త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి

Tummala Nageswara Rao | పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు.

P

Telangana | Published On Sep 29, 2026, 6.46 pm IST

Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి
Advertisement
  • 36శాతం వృద్ధితో దేశంలోనే తెలంగాణ‌కు రెండో స్థానం..
  • రబీ సదస్సులో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు
  • క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతి సుంకం 44 శాతానికి పెంచాల‌ని రిక్వెస్ట్‌
  • ధరలపై ప్రత్యేక కమిటీ వేస్తామన్న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ హామీ

Tummala Nageswara Rao | పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ రబీ సదస్సులో పాల్గొన్న మంత్రి.. రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పంటల వైవిధ్యీకరణ, వాతావరణ మార్పులను తట్టుకునే సాగు, డిజిటల్‌ వ్యవసాయం, వ్యవసాయ మౌలిక వసతులు, రైతులకు రుణ సదుపాయాలపై రాష్ట్రంలో అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

మ‌క్కజొన్న, జొన్నకు పీఎస్‌ఎస్‌ వర్తింపజేయాలి

ఎల్‌నినో, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు మ‌క్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌) పరిధిలోకి తీసుకురావాలని తుమ్మల కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలోని పలు మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రాష్ట్ర సగటు వర్షపాతం కాకుండా మండలాల స్థాయిలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని లోటు, తీవ్ర లోటు వర్షపాత మండలాలకు ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, రక్షిత సాగునీటి సదుపాయాలతో పాటు నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రత్యేక సహకారం అందించాలని కోరారు.

పామ్‌ ఆయిల్‌ సుంకం 44 శాతానికి పెంచాల‌ని..

ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ రైతులు కేంద్రం ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారని తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఈ సాగులోకి వచ్చారని వివరించారు. ఆయిల్‌పామ్‌ దీర్ఘకాలిక పంట కావడంతో రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ధరలు ఎంతో ముఖ్యమన్నారు. రైతుల్లో నమ్మకాన్ని కొనసాగించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ.. ఆయిల్‌పామ్‌ ధరలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు. తెలంగాణలో మట్టి ఆరోగ్య పరీక్షల లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న సుమారు లక్ష నుంచి రెండు లక్షల నమూనాలకు పెంచాలని మంత్రి కోరారు. శాస్త్రీయ మట్టి పరీక్షలతో సమతుల్య ఎరువుల వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు, ఉత్పాదకత పెంపునకు అవకాశం ఉంటుందని తెలిపారు.

మరో 16 కృషి విజ్ఞాన కేంద్రాలు

రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని తుమ్మల తెలిపారు. వ్యవసాయ పరిశోధన, విద్య ద్వారా అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం రైతులకు వేగంగా చేరాలంటే వ్యవసాయ విస్తరణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్రం, ఐసీఏఆర్‌ను కోరారు. కొడంగల్‌లో అగ్రి బిజినెస్‌ పార్క్‌, సెమీ అరిడ్‌ హార్టికల్చర్‌ క్రాప్స్‌ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించిందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నేల ఆరోగ్య సమాచారం, సకాలంలో రుణాలు, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, వ్యవసాయ విస్తరణ సేవలు, మౌలిక వసతులు, నమ్మకమైన మార్కెట్లు అవసరమని తుమ్మల పేర్కొన్నారు. పరిశోధన, వ్యవసాయ విద్య, విస్తరణ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే కొత్త సాంకేతిక పరిజ్ఞానం రైతులకు వేగంగా చేరుతుందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక అవసరాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అవసరమైన సహకారం అందించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Advertisement
Advertisement