‌డ్‌ స్థానాలు జనరల్‌ స్థానాలు కావచ్చు. మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలుతో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవన్నీ ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అంశాలే. అందువల్ల పునర్విభజనకు అనుసరించే ప్రాతిపదిక, కమిషన్‌ నిర్ణయాల్లో పారదర్శకత అత్యంత కీలకం.

డీలిమిటేషన్‌పై ప్రజల అభ్యంతరాలకు అవకాశం ఉంటుందా?

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను కమిషన్‌ ప్రజల ముందు ఉంచుతుంది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తుంది. బహిరంగ విచారణలు నిర్వహించి తుది నిర్ణయాలు తీసుకుంటుంది. తుది ఉత్తర్వులపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు పరిమితులు ఉన్న నేపథ్యంలో ముసాయిదా ప్రతిపాదనల దశలోనే ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయడం కీలకం కానున్నది.

పాత డీలిమిటేషన్‌ చట్టంలోనూ ఇదే నిబంధన!

డీలిమిటేషన్‌ కమిషన్‌ ఉత్తర్వులను న్యాయస్థానాల్లో ప్రశ్నించడంపై ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి కాదు. 2002 డీలిమిటేషన్‌ చట్టంలోని (Delimitation Act 2002) సెక్షన్‌ 10(2)లోనూ ఇదే తరహా నిబంధన ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 329(a) కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చట్టాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడంపై పరిమితులు విధిస్తున్నది. నియోజకవర్గాల పునర్విభజనపై వరుసగా న్యాయవివాదాలు తలెత్తి ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడకుండా చూడటం ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించలేమా?

డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ రాజ్యాంగ న్యాయస్థానాల న్యాయసమీక్షాధికారం (Judicial Review) పూర్తిగా రద్దయినట్లు భావించకూడదు. 2024లో కిశోర్‌చంద్ర ఛగన్‌లాల్‌ రాథోడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. కమిషన్‌ నిర్ణయాలు స్పష్టంగా ఏకపక్షంగా, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్న అసాధారణ పరిస్థితుల్లో న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే సాధారణ అభ్యంతరాల ఆధారంగా కమిషన్‌ తుది ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయడం సాధ్యం కాదు.

  • డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయాలను కోర్టుల్లో సవాల్‌ చేయవచ్చా?

సాధారణంగా కమిషన్‌ తుది ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాల్‌ చేయడంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగ న్యాయసమీక్షకు అవకాశం ఉంటుంది.

  • డీలిమిటేషన్‌ బిల్లులోని సెక్షన్‌ 11(2) అంటే ఏమిటి?

కమిషన్‌ సంబంధిత ఉత్తర్వులు భారత ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైన వెంటనే వాటికి చట్టబద్ధత కల్పించే నిబంధన ఇది.

  • డీలిమిటేషన్‌ కమిషన్‌లో ఎంతమంది ప్రధాన సభ్యులు ఉంటారు?

చైర్మన్‌తో కలిపి ముగ్గురు ప్రధాన సభ్యులు ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తారు.

  • డీలిమిటేషన్‌ కమిషన్‌ ఉత్తర్వులపై ఆంక్షలు కొత్తగా తీసుకొచ్చారా?

కాదు. 2002 డీలిమిటేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 10(2)లోనూ ఇదే తరహా నిబంధన ఉన్నది.

Advertisement
Advertisement