త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H5N1 Vaccine | పౌల్ట్రీ రైతుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌ర్డ్ ఫ్లూకు చెక్ పెట్టేలా తొలి స్వ‌దేశీ వ్యాక్సిన్‌

H5N1 Vaccine | పౌల్ట్రీ రైతుల‌కు గుడ్ న్యూస్‌. బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu)కు చెక్‌పెట్టేలా భోపాల్‌కు చెందిన ఐకార్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో H5N1 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు (India Develops First Homegrown H5N1 Vaccine). నవంబర్ 20న జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాక్సిన్‌ను దేశానికి అంకితం చేయనున్నారు.

D

National | Published On Nov 18, 2026, 12.52 pm IST

H5N1 Vaccine | పౌల్ట్రీ రైతుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌ర్డ్ ఫ్లూకు చెక్ పెట్టేలా తొలి స్వ‌దేశీ వ్యాక్సిన్‌
Advertisement

H5N1 Vaccine | త్రినేత్ర న్యూస్ : పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌పై బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu) పంజా విసురుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఈ వైర‌స్ కార‌ణంగా కోళ్లు పిట్ట‌ల్లా రాలిపోతున్నాయి. పౌల్ట్రీ వ్యాపారులు, రైతులు తీవ్ర న‌ష్టాన్ని చ‌విచూడాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో పౌల్ట్రీ రైతులకు ఆందోళనకు గురిచేస్తున్న బర్డ్ ఫ్లూ మహమ్మారికి చెక్ పెట్టేలా భార‌త్ భారత్ మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది (India Develops First Homegrown H5N1 Vaccine).

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ భోపాల్‌కు చెందిన ఐకార్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో H5N1 వ్యాక్సిన్ (H5N1 Vaccine)ను అభివృద్ధి చేశారు. భారతదేశంలోని కోళ్ల ఫారాల్లో అత్యధికంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కారణమవుతున్న H5N1 క్లేడ్ 2.3.2.1a (Clade 2.3.2.1a) స్ట్రెయిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ టీకాను తయారు చేశారు. నవంబర్ 20న జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఈ వ్యాక్సిన్‌ను దేశానికి అంకితం చేయనున్నారు. అయితే, ఈ టీకా మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది అనే వివ‌రాలు తెలియ‌రాలేదు.

ఆందోళ‌న క‌లిగిస్తోన్న‌ H5N1 కేసులు

దేశంలో ఇటీవలే కాలంలో H5N1 కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తోపాటూ తెలుగు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. కేరళలోని అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో సుమారు 26,000 పక్షులను వధించాల్సి వ‌చ్చింది. అటు తమిళనాడులోని కడలూరు జిల్లాలో 40,000 కోళ్లను వధించి, మూడు నెలల పాటు బ్రాయిలర్ పెంపకంపై ఆంక్షలు విధించారు. ఇక ఏపీలోని అనంత‌పురం జిల్లాలోనూ బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం రేపింది. ఈ వైర‌స్ కార‌ణంగా సుమారు 3 వేల కోళ్లు మృతి చెందాయి. ఈ ప‌రిణామాల‌తో అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ ప్ర‌భుత్వం స‌రిహ‌ద్దు చెక్‌పోస్టుల వ‌ద్ద పౌల్ట్రీ ఉత్ప‌త్తులు, దాణా ర‌వాణాపై క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.

మ‌నుషుల‌కూ..

బర్డ్ ఫ్లూ అనేది ప్రధానంగా పక్షులకు సోకే వైరస్. ముఖ్యంగా H5N1 వంటి తీవ్రమైన స్ట్రెయిన్స్ కోళ్లలో అధిక మరణాలకు కారణమవుతాయి. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో మరణాల రేటు దాదాపు 100% వరకు ఉంటుంది. దీనివల్ల లక్షలాది కోళ్లను వధించాల్సి (culling) రావడం, రవాణా ఆంక్షల వల్ల పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. ఇక H5N1 వైరస్ అరుదైన సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో H5N1 వైరస్ మానవులకు సోకిన కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవించాయి. ఈ వైర‌స్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించిన దాఖలాలు లేవు. అయితే, ఈ వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న లేదా చ‌నిపోయిన ప‌క్షుల‌ను నేరుగా చేతుల‌తో తాక‌డం వంటివి చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. గుడ్లు, మీట్ వంటి పౌల్ట్రీ ఉత్ప‌త్తుల‌ను శుభ్రంగా క‌డ‌గాల‌ని.. బాగా ఉడికించి తినాల‌ని సూచిస్తున్నారు.

జీడీపీ వృద్ధి రేటుపై 1.5% ప్ర‌తికూల ప్ర‌భావం

2006లో బర్డ్ ఫ్లూ తొలిసారి బయటపడింది. అప్ప‌టి నుంచి ఇప్పటివరకూ H5N1, H5N8 రకాలకు చెందిన 500కు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాధి అదుపు లేకుండా ప్రబలితే దేశంలోని 20% కంటే ఎక్కువ పౌల్ట్రీ జనాభాకు ముప్పు వాటిల్లడంతో పాటు, దేశ జీడీపీ వృద్ధి రేటుపై 1.5% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేప‌థ్యంలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ H5N1 పౌల్ట్రీ వ్యాక్సిన్ పరిశోధనా రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. పౌల్ట్రీ రంగాన్ని కాపాడటంలో ఇది కీలక అస్త్రంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read..

పెను ప్ర‌మాదంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హ్యాట్రిక్ కొడ‌తాం.. 320 సీట్ల మార్కు దాటడం తథ్యం.. యూపీ ఎన్నిక‌ల‌పై సీఎం యోగి ధీమా

మీ ఆఫీస్ ముంబ‌యిలోనే ఉంచండి.. తెలంగాణ‌లో ఉత్ప‌త్తి చేయండి

Advertisement
Advertisement