త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Mohan Bhagwat | భారతదేశంలో ధర్మం, దేశం అనేవి వేర్వేరు అంశాలు కావని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagwat) అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానమే పరిష్కారం చూపగలదని చెప్పారు.

D

National | Published On Oct 2, 2026, 4.08 pm IST

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
Advertisement

Mohan Bhagwat | త్రినేత్ర న్యూస్ : భారతదేశంలో ధర్మం, దేశం అనేవి వేర్వేరు అంశాలు కావని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagwat) అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానమే పరిష్కారం చూపగలదని చెప్పారు. 'ప్రపంచం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. ఏ ఆనందమూ పరిపూర్ణంగా లభించడం లేదు. ఎక్కడా సమతుల్యత కనిపించడం లేదు. అతివాదం పెచ్చరిల్లుతోంది' అని అన్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులకు పరిష్కారం కోసం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఆశగా చూస్తోందని తెలిపారు.

ముంబైలో జైన్ యువ సేవా సంస్థ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్ పాల్గొని ప్ర‌సంగించారు. "అభివృద్ధి-పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ‌, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌-కుటుంబ జీవితం, మ‌త విశ్వాసం-సంఘ‌ర్ష‌ణ‌ల మ‌ధ్య ఉన్న వైరుధ్యాల‌తో ప్ర‌పంచ దేశాలు స‌త‌మ‌త‌వుతున్నాయి. అభివృద్ధి పెరిగే కొద్దీ ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంది. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల్సిన చోట అభివృద్ధి జ‌ర‌గ‌దు. వ్య‌క్తిగత స్వేచ్ఛ పెరిగే కొద్దీ కుటుంబాలు విచ్ఛిన్న‌మ‌వుతున్నాయి. స‌మాజంలో ప‌త‌నం క‌నిపిస్తోంది. ఏదో ఒక‌దాన్ని వ‌దులుకొని మ‌రొక‌దాన్ని ఎంచుకోవ‌డం వ‌ల్ల సమస్యలు పరిష్కారం కావు. రెండింటినీ స‌మ‌తుల్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లే మార్గం కేవ‌లం భార‌త్ స‌నాత‌న ఆలోచ‌నా విధానం, జ్ఞాన సంప‌ద‌లోనే ఉంది. ఈ విష‌యం ప్రపంచానికి కూడా తెలుసు" అని అన్నారు.

వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, జైన్ ఆగమాలు, త్రిపిటకాలు, గురు గ్రంథ సాహిబ్, సాధువుల బోధనలు భారతదేశ విశాల విజ్ఞాన వారసత్వంలో భాగమ‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ వివ‌రించారు. "భార‌త్‌లో దేశం, ధ‌ర్మం వేర్వేరు కావు. దేశానికి ధర్మమే ప్రాణాధారం, ధర్మమే దేశాన్ని సుస్థిరపరుస్తుంది. ఈ రెండూ ఒక‌దానిపై పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్ల‌డం మ‌న బాధ్య‌త‌. భారతదేశ విధానం కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి కాకుండా.. అందరి సంక్షేమంపైనే ఆధారపడి ఉంటుంది" అని మోహ‌న్‌ భగవత్ చెప్పుకొచ్చారు.

Also Read..

న్యాయమూర్తుల స్థానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదు : సీజేఐ జ‌స్టిస్‌ సూర్యకాంత్

గాంధీ పోరాటాన్ని మ‌రిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు

భ‌ర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్‌

Advertisement
Advertisement