Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్: గాంధీ ఉద్యమాన్ని మరిచి కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఆయన ఆలోచనలతో సంబంధం లేనివారు అనాలోచితంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
- గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలాన్ని వ్యతిరేకించాలి
- గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితోనే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు’
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్: గాంధీ ఉద్యమాన్ని మరిచి కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఆయన ఆలోచనలతో సంబంధం లేనివారు అనాలోచితంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గాంధీని విమర్శిస్తూ, గాడ్సే విధానాలే సరైనవని మాట్లాడే సంస్కృతిని దేశ భక్తులెవరూ అంగీకరించొద్దని కోరారు. గాడ్సూ భావజాలాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు.
అహింస, సత్యాగ్రహం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మహాత్మా గాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకాలన్నారు. గాంధీజీ చూపిన మార్గంలోనే అసమానతలు, వివక్ష, అవమానాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే భావజాలాన్ని సమర్థించే ధోరణులు దేశంలో కనిపించడం బాధాకరమన్నారు. గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా గాడ్సే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ నాయకత్వం, సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గాంధీతో కలిసి నడవని, ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని కొందరు నేడు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దక్షిణాఫ్రికాలో ఎదురైన అవమానం గాంధీజీ జీవితంలో కీలక మలుపుగా మారిందని చెప్పారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో ఫస్ట్‌క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ జాతి వివక్ష కారణంగా రైలు నుంచి బయటకు నెట్టివేయడం ఆయనలో ప్రజల కోసం పోరాడాలనే సంకల్పాన్ని మరింత బలపరిచిందన్నారు.
అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి రైతులు, పేదలు, అణగారిన వర్గాల సమస్యలను అర్థం చేసుకుని సత్యాగ్రహ ఉద్యమాలకు నాయకత్వం వహించారని వివరించారు. చంపారన్ సత్యాగ్రహం నుంచి దండి సత్యాగ్రహం వరకు గాంధీజీ సామాన్య ప్రజల సమస్యలను ఉద్యమాలకు కేంద్రంగా మార్చారని అన్నారు. గుప్పెడు ఉప్పుతోనూ, చిన్న నూలుపోగుతోనూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సవాల్ విసిరిన మహాత్ముడు ప్రజల శక్తిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు.
గాంధీ స్ఫూర్తితోనే ప్రజా పాలన
గాంధీజీ ఆలోచనల స్ఫూర్తితోనే ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు, విద్య, సామాజిక గౌరవం కల్పించడమే ప్రజా పాలన లక్ష్యమన్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులు కలిసి చదువుకునేలా ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 100కు పైగా పాఠశాలలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఒక్కో పాఠశాలకు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ.200 కోట్ల చొప్పున ఖర్చు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వివిధ సామాజిక వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం ద్వారా సమానత్వం, సామాజిక ఐక్యతకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే గాంధీజీ సామాజిక అసమానతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించారని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయన కృషి చేశారని తెలిపారు. హిందూ-ముస్లిం ఐక్యతను బలోపేతం చేసి స్వాతంత్య్ర ఉద్యమాన్ని విస్తృత ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దారని చెప్పారు. గాంధీ, నెహ్రూ తదితర జాతీయ నాయకులు వేసిన పునాదుల వల్లే స్వతంత్ర భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం వంటి రంగాల్లో పురోగతి సాధ్యమైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అంతకుముందు ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు గాంధీ వేషధారణలో ఉన్న చిన్నారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీభవన్లో..
టీపీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని గాంధీభవన్ లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!














